Begin typing your search above and press return to search.

సమీర్ వాంఖడే పై మంత్రి సంచలన ఆరోపణలు

By:  Tupaki Desk   |   26 Oct 2021 8:17 AM GMT
సమీర్ వాంఖడే పై మంత్రి సంచలన ఆరోపణలు
X
బాలీవుడ్ బాద్షాహ్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వ్యవహారం థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఆర్యన్ ను విడుదల చేసేందుకు ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే తరపున ఒక వ్యక్తి డబ్బు డిమాండ్‌ చేసినట్లు సంచలన ఆరోపణలు రావడం దుమారం రేపింది. వాంఖడే తరఫు వ్యక్తి రూ.25కోట్లు డిమాండ్‌ చేశారరని ప్రభాకర్‌ సాయీల్‌ అనే ప్రత్యక్ష సాక్షి చేసిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

ఆ రూ.25 కోట్లలో రూ.8 కోట్లు వాంఖడేకు ఇవ్వాలని సదరు వ్యక్తి షారుక్‌ను డిమాండ్‌ చేసినట్లు ప్రభాకర్‌ షాకింగ్ విషయాలు వెల్లడించడం కలకలం రేపింది. దీంతో, వాంఖడే సహా మరింకొందరి పై విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వాంఖడే పై మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ సంచలన ఆరోపణలు చేయడం షాకింగ్ గా మారింది. బాలీవుడ్‌ సెలబ్రిటీలను సమీర్ వాంఖడే బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ మాలిక్ చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.

బాలీవుడ్ సెలబ్రిటీల ఫోన్లను వాంఖడే ట్యాప్‌ చేసేవారని, వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్‌ చేసేవారని ఆయన ఆరోపించారు.

తన ఇంటికి గుర్తుతెలియని ఎన్‌సీబీ సిబ్బంది పేరుతో ఓ లేఖ వచ్చిందని, ఆ లేఖను తాను తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశానని చెబుతున్నారు. ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం వివరాలు ఆ లేఖలో ఉన్నాయని ఆయన ఆరోపించారు. ముంబయి, ఠాణెల్లోని ఇద్దరు ప్రైవేటు వ్యక్తులతో వాంఖడే ఈ బ్లాక్ మెయిల్ వ్యవహారం నడిపేవారని ఆ లేఖలో ఉందని మాలిక్ అన్నారు.

తమ ఫోన్లను కూడా మాలిక్ ట్యాప్‌ చేస్తున్నాని, తన కుమార్తె నిలోఫర్‌ కాల్‌ డేటా రికార్డ్‌ కావాలని ముంబై పోలీసులను అడిగారని మాలిక్ ఆరోపించారు. కానీ, పోలీసులు అందుకు ఒప్పుకోలేదని చెప్పారు. దీంతోపాటు, 26 కేసుల దర్యాప్తు సమయంలో వాంఖడే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి కొందరి పై తప్పుడు కేసులు బనాయించారని ఆ లేఖలో ఉందని మాలిక్‌ వెల్లడించారు. ఈ లేఖను తాను సీఎం, డీజీ కార్యాలయాలకు పంపించానని, ఈ లేఖ పై దర్యాప్తు చేయాలని కోరారు.

అయితే, మాలిక్‌ చెబుతోన్న లేఖలోని వివరాలను సమీర్‌ వాంఖడే ఖండించారు. ఆ లేఖ పెద్ద జోక్‌ అని, అందులో ఉన్నవన్నీ అబద్ధాలని కొట్టిపారేశారు. ఆ లేఖలో చెప్పిందంతా తప్పుడు సమాచారమని, మాలిక్ తన పై ఎన్ని ఆరోపణలైనా చేసుకోవచ్చని అన్నారు. మరోవైపు, మాలిక్ ఆరోపణలు చేసిన లేఖను దర్యాప్తు చేస్తామని ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌ అశోక్‌ జైన్‌ చెప్పారు.