Begin typing your search above and press return to search.

అఫ్గానిస్తాన్‌లో అపార ఖనిజ నిల్వలు .. కన్నేసిన చైనా

By:  Tupaki Desk   |   21 Aug 2021 5:47 AM GMT
అఫ్గానిస్తాన్‌లో అపార ఖనిజ నిల్వలు .. కన్నేసిన చైనా
X
ఆఫ్ఘన్ ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో భవిష్యత్తులో అఫ్గానిస్తాన్‌ కు విదేశీ ఆర్థిక సహాయం అగమ్యగోచరంగా మారింది. దాంతో, అఫ్గాన్ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అఫ్గానిస్తాన్‌ లో ఖనిజ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మైనింగ్‌కు అనుకూలంగా లేవు. ఆ దేశానికి అందే విదేశీ ఆర్థిక సహాయం చాలా ఎక్కువ. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం, 2019లో అఫ్గాన్‌ కు అందిన ఆర్థిక సహాయం స్థూల జాతీయ ఉత్పత్తిలో 22 శాతం. ఇది చాలా ఎక్కువే. కానీ, పదేళ్ల క్రితం 49 శాతం ఉండేదని, అది క్రమేపి తగ్గుగూ 22 శాతానికి వచ్చిందని ప్రపంచ బ్యాంకు తెలిపింది.

ఇప్పుడు ఈ ఆర్థిక సహాయంపై అనిశ్చితి మేఘాలు కమ్ముకొన్నాయి. జర్మనీ విదేశాంగ మంత్రి హయికే మాస్ గత వారం బ్రాడ్‌ కాస్టర్ జెడ్‌ డీఎఫ్‌ తో మాట్లాడుతూ .. తాలిబాన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకుని, షరియా చట్టాన్ని తీసుకువస్తే మేము ఒక్క రూపాయి కూడా సహాయం చేయం అని అన్నారు. అఫ్గాన్ ఆర్థిక పరిస్థితి దుర్భలంగా ఉందని ప్రపంచ బ్యాంకు వ్యాఖ్యానించడానికి కారణం, దేశ భద్రతపై వారు చేస్తున్న విపరీతమైన ఖర్చు. రక్షణ వ్యవస్థపై ఆ దేశ వ్యయం స్థూల జాతీయ ఉత్పత్తిలో 29 శాతం. స్వల్పాదాయం కలిగిన ఇతర దేశాల 3 శాతం సగటుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఇది కూడా తాలిబాన్లు కాబుల్‌ను స్వాధీనం చేసుకోవడానికి ముందున్న పరిస్థితి. భద్రతా సమస్యలు, పెచ్చుమీరిన అవినీతి అఫ్గానిస్తాన్‌లో విదేశీ పెట్టుబడులకు అడ్డుకట్ట వేశాయి.

గత రెండేళ్లల్లో కొత్తగా "గ్రీన్‌ ఫీల్డ్" పెట్టుబడులు ఏమీ రాలేదని ఐక్యరాజ్య సమితి గణాంకాలు చెబుతున్నాయి. దీనికి విదేశీ పెట్టుబడులు కావాల్సి ఉంటుంది. అంటే గత రెండేళ్లల్లో కొత్త పెట్టుబడులేవీ అఫ్ఘానిస్తాన్‌ లోకి రాలేదు.దక్షిణ ఆసియాలో ఇంతకన్నా కొంచెం తక్కువ జనాభా కలిగి ఉన్న నేపాల్, శ్రీలంక దేశాలు అదే సమయంలో వరుసగా పది రెట్లు, యాభై రెట్లు ఎక్కువగా పెట్టుబడులను ఆకర్షించగలిగాయి. అఫ్గానిస్తాన్‌ లో ప్రైవేటు రంగం విస్తరణకు అవకాశం లేకుండా పరిమితంగా ఉందని ప్రపంచ బ్యాంకు వివరించింది. తక్కువ ఉత్పాదకత ఉన్న వ్యవసాయరంగంలో ఉపాధి కేంద్రీకృతమై ఉంది. 60 శాతం కుటుంబాలు వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నాయి.

2001లో అమెరికా దాడి చేసి తాలిబాన్లను తుడిచిపెట్టిన తరువాత, అఫ్గానిస్తాన్ వేగంగా అభివృద్ధి చెందింది. అఫ్గానిస్తాన్ ఆర్థిక పరిస్థితికి సంంబధించిన లెక్కలు నమ్మదగినవి కాకపోవచ్చు. కానీ, ఆ దేశం ప్రపంచ బ్యాంకుకు అందించిన గణాంకాల ప్రకారం, 2003 మొదలుకొని పది సంవత్సరాలలో వార్షిక వృద్ధి రేటు సగటు 9 శాతం కంటే ఎక్కువగా ఉంది. అనంతరం, 2015, 2020ల మధ్య ఈ సగటు 2.5 శాతానికి పడిపోయింది. దీనికి ముఖ్య కారణం విదేశీ ఆర్థిక సహాయం తగ్గిపోవడమేనని విశ్లేషకులు అంటున్నారు.

అఫ్గానిస్తాన్‌ లో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. భద్రతా సమస్యలు, అవినీతి వంటి సమస్యలు తొలగిపోతే విదేశీ వ్యాపారం, పెట్టుబడులను సులువుగా ఆకర్షించవచ్చు.ఆ దేశంలో, రాగి, కోబాల్ట్, బొగ్గు, ఇనుము మొదలైన ఖనిజ వనరులకు కొదవలేదు. చమురు, గ్యాస్, విలువైన రాళ్లు పుష్కలంగా ఉన్నాయి. వీటితోపాటు, లీథియం వనరులు కూడా అధికంగా ఉన్నాయి. ఈ లోహాన్ని బ్యాటరీలు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ కార్లలో వినియోగిస్తారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్లదే హవా కావొచ్చు. వాహన పరిశ్రమ జీరో-కార్బన్ రవాణా మార్గాల వైపు దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ కార్లు ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని వనరులు ఉన్నప్పటికీ, అఫ్గానిస్తాన్ వాటిని సరిగా ఉపయోగించుకోలేకపోయింది. ఇప్పటివరకు లీథియం వనరుల నుంచి అఫ్గాన్ ప్రజలు పొందిన లాభం నామమాత్రమే. పశ్చిమ దేశాల కన్నా, చైనాకు తాలిబాన్లతో సత్సంబంధాలు ఉన్నాయి. తాలిబాన్లు అధికారంలోకి వస్తే చైనాకు ప్రయోజకరంగానే ఉండవచ్చు. ఇప్పటికే ఆ ఖనిజ సంపద పై కన్నేసిన చైనా ఆఫ్ఘన్ కి రోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేసింది. తాలిబన్ల రాజ్యం మొదలైతే , ఆ ఖనిజ సంపద చైనా కి తరలించడానికి చైనా కి మరింత సులువు అవుతుంది.