Begin typing your search above and press return to search.

ఆయన్నే గట్టిగా నమ్ముకున్న అవంతి... ?

By:  Tupaki Desk   |   14 Aug 2021 9:30 AM GMT
ఆయన్నే గట్టిగా నమ్ముకున్న అవంతి... ?
X
విశాఖ జిల్లాకు చెందిన ఏకైక మంత్రి అవంతి శ్రీనివాసరావుకు మంత్రి పదవి మీద బెంగ ఎక్కువ అయిపోతోంది. రోజు రోజుకీ విస్తరణకు గడువు దగ్గర పడుతోంది. దాంతో తాను అయిదేళ్ళ పాటు మంత్రిగా ఉండాలని అవంతి కూడా గట్టిగానే భావిస్తున్నారు. తాను సమర్ధంగానే పనిచేశానని ఆయన అంటున్నారు. పైగా తన మీద ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదని కూడా ఆయన చెబుతున్నారు. తాను ముఖ్యమంత్రి జగన్ చెప్పిన ప్రతీ దాన్ని తుచ తప్పకుండా పాటించానని ఆయన నమ్మకం మీద ఉన్నారు. అందువల్ల తనకు అయిదేళ్ళ మంత్రిగిరీ ఖాయమనే ఆయనకు ఈ రోజుకీ ఒక ధీమా అయితే ఉంది. కానీ ఎక్కడో తేడా కొట్టి అసలుకే ఎసరు వస్తే ఆ సంగతేంటి అన్నది కూడా అవంతిని తిన్నగా ఉండనీయడంలేదుట.

దాంతో ఆయన ఉత్తరాంధ్రా జిల్లాల వైసీపీ ఇంచార్జి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డినే నమ్ముకున్నారు. మంత్రి అయిన కొత్తలో విజయసాయిరెడ్డితో అవంతి విభేదించారు అన్న ప్రచారం కూడా జరిగింది. ఇక గత ఏడాది కరోనా వేళ అవంతి అలిగి మరీ కొన్నాళ్ళ పాటు ఇంటి నుంచి బయటకు రాలేదు అన్నదీ ప్రచారంలో ఉంది. దీనికి కారణం పేరుకు తాను మంత్రిగా ఉన్నా కూడా ఎంపీ విజయసాయిరెడ్డి మొత్తం పెత్తనం చేస్తున్నారు అన్నదే ఆయన బాధట. ఆ తరువాత అసలు విషయం అర్ధమైంది.

జగన్ కి కుడి భుజం లాంటి విజయసాయిరెడ్డి ముందు తాను పోటీ పడడం కంటే రాజీ మార్గం ఎంచుకుంటేనే మేలు అని తలచిన అవంతి ఆ దిశగానే తన కార్యాచరణ రూపొందించుకుని ఈ రోజుకీ అలాగే సాగుతున్నారు. దాంతో విజయసాయిరెడ్డికి ఆయన మంచి సన్నిహితుడిగా మారిపోయారు. అయితే విజయసాయిరెడ్డికి మరో ప్రియమైన శిష్యుడు ఉన్నారు. ఆయనే అనకాపల్లికి చెందిన ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్. దాంతో ఈసారి విస్తరణలో ఆయన పేరునే జగన్ కి చెబుతారు అంటున్నారు. అయితే ఇపుడు విజయసాయిరెడ్డికి కూడా పెద్ద ఇబ్బందే వచ్చిపడిందిట.

ఒక వైపు గుడివాడ, మరో వైపు అవంతి ఇద్దరూ కూడా కావల్సిన వారు అయిపోయారు. దాంతో ఎవరికి మంత్రి పదవి ఇప్పించాలో ఆయనకే అర్ధం కావడంలేదుట. ఇక జగన్ తీరు చూస్తే కొత్త వారికి చాన్స్ ఇద్దామనుకుంటే కచ్చితంగా అవంతిని తప్పించేస్తారు అంటున్నారు. దాంతో అవంతి పేరుని విజయసాయిరెడ్డి చెప్పినా కూడా ఉపయోగం ఉంటుందా అన్నదే చర్చగా ఉంది. ఏది ఏమైనా విజయసాయిరెడ్డిని గట్టిగా నమ్ముకుని తనను గట్టున పడేయమని అవంతి కోరుకుంటున్నారు. ఇంతకీ ఆయన అయిదేళ్ళ మంత్రిగా ఉంటారా. ఏమో చూడాలి.