Begin typing your search above and press return to search.

గంటాపై కస్సుమన్న అవంతి.. మాటలతో కడిగేశాడు

By:  Tupaki Desk   |   2 Sep 2019 10:27 AM GMT
గంటాపై కస్సుమన్న అవంతి.. మాటలతో కడిగేశాడు
X
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్. ఇటీవల గంటా తనపై చేసిన విమర్శల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గంటాను మాటలతో కడిగిపారేశారు. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి..ఆ పార్టీ కార్యాకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి.. వేరే పార్టీలో తనకు ఆఫర్ ఉందనే వ్యక్తిని ఏమనాలి? అంటూ క్వశ్చన్ చేస్తూనే.. తన దృష్టిలో గంటా మనిషే కాదని.. ఆయనో రాజకీయ వ్యభిచారంటూ విరుచుకుపడ్డారు. నెల్లూరులో మెస్ టికెట్లు అమ్మటం నుంచి గంటా చరిత్ర తనకు తెలుసంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన అవంతి మాటలు ఎలా ఉన్నాయన్నది ఆయన మాటల్లోనే చూస్తే..

"బాబు మాదిరి గంటాకు మైండ్ పోయినట్లుంది. బాబు ముఖ్యమంత్రి.. తాను మంత్రి అని గంటా అనుకుంటున్నట్లున్నాడు. చంద్రబాబును మీడియా అడగాలి. మీ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే బహిరంగ వేదిక మీద మాట్లాడుతూ.. వేరే పార్టీలో ఆఫర్ ఉందని చెప్పటం ఏమిటి? ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే.. పార్టీ మీటింగ్ పెట్టి ఆ పార్టీలో అవకాశం ఉంది. ఈ పార్టీలో అవకాశం ఉందంటున్నాడు. అలా మాట్లాడుతున్న నేత మీద చర్చ తీసుకోరా? అని చంద్రబాబును అడగాలి"

"నేను మంత్రి కాకుంటే నా దృష్టిలో గంటా మనిషే కాదు. నమ్మిన వాడిని మోసం చేసే వాడు. నమ్మించి మోసం చేసేవాడు. ఎవరైతే జీవితం ఇస్తే వాడికి సున్నాలు పెట్టేవాడు. అయ్యన్న పాత్రుడ్ని అడిగితే గంటా చరిత్ర చెబుతాడు. అయ్యన్నపాత్రుడ్ని ఏకాకిని చేయటానికి చంద్రబాబు పంచన చేరాడు. గంటాకు నిజంగా దమ్ము.. ధైర్యం ఉంటే.. ముందు ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేయాలి"

"పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ.. పార్టీ మార్పు గురించి మాట్లాడటమా? చంద్రబాబుకు రోషం ఉంటే గంటా శ్రీనివాస్ మీద యాక్షన్ తీసుకోవాలి. నీతి.. నిజాయితీకి.. పారదర్శకంగా వ్యవహరించే వారికి పెద్దపీట వేస్తానని జగన్ చెబుతున్నారు. దొంగలకు.. భూకబ్జాకోరులకు.. అవినీతిపరులకు జగన్ అవకాశం ఇవ్వరు. ఎమ్మెల్యే అయ్యాక తాను గెలిచిన నియోజకవర్గంలో ఎన్నిసార్లు పర్యటించారు? అసెంబ్లీకి ఎన్ని రోజులు వచ్చారు? అన్నది చెప్పాలి"

"గంటా ఏమనుకుంటున్నారంటే రాజకీయం అంటే వ్యాపారమని భావిస్తాడు. అందుకే ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తే.. మరో నియోజకవర్గంలో పోటీ చేస్తుంటాడు. ఒకసారి గెలిచిన నియోజకవర్గంలో మరోసారి పోటీ చేస్తే అతనికి డిపాజిట్లు కూడా రావు. అందుకే.. ప్రతిసారీ నియోజకవర్గాన్ని మార్చేస్తుంటాడు. నెల్లూరులో అతని జీవితం ఎలా స్టార్ట్ అయ్యిందో.. మెస్ లో టోకెన్లు అమ్మిన చరిత్ర అంతా తెలుసు"

"గంటా ఏమీ ఆకాశంలో నుంచి రాలేదు. తాను ఇన్ ఛార్జ్ మంత్రిగా ఉన్న విజయనగరం జిల్లాకు వెళ్లి మంత్రి సత్తిబాబు గురించి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. తాను ఇన్ చార్జ్ మంత్రిగా ఉన్న జిల్లాలో తొమ్మిది సీట్లలో ఒక్కటి గెలిపించుకోలేని వ్యక్తి మాట్లాడటమా? సత్తిబాబు.. జగన్ గురించి మాట్లాడే అర్హత ఉందా?"

"గంటా శ్రీనివాసరావు అనే వ్యక్తి గ్రూపులు.. స్వార్థ రాజకీయాలు.. తన సొంత ప్రయోజనాలు తప్పించి ఇంకేమీ పట్టవు. గంటా వెనుక ఓ వందమంది భజన పరులు ఉండి పొగడొచ్చు. రాజకీయంలో ఉన్నోడి ప్రతి ఒక్కడి వెనుక భజనపరులు కొందరు ఉంటారు. వారి మాటలు వింటే అంతే. తన చుట్టూ తిరిగే అనుచరులకు గంటా ఏమైనా చేశాడా? నేను అలాంటి మంత్రిని కాదు. అసలు నేను మంత్రి అనే కన్నా.. అవంతి శ్రీనివాస్ అనే అనుకుంటానని.. మంత్రి పదవి.. ఎంపీ.. ఎమ్మెల్యే పదవుల కంటే కూడా అవంతి శ్రీనివాస్ శాశ్వితం. ప్రజల గుండెల్లో ఉండాలనుకుంటాను"

"గంటా మాదిరి మంత్రి పదవి ఉంటే విర్రవీగిపోవటం లాంటివి చేయను. నేను దమ్మున్న మగాడ్ని. గంటా మాదిరి కాదు. పార్టీ పవర్లో ఉంటే ఒకలా.. అధికారం లేకుండా వేరే పార్టీలో ఆఫర్ ఉందనటం లాంటి మాటల్ని మాట్లాడను. ముఖం మీద మాట్లాడటమే కానీ.. వెనుక మాట్లాడటం ఇష్టం ఉండదు. వ్యక్తిగతంగా గంటా అంటే కక్ష లాంటివేమీ లేవు. ఆయనంటే ఎలాంటి కోపం లేదు. కానీ.. ఆయన వ్యక్తిత్వం అంటేనే కోపం"

"రాజకీయాల్లో ఉన్న వారు వ్యవస్థకు.. ప్రజలకు.. పార్టీకి.. నమ్మిన అనుచరులకు జవాబుదారీతనం ఉండాలి. అసలు నువ్వు ఏ పార్టీలో ఉన్నావో తెలుసా? ఎవరితోనైనా పెట్టుకుంటే పెట్టుకో.. నాతో మాత్రం కాదు. అయ్యన్నపాత్రుడంత మంచోడ్ని కాదు. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతా.. నన్ను ఎవరూ ఆపలేరన్న మాటలేంది? సిగ్గు ఉండాలి గంటాకు? అసలు మనిషేనా?"