Begin typing your search above and press return to search.

గాలి ప్యాక‌ప్ ఖాయ‌మంట‌!

By:  Tupaki Desk   |   12 Dec 2016 9:56 AM GMT
గాలి ప్యాక‌ప్ ఖాయ‌మంట‌!
X
కర్ణాటక మాజీ మంత్రి, గ‌నుల ఘ‌నుడు గాలి జనార్ధన్‌ రెడ్డి అరెస్టు ఖాయ‌మా? ఇటీవ‌ల జ‌రుగుతున్న వ‌రుస ప‌రిణామాలు ఇందుకు తార్కాణ‌మా? అంటే అవున‌నే అంటున్నాయి రాజ‌కీయ‌వ‌ర్గాలు. గాలి జ‌నార్ద‌న రెడ్డి సన్నిహితుడు, భూసేకరణ పత్యేకాధికారి భీమా నాయక్‌ను కర్ణాటక పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇటీవల గాలిజనార్దన్‌ రెడ్డి తన వద్ద ఉన్న నల్ల ధనాన్ని వైట్‌గా మార్చేందుకు సాయం చేశాడనే ఆరోపణలతో భీమానాయక్‌తో పాటు అతని కారు డ్రైవర్‌ మహ్మద్‌ను గుల్బర్గాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్ర‌మంలో గాలిని కూడా అరెస్టు చేస్తార‌ని వార్త‌లు వెలువ‌డుతున్నాయి.

ప్ర‌భుత్వ అధికారి అయిన భీమానాయక్‌ డ్రైవర్‌ రమేశ్‌గౌడ్‌ ఆత్మహత్య అనంతరం దొరికిన సూసైడ్‌ నోట్‌తో గాలి జనార్దన్‌ రెడ్డి అక్రమాలు బయటపడిన విషయం తెలిసిందే. తన కూతురు పెళ్లి సమయంలో సుమారు రూ.100 కోట్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు భీమానాయక్‌ సహాయం తీసుకున్నారని సూసైడ్‌ నోట్‌లో రమేశ్‌గౌడ్‌ పేర్కొనడంతో అసలు విషయం తెలిసింది. గతవారం ఆత్మహత్య చేసుకున్న నాయక్‌ డ్రైవర్‌ రమేశ్‌ గౌడ్‌కు గాలి జనార్దన్‌ రెడ్డి అనుచరులనుంచి బెదిరింపులు రావ‌డం వెనుక భీమానాయక్‌ గాలికి సంబంధించిన నల్లధనాన్ని తెల్లగా మార్చిన విషయం రమేశ్‌గౌడ్ తెలియ‌డ‌మే కార‌ణ‌మ‌ని భావిస్తున్నారు. కాగా... నల్లకుభేరుల పట్ల కేంద్రప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఎక్కడ దొరికిపోతామోనన్న భయంతో గాలి అనుచరులు రమేశ్‌గౌడ్‌ను బెదిరించినట్టు సమాచారం. దీంతో మనస్థాపం చెందిన రమేశ్‌గౌడ్‌ సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ సూసైడ్‌ నోట్‌ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు భీమానాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు. గాలికి చెందిన 100 కోట్ల నల్లధనాన్ని 20 శాతం కమిషన్‌తో భీమానాయక్‌ తెల్లగా మార్చినట్టు రమేశ్‌ సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు.

ఇదిలాఉండ‌గా... దాదాపు రూ.500 కోట్ల ఖర్చుతో గాలి కూతురు పెళ్లి చేసినట్టు సమాచారం. ఈ పెళ్లికి కాంగ్రెస్‌, బీజేపీ నేతలతోపాటు దాదాపు 50వేల మంది అతిధులు తరలివచ్చారు. అసలే నోట్ల రద్దుతో సామాన్యుడు కొత్తనోటు కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటే గాలి జనార్ధన్‌ రెడ్డి అంత గ్రాండ్‌గా అన్ని కోట్లు ఖర్చుపెట్టి ఎలా చేశాడన్న అనుమానాలు రేకెత్తాయి. ఈ అంశాన్ని పార్లమెంట్‌లోను ప్రస్తావనకు వచ్చింది. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లో గాలి అరెస్టు ఉంటుంద‌ని త‌ద్వారా త‌మ పార్టీ వారిని కూడా వ‌దిలిపెట్ట‌బోమ‌నే సంకేతాన్ని ప్ర‌ధాన‌మంత్రి పంపించిన‌వారు అవుతార‌ని అంచ‌నా వేస్తున్నారు.