Begin typing your search above and press return to search.

‘మినీ లాక్ డౌన్‌’లో.. ద‌క్షిణ భార‌తం!

By:  Tupaki Desk   |   25 April 2021 5:30 AM GMT
‘మినీ లాక్ డౌన్‌’లో.. ద‌క్షిణ భార‌తం!
X
దేశంలో లాక్ డౌన్ సైర‌న్ మోగనుందా? మ‌రోసారి భార‌త్‌ మొత్తం నాలుగు గోడ‌ల‌కే ప‌రిమిత‌మ‌య్యే రోజులు రాబోతున్నాయా? అంటే.. ప్ర‌స్తుత ప‌రిస్థితులు ఆ వైపుగానే సాగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ద‌క్షిణ భార‌తంలోని రాష్ట్రాలు అనుస‌రిస్తున్న విధానాలు.. లాక్ డౌన్ భ‌యాల‌ను క‌లిగిస్తున్నాయి. ప‌లు రాష్ట్రాల్లో మినీ లాక్ డౌన్ కొన‌సాగుతుండ‌డ‌మే ఈ ఆందోళ‌న‌కు కార‌ణం.

దేశంలో నిన్న మూడున్న‌ర ల‌క్ష‌ల కేసులు వెలుగు చూశాయి. దాదాపు 2 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప‌రిస్థితి గ‌డిచిన వారం రోజులుగా తీవ్ర‌స్థాయికి చేరుతోంది. దీంతో.. రాష్ట్రాలు అప్ర‌మ‌త్తం అవుతున్నాయి. ఈ క్ర‌మంలో.. తమిళనాడులో ‘మినీ లాక్‌డౌన్’ విధిస్తున్న‌ట్టు ఆ రాష్ట్రం ప్ర‌క‌టించింది. రేప‌టి (ఏప్రిల్ 26) నుండి ఈ నిబంధ‌న‌లు అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని వెల్ల‌డించింది.

ఈ ‘మినీ లాక్‌డౌన్’ ప్ర‌కారం.. రాష్ట్రంలో కఠినమైన ఆంక్షలు అమ‌లు కానున్నాయి. సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, జిమ్స్, మాల్స్, థియేటర్లు, రెస్టారెంట్లు అన్నీ సోమవారం నుండి మూత‌బ‌డ‌నున్నాయి. ఆహారం కీల‌కం కాబ‌ట్టి.. రెస్టారెంట్లు క్యాష్ అండ్ క్యారీ ప‌ద్ధ‌తిలో కొన‌సాగుతాయని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ నిర్ణ‌యంతో డైలీ వ‌ర్క‌ర్స్ తోపాటు చిల్ల‌ర వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు.

ఇక‌, క‌ర్నాట‌క రాష్ట్రంలోనూ కాస్త అటూ ఇటుగా ఇలాంటి నిబంధ‌న‌లే అమ‌ల్లో ఉన్నాయి. కూరగాయలు, పాల ఉత్పత్తులు వంటి నిత్యావసర వస్తువుల సరఫరా మినహా.. అన్ని దుకాణాలను మూసేసింది క‌న్న‌డ స‌ర్కారు. బేకరీలు కూడా మూత‌ప‌డ్డాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్ప‌టికే రాత్రిపూట క‌ర్ఫ్యూ కొన‌సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు రోడ్ల‌మీద‌కు జ‌నం రావొద్ద‌ని ఆదేశాలు జారీచేసింది స‌ర్కారు. తెలంగాణ‌లో రాత్రి 9 నుంచి 5 గంట‌ల వ‌ర‌కు ఈ ఆదేశాలు అమ‌ల్లో ఉంటున్నాయి. వైద్య స‌హాయం, ఆహారం వంటి అత్య‌వ‌స‌రాల‌కోసం త‌ప్ప‌.. ఎవ్వ‌రూ బ‌య‌ట‌కు రావొద్ద‌ని స‌ర్కార్లు ఆదేశించాయి.

మ‌రోవైపు కేరళ రాష్ట్రంలోనూ లాక్డౌన్ త‌ర‌హా ఆంక్షలు కొన‌సాగుతున్నాయి. ఆ రాష్ట్రం వీకెండ్‌ లాక్‌డౌన్ ప్రకటించింది. వాహ‌నాల రాక‌పోక‌ల‌ను కూడా నియంత్రించింది. వ్యాపార స‌ముదాయాల‌పైనా ఆంక్ష‌లు విధించింది. ఈ విధంగా సౌత్ ఇండియా మొత్తం మినీ లాక్ డౌన్ లో ఉంద‌ని అనుకోవ‌చ్చు.

ఈ ప‌రిస్థితి మున్ముందు ఎక్క‌డికి దారితీస్తుందోన‌ని ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. గ‌త లాక్ డౌన్ గాయాల‌ను గుర్తు చేసుకుంటున్న జ‌నం.. మ‌రోసారి పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించే ప‌రిస్థితి వ‌స్తుందేమోన‌ని భ‌య‌ప‌డుతున్నారు.