Begin typing your search above and press return to search.

ఆదినారాయ‌ణ రెడ్డిది!...రాంగ్ స్టెప్పేనా?

By:  Tupaki Desk   |   9 Feb 2019 8:38 AM GMT
ఆదినారాయ‌ణ రెడ్డిది!...రాంగ్ స్టెప్పేనా?
X
చ‌దిపిరాళ్ల ఆదినారాయ‌ణ రెడ్డి... దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ద్వారా రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టిన నేత‌. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో వైఎస్ కుమారుడు - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలోని వైసీపీ త‌ర‌ఫున జ‌మ్మ‌ల‌మ‌డుగు అసెంబ్లీ నుంచి బ‌రిలోకి దిగి విజ‌యం సాధించారు. అయితే ఎమ్మెల్యేగా ఎన్నికైన కొన్నాళ్ల‌కే ఆయ‌న పార్టీ ఫిరాయించేశారు. అధికార పార్టీ టీడీపీ ఆశ‌జూపిన తాయిలాల‌ను ఆశ‌ప‌డిన ఆది... త‌న‌ను ఎమ్మెల్యేగా గెలిపించిన జ‌గ‌న్ కు ఝ‌ల‌క్కిచ్చి పార్టీ మారిపోయారు. ఏకంగా మంత్రి ప‌ద‌విని కూడా ద‌క్కించుకున్నారు. అయితే అనూహ్యంగా జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంపై నెల‌కొన్న ప్ర‌తిష్ఠంభన నేప‌థ్యంలో టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ర‌చించిన రాజీ ఫార్ములాతో ఇప్పుడు ఆది ఇంటికే ప‌రిమితం కావాల్సిన దుస్థితి వ‌చ్చింద‌న్న వాద‌న వినిపిస్తోంది. జ‌మ్మ‌ల‌మ‌డుగులో టీడీపీ ప్ర‌స్థానం మొద‌లెట్టిన నాటి నుంచి రామ‌సుబ్బారెడ్డి కుటుంబం ఆ పార్టీకి అండ‌గా నిలిచింది. పార్టీకి ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ రామ‌సుబ్బారెడ్డి వ‌ర్గం టీడీపీని వీడ‌లేదు క‌దా.. పార్టీకి పెద్ద దిక్కుగా నిలిచింద‌నే చెప్పాలి.

అయితే వైసీపీ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా ఎన్నికై టీడీపీలోకి వ‌చ్చిన ఆదినారాయ‌ణ రెడ్డి... ఇప్పుడు రామ‌సుబ్బారెడ్డికి పెద్ద ఇబ్బందిగానే మారారు. అయితే వీరిద్ద‌రినీ ఒకే బాట‌లో న‌డిపించేసి... వ‌చ్చే ఎన్నిక‌ల్లో జిల్లాలో బ‌లంగా ఉన్న వైసీపీని దెబ్బ కొట్టాల‌ని చంద్ర‌బాబు వ్యూహం ర‌చించారు. ఈ వ్యూహం ప్ర‌కారం ఆది - రామ‌సుబ్బారెడ్డిల మ‌ధ్య రాజీ కుదిర్చిన చంద్ర‌బాబు... ఆదినారాయ‌ణ రెడ్డిని క‌డ‌ప పార్ల‌మెంటు నుంచి బ‌రిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేశారు. రామ‌సుబ్బారెడ్డితో రాజీకి స‌రేన‌న్న ఆది... క‌డ‌ప పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీకి దిగేందుకు కూడా ఒప్పేసుకున్నారు. అయితే... క‌డ‌ప పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ గెలుపు దుస్సాధ్య‌మేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే... ఈ స్థానం ఏర్ప‌డిన నాటి నుంచి కూడా టీడీపీ ఒకే ఒక్క‌సారి అక్క‌డ విజ‌యం సాధించింది. అది కూడా వైఎస్ రాజ‌శేఖర‌రెడ్డి పార్ల‌మెంటు బరికి శ్రీ‌కారం చుట్ట‌క‌ముందు మాట‌.

ఎప్పుడైతే రాజ‌శేఖ‌ర‌రెడ్డి క‌డ‌ప పార్ల‌మెంటులో కాలుపెట్ట‌రో... అప్ప‌టి నుంచి అక్క‌డ వైఎస్ ఫ్యామిలీనే గెలుస్తూ వ‌స్తోంది. వైసీపీ పుట్ట‌క మునుపు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డితో పాటు ఆయ‌న సోద‌రుడు వైఎస్ వివేకానంద‌రెడ్డి - ఆ త‌ర్వాత ఆయ‌న కుమారుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిలు వ‌రుస‌గా క‌డ‌ప పార్ల‌మెంటును గెలుచుకుంటూ వ‌స్తున్నారు. వైసీపీ ప్ర‌స్థానం మొద‌లైన త‌ర్వాత కూడా అక్క‌డ టీడీపీ ఎంత‌మాత్రం పుంజుకోలేదు క‌దా.. మరింత‌గా క్షీణించింద‌నే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జ‌గ‌న్ అక్క‌డ రికార్డు మెజారిటీతో విజ‌యం సాధించి... క‌డ‌ప గ‌డ‌ప‌లో త‌మ‌ను ఢీకొట్ట‌గ‌లిగే వారెవ్వ‌రూ లేరని నిరూపించారు.

ఇక 2014 ఎన్నిక‌ల్లోనూ జ‌గ‌న్ సోద‌రుడు వైఎస్ అవినాశ్ రెడ్డి క‌డ‌ప బ‌రిలో నిలిచి టీడీపీకి చుక్క‌లు చూపారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఈ స్థానం నుంచి వైసీపీ అభ్య‌ర్థికే విజ‌యావ‌కాశాలున్నాయి. టీడీపీ ఎంత‌గా క‌ష్ట‌ప‌డ్డా కూడా ఫ‌లితం లేద‌ని ఆ పార్టీ వ‌ర్గాలే చెబుతున్నాయి. ఈ కార‌ణంగానే ఆదినారాయ‌ణ రెడ్డి క‌డ‌ప బ‌రికి ఆదిలో అంత‌గా ఆస‌క్తి చూప‌లేదు. అయితే క‌డ‌ప పోరులో గెలిస్తే ఓకే.. లేదంటే ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తామ‌ని చంద్ర‌బాబు కొత్త ప్ర‌తిపాద‌న తెచ్చారు. దీంతో చేసేది లేక బ‌ల‌వంతంగానే ఈ క‌డ‌ప బ‌రికి సై అన్న ఆది... ఎన్నిక‌ల్లో ఓడినా కూడా స‌ర్దుకుపోయేందుకు సిద్ధ‌ప‌డ్డారు. క‌డ‌ప‌లో ఓడితే ఆది ప‌రిస్థితి ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... ఇంకేముంది ఇంటిప‌ట్టున కూర్చోవ‌డమే. ఎందుకంటే.... రాజీ ఫార్ములాలో కుదిరిన ఒప్పందం మేర‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి కూడా ఆదికి కాకుండా ఆది సోద‌రుడి కుమారుడు సుబ్బ‌రామిరెడ్డికి ఇస్తార‌ట‌. సో... అటు క‌డ‌ప బ‌రిలో విజ‌యం క‌ల‌గానే మిగిలిపోనుండ‌గా, ఇటు ఎమ్మెల్సీ కూడా త‌న సోద‌రుడి కుమారుడికి క‌ట్ట‌బెట్టేసిన ఆది... ఇంటి ప‌ట్టునే కూర్చోక త‌ప్ప‌ద‌న్న మాట‌.