Begin typing your search above and press return to search.

కొత్త జిల్లాలకు... విశాఖ రాజధానికీ లింకేంటో...?

By:  Tupaki Desk   |   28 Jan 2022 2:30 PM GMT
కొత్త జిల్లాలకు... విశాఖ రాజధానికీ లింకేంటో...?
X
జగన్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వ్యవధిలో మూడు రాజధానులంటూ ప్రతిపాదించారు. అందులో విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ హోదా ఇచ్చారు. ఒక విధంగా అసలైన రాజధాని విశాఖ అని తేల్చేశారు. ఆ తరువాత మూడు రాజధానుల అంశం కాస్తా కోర్టుకు వెళ్ళడంతో న్యాయ వివాదాలు తలెత్తాయి. మొత్తానికి కోర్టులో విచారణ దశలో ఉండగానే మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసుకుంటున్నాట్లుగా ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు.

అయితే తొందరలోనే కొత్త బిల్లుని రూపకల్పన చేసి మూడు రాజాధానులను ఏర్పాటు చేస్తామని నాడు చెప్పారు. అయితే ఆ మీదట మూడు రాజధానుల గురించి ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి కదలికా లేదు. ఉన్నట్లుండి ఇపుడు పదమూడు జిల్లాలు తోసుకువచ్చేశాయి. మూడు పోయి పదమూడు వచ్చే అని టీడీపీ నేతలు ఒక వైపు సెటైర్లు వేస్తున్నారు.

మూడు రాజధానుల కధను చూశారు, ఇపుడు కొత్తగా పదమూడు జిల్లాలు అంటున్నారు అని బాగానే సెటైర్లు కూడా పడుతున్నాయి. ఈ నేపధ్యంలో వైసీపీ సర్కార్ కి సెంటిమెంట్స్ ప్రజల ఎమోషన్స్ తో ఆడుకోవడం ఆటగా మారిందని టీడీపీ ఘాటుగా విమర్శలు చేస్తోంది. ఇవన్నీ ఇలా ఉండగానే మంత్రి అవంతి శ్రీనివాసరావు సడెన్ గా మళ్లీ రాజధానుల అంశాన్ని తీసుకువచ్చారు.

ఇపుడు అంతా కొత్త జిల్లాలా గురించి మాట్లాడుకుంటూంటే ఆయన మూడు రాజధానులు అంటూ ఫ్లాష్ బ్యాక్ ని కెలుకుతున్నారు. ఇంతకీ మూడు రాజధానులు అవుతాయా. అయితే ఈ టెర్మ్ లో అవుతాయా అన్న డౌట్లు వైసీపీలోనే ఉన్నాయి. కానీ మంత్రి అవంతి మాత్రం పక్కా క్లారిటీతో మూడు రాజధానులూ కచ్చితంగా జగన్ త్వరలోనే ఏర్పాటు చేసి తీరుతారు అని బల్లగుద్దుతున్నారు.

దానికి ప్రాతిపదిక ఏంటి అంటే జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా పదమూడు జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసి చూపించారని, ఆయన ఎక్కడా తగ్గలేదని, అందువల్ల ఇపుడు మూడు రాజధానుల విషయంలో వెనక్కి పోవడం జరగ‌దు అంటున్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయి తీరుతుంది అని కూడా అవంతి చెబుతున్నారు. ఇక్కడ అవంతి చెప్పింది జగన్ పట్టుదల గురించి, ఆయన మాట తప్పకపోవడం గురించి.

జగన్ అనుకుంటే కచ్చితంగా చేస్తారు కాబట్టి మూడు రాజధానులు కూడా తప్పక జరిగి తీరుతాయని అంటున్నారు. అయితే మూడుకూ పదమూడుకూ చాలా తేడా ఉందని మిగిలిన వారు అంటున్నారు. కొత్త జిల్లాలు ఎన్ని అయినా ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి టెక్నికల్ గా కానీ న్యాయపరంగా కానీ ఇబ్బందులు ఏవీ లేవు. కానీ మూడు రాజధానులు అంటేనే అది వివాదమే అవుతుంది. పైగా అమరావతి రాజధాని రైతులతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు అన్నీ ముందుకు వస్తాయి.

అందువల్ల మూడు రాజధానులు అంత సులువు కాదు అనే అంటున్నారు. ఆ విషయం తెలిసే చట్టాన్ని రద్దు చేసుకున్నారని కూడా విపక్షాలు అంటున్నాయి. అయితే అపుడపుడు ఇలా మూడు రాజధానుల మీద వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు అంటే జనాలను మభ్యపెట్టడానికే అంటున్నారు. మూడు అయినా పదమూడు అయినా ముందు రియల్ ఎస్టేట్ బిజినెస్ వారికి హెల్ప్ చేయడానికే తప్ప సామాన్యుడికి ఒరిగేది ఏముంది అన్న మాట కూడా మరో వైపు ఉందని చెబుతున్నారు.