Begin typing your search above and press return to search.

మంత్రి ఆది బంధువుల బ్యాంక్ స్కాం బ‌య‌ట‌కు..

By:  Tupaki Desk   |   26 Sep 2017 5:53 AM GMT
మంత్రి ఆది బంధువుల బ్యాంక్ స్కాం బ‌య‌ట‌కు..
X
ఏపీ రాష్ట్ర మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి బంధువుల య‌వ్వారం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. బ్యాంకు సొమ్మును త‌మ బొక్క‌సంలోకి త‌ర‌లించుకున్న వైనం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. మంత్రిగారి బంధువులంతా క‌లిసి బ్యాంకు సొమ్ముకు స్పాట్ పెట్టిన వైనం బ‌య‌ట‌కు రావ‌టం.. చివ‌ర‌కు కేసు న‌మోదు చేసి ఆస్తుల్ని.. బ్యాంకు అకౌంట్ల‌ను అటాచ్ చేస్తూ అధికారికంగా నిర్ణ‌యం తీసుకోవ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంత‌కీ మంత్రి ఆది బంధువులు చేసిన షాకింగ్ స్కాం వివ‌రాల్లోకి వెళితే..

క‌డ‌ప జిల్లాలో ఉన్న కో ఆప‌రేటివ్ బ్యాంకుల్లో ఒక‌టి.. జ‌మ్మ‌ల‌మ‌డుగు కో ఆప‌రేటివ్ క్రెడిట్ సొసైటీ. ప్ర‌జ‌ల నుంచి డిపాజిట్లు వ‌సూలు చేయ‌టం.. రుణాలు ఇవ్వ‌టం దాని ప‌ని. అయితే.. ఈ బ్యాంకుకు సంబంధించిన వ్య‌వ‌హారాల్ని చూసే కీల‌క‌మైన వారంతా ఏపీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి కుటుంబ స‌భ్యులు.. బంధువులుగా చెబుతారు. ఈ ఆరోప‌ణ‌కు త‌గ్గ‌ట్లే ఆధారాలు ఉండ‌టం గ‌మ‌నార్హం.

మంత్రిగారి బంధువు తాతిరెడ్డి హృషికేశ‌వ‌రెడ్డి సొసైటీ పాల‌క‌వ‌ర్గానికి ఛైర్మ‌న్ కాగా.. మంత్రి సోద‌రుడు క‌మ్ మాజీ ఎమ్మెల్సీ నారాయ‌ణ‌రెడ్డి గౌర‌వ అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక‌.. మంత్రిగారి త‌మ్ముడు శివ‌నాథ‌రెడ్డి డైరెక్ట‌ర్‌ గా ఉన్నారు. మంత్రి బావ క‌మ్ జ‌మ్మ‌ల‌మ‌డుగు మున్సిప‌ల్ ఛైర్ ప‌ర్స‌న్ తుల‌సి భ‌ర్త తాతిరెడ్డి సూర్య‌నారాయ‌ణ‌రెడ్డి ఈ కోఆప‌రేటివ్ బ్యాంకుకు తాతిరెడ్డి సూర్య‌నారాయ‌ణ‌రెడ్డి వైస్ ఛైర్మ‌న్ గా ఉన్నారు.

ఇలా మంత్రి ఆదిగారి ఫ్యామిలీ అండ్ బంధువుల క‌నుస‌న్న‌ల్లో న‌డిచే ఈ బ్యాంకులో డిపాజిట్ అయిన రూ.2కోట్లు (సుమారుగా) ప‌క్క‌దారి ప‌ట్టాయి. స‌హ‌కార చ‌ట్టం కింద న‌డుస్తున్న ఈ సొసైటీకి యాక్సిస్ బ్యాంకులో ఖాతా ఉంది. బ్యాంకు అందే మొత్తాన్ని యాక్సిస్ బ్యాంకు ఖాతాలోకి మ‌ళ్లిస్తారు. ఇక్క‌డే.. మంత్రిగారి బంధువుకు కొత్త ఆలోచ‌న‌లు వ‌చ్చాయి. ఈ ఏడాది మార్చి నుంచి ఆగ‌స్టు మ‌ధ్య కాలంలో యాక్సిస్ బ్యాంకు ఖాతాలో జ‌మ చేయాల్సిన రూ.2కోట్ల మొత్తాన్ని హృషికేశ‌వ‌రెడ్డి వేయ‌క‌పోవ‌టాన్ని గుర్తించారు.

వ్యాపారులు బ్యాంకుకు క‌ట్టిన మొత్తాన్ని త‌న అవ‌స‌రాల కోసం హృషికేశ‌వ‌రెడ్డి వాడుకున్న‌ట్లుగా ఇటీవ‌ల బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీనిపై విచార‌ణ జ‌రిపిన అధికారులు సొసైటీ సొమ్ము ప‌క్క‌దారి ప‌ట్టింద‌న్న విష‌యాన్ని గుర్తించారు. దీంతో స‌హ‌కార చ‌ట్టంలోని సెక్ష‌న్ 73 కింద హృషికేశ‌వ‌రెడ్డి ఆస్తుల్ని.. బ్యాంకు ఖాతాల్ని అటాచ్ చేయాల‌ని జిల్లా స‌హ‌కార శాఖాధికారి ఉత్త‌ర్వులు జారీ చేశారు.

సొసైటీకి చెందిన రూ.1.41 కోట్లు.. మ‌రో రూ.54 ల‌క్ష‌ల్ని త‌న అవ‌స‌రాల‌కు వాడుకున్న‌ట్లుగా అధికారుల విచార‌ణ‌లో హృషికేశ‌వ‌రెడ్డి ఒప్పుకున్నారు. అదేస‌మ‌యంలో సొసైటీ సీఈవోగా వ్య‌వ‌హ‌రిస్తున్న బాలాజీ సైతం రూ.5ల‌క్ష‌లు వాడుకున్న‌ట్లుగా ఒప్పుకున్నారు. మంత్రిగారి బంధువుల వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు రావ‌టంతో బ్యాంకు ఖాతాదారులు త‌మ డ‌బ్బును త‌మ‌కు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు.