Begin typing your search above and press return to search.

షర్మిలమ్మపై క్లారిటీ ఇచ్చిన మంత్రి బాలినేని

By:  Tupaki Desk   |   6 Jan 2022 10:00 AM IST
షర్మిలమ్మపై క్లారిటీ ఇచ్చిన మంత్రి బాలినేని
X
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సంచలనంగా మారిన షర్మిల.. ఏపీ అధికారపక్ష నేతలకు నిద్ర పోనివ్వట్లేదన్న మాట వినిపిస్తోంది. తన సోదరుడు కమ్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఆస్తుల అంశంపై గొడవలు పడినట్లుగా వార్తలు రావటం.. దానికి సంబంధించి ఎలాంటి కౌంటర్ ఏపీ అధికారపక్షం నుంచి రాలేదు.

ఇదే సమయంలో.. ఏపీలో షర్మిల పార్టీ పెడతారన్న ప్రచారం మొదలైంది. దీనికి తగ్గట్లే.. రెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఏపీలో పార్టీ పెట్టాలని అనుకుంటున్నారట.. అంటూ మీడియా ప్రతినిధి ఒకరు ప్రశ్నను సంధించటం.. అందుకు సమాధానం చెప్పిన షర్మిల.. దేశంలో ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చంటూ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి.

అంటే.. ఏపీలో పార్టీ పెట్టనని చెప్పలేదని కొందరు చర్చ మొదలు పెడితే.. మరికొందరు మాత్రం అందుకు కౌంటర్ గా.. పెడతానని కూడా చెప్పలేదు కదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ వ్యాఖ్యలపై ఇప్పటివరకు ఏ వైసీపీ నేత రియాక్టు అయ్యింది లేదు. ఆ కొరతను తీరుస్తూ.. తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రియాక్టు అయ్యారు. షర్మిల మాటలకు తనదైన అర్థాన్ని చెప్పే ప్రయత్నం చేశారు.

ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెడతానని షర్మిల చెప్పారే కానీ.. ఏపీలో పెడతానని చెప్పలేదని స్పష్టం చేశారు. షర్మిల ఏపీలో పార్టీ పెడతారని కొందరు అభూత కల్పనలు చేస్తున్నారని.. షర్మిలమ్మతోపాటు తామంతా వైఎస్సార్ కుటుంబమని.. తామంతా ఒకటేనని తేల్చి చెప్పటం గమనార్హం. మరి.. మంత్రి బాలినేని మాటలకు షర్మిల ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.