Begin typing your search above and press return to search.

అయ్యో అనిల్ : అంతలోనే కెరీర్ డల్..నిల్..?

By:  Tupaki Desk   |   9 Jun 2022 9:30 AM GMT
అయ్యో అనిల్ : అంతలోనే కెరీర్ డల్..నిల్..?
X
యువ నేత. గట్టిగా నాలుగు పదుల వయసు లేదు, కానీ కీలకమైన మంత్రిత్వ శాఖకు మంత్రిగా మూడేళ్ళ పాటు పాలించారు. నెల్లూరు జిల్లా వంటి రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతాన్ని శాసించారు. జగన్ కి అత్యంత సన్నిహితుడు అన్న పేరుతో ఒక లెక్కన హవా చాటుకున్నారు. ఆయనే తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్. ఒక కెరటంగా ఎగిసిపడిన పొలిటికల్ కెరీర్ ఇపుడు మాజీ కాగానే ఒక్కసారిగా డల్ అయింది. ఇక నిల్ అవకుండా చూసుకోవడమే మిగిలింది అంటున్నారు అంటే అంతలోనే ఎంత కష్టం వచ్చి పడింది అని భావించాల్సిందే.

ఒక ప్రముఖ మీడియాలో వచ్చిన కధనం ప్రకారం చూస్తే దాదాపుగా అనిల్ పొలిటికల్ కెరీర్ కి డోర్స్ క్లోజ్ అయిపోయాయా అన్న చర్చ వస్తోంది. ఇదంతా అనిల్ దూకుడుగా చేసుకున్న రాజకీయ ఫలితమే అంటున్నారు. నెల్లూరు జిల్లాలో అనిల్ ఎంట్రీయే అక్కడ తలపండిన నాయకుడు, ఫ్యామస్ కుటుంబం అయిన ఆనం వారి చలవతో జరిగింది అని అంటారు.

అలా కాంగ్రెస్ లో టికెట్ సంపాదించిన అనిల్ ఆనం ఫ్యామిలీకే ఎదురుతిరగడంతో ఆ ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. తిరిగి 2014 నాటికి ఆయన వైసీపీలో చేరి అక్కడ నుంచి కొత్త జోరు చూపించారు. అప్పట్లో తాము విపక్షంలో ఉన్నామని, అధికారం చేతిలో ఉంటే సత్తా చాటుతామని అనిల్ చెబుతూ ఉండేవారుట.

అనుకున్నట్లుగానే అనిల్ 2019 లో ఎమ్మెల్యేగా గెలిచారు. నెల్లూరు సిటీ నుంచి ఆయనకు చాన్స్ వచ్చింది. ఆ మీదట అనూహ్యంగా జగన్ ఆయన్ని మంత్రిని చేశారు. ఇక మూడేళ్ళ పాటు ఆయన వెనకా ముందూ చూసుకోకుండా రెచ్చిపోయారు అన్న అపప్రధను మూటకట్టుకున్నారు. తరచూ నోరు పారేసుకోవడం, జబ్బలు చరచడం, తొడకొట్టడం, సవాళ్ళతోనే పుణ్య కాలం అంతా సరిపోయింది.

తీరా మాజీ అయ్యాక వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ చేసింది లేదు. సంగం బ్యారేజి పనులు పది శాతం మిగిలి ఉన్నా దాన్ని కూడా పూర్తి చేయించలేకపోయారు. నాడు టీడీపీ హయాంలో కట్టిన అయిదు వేల ఇళ్ళకు మోక్షం కలిగించలేపోయారు. రూ.5263 కోట్లతో నగరంలో అప్పట్లో టీడీపీ టైమ్ లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్ పనులను అనిల్ పూర్తిచేయలేకపోయారు. అంతే కాదు, తాను కొత్తగా ఏమీ చేసినదీ లేదు. అయినా తరచూ ఏడు వందల కోట్ల రూపాయల మేర నెల్లూరు సిటీలో అభివృద్ధి చేశాను అని చెప్పుకున్నా అదేంటో ఎవరికీ తెలియని పరిస్థితి.

ఇక మాజీ అయిన రెండు నెలలలోనే అనిల్ కి అసలు రాజకీయం ఏంటో అర్ధమైపోతూ వస్తోందిట. ఆయన అనుచ‌రులు అభిమానులూ ఒక్కొక్కరూ దూరం అవుతున్న వేళ ఎమ్మెల్యేగా ఉన్న నెల్లూరు సిటీలో పట్టు జారుతున్న వేళ అనిల్ కి సీటు బెంగ పట్టుకుంది అంటున్నారు. ఇక నెల్లూరు నుంచి అనిల్ పోటీ చేసినా గెలిచే సీన్ లేదని అంటూ సోషల్ మీడియాలో కూడా పోస్టింగులు పెట్టి ఆయన వ్యతిరేకులు సీన్ సితార్ చేస్తున్నారుట.

ఇంకో వైపు చూస్తే అనిల్ కి కూడా ఈసారి నెల్లూరు సిటీ అచ్చిరాదని అర్ధమైపోయిందట. దాంతో వెంకటగిరి నుంచి పోటీకి ఆయన చూస్తున్నారని అంటున్నారు. అయితే ఆ విషయం పసిగట్టిన అక్కడి వారు నాన్ లోకల్ కి టికెట్ ఇస్తే గెలిపించమని ముందే సందేశాలు పంపుతున్నారుట.

మొత్తానికి చూస్తే అనిల్ కి ఇపుడు పోటీ చేసేందుకు సీటు లేదు, చెప్పుకునేందుకు మంత్రిగా చేసిన అభివృద్ధి ఏదీ లేదు, ఇక తన పక్కన నమ్మకంగా ఉండే ఆ నలుగురూ లేరు, రేపటి రోజున తన రాజకీయం ఏమవుతుందో ఏమిటో అన్న కంగారు ఈ యువనేతకు పట్టుకుందిట.

ఇక వైసీపీ అధినాయ‌కత్వం కూడా అనిల్ గ్రాఫ్ అలా దారుణంగా తగ్గిపోతూండడాన్ని చూసే ఆయనను మంత్రి పదవి నుంచి పక్కన పెట్టేసింది అంటున్నారు. టోటల్ గా చూస్తే వచ్చే ఎన్నికల్లో అనిల్ కి టికెట్ ఇస్తారా అన్నదే పెద్ద డౌట్ లో పడింది. ఇపుడు నెల్లూరుకి మంత్రిగా ఉనన్ కాకాణి గోవర్ధనరెడ్డితో కూడా మంచి రిలేషన్స్ లేని వేళ ఆనం ఫ్యామిలీతో ఏనాడో లింక్స్ కట్ అయిన వేళ అనిల్ పొలిటికల్ గా నిల్ అవుతారా అంటే ఏమో చూడాల్సిందే. ఆ ప్రముఖ మీడియా కధనం ప్రకారం చూస్తే అనిల్ ఇబ్బందులలో ఉన్నారనే అంటున్నారు.