Begin typing your search above and press return to search.

అమ్మ ఒడి ల‌బ్ధిదారుల సంఖ్య త‌గ్గ‌లేదు: మంత్రి బొత్స వివ‌ర‌ణ‌

By:  Tupaki Desk   |   23 Jun 2022 1:32 PM GMT
అమ్మ ఒడి ల‌బ్ధిదారుల సంఖ్య త‌గ్గ‌లేదు:  మంత్రి బొత్స వివ‌ర‌ణ‌
X
రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న అమ్మ ఒడి ప‌థ‌కం లబ్ధిదారుల సంఖ్యపై కొన్ని రోజు లు గా రాష్ట్రంలో గంద‌ర‌గోళం నెల‌కొంది. గ‌త ఏడాది ల‌బ్ధి పొందిన వారి పేర్లుకూడా ఈ సారి జాబితాలో లేక పోవ డంతో ఈ ప‌థ‌కాన్ని కుదించారంటూ.. ప్ర‌చారం జ‌రిగింది. ఇప్ప‌టికీ అమ్మ ఒడి ల‌బ్ధిదారులు ఇదే ఆలోచ‌న లో ఉన్నారు. అయితే.. దీనిపై విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ వివ‌ర‌ణ ఇచ్చారు.

రాష్ట్రంలో అమ్మ ఒడి ల‌బ్ధిదారుల సంఖ్య తగ్గిందనడం అవాస్తవమన్నారు. అటెండెన్స్‌ ఆధారంగా లబ్ధి చేకూరుతుందన్నారు. పిల్లలను సక్రమంగా స్కూల్‌కు పంపితేనే పథకం వర్తిస్తుందన్నారు.

పిల్ల‌ల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా పాఠ‌శాల‌కు పంపించాల‌నే ఉద్దేశంతోనే ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టిన‌ట్టుచెప్పారు. ఈ క్ర‌మంలోనే డ్రాపౌట్లు నివారించేందుకు.. విద్య‌ను క్షేత్ర‌స్థాయిలో పేద కుటుంబాల‌కు సైతం చేర‌వేసేందు కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు మంత్రి బొత్స వివ‌రించారు.

ఇక‌, ఈ ప‌థ‌కం కింద ఇస్తున్న రూ.15 వేల రూపాయ‌ల్లో రూ.2 వేలు త‌గ్గిస్తున్నార‌నేది.. కూడా పాఠ‌శాల‌ల ప్ర‌యోజ‌నం కోస‌మేన‌ని చెప్పారు. పాఠశాల నిర్వహణ కోసం ఆ నిధుల‌ను ఖర్చు చేస్తామ‌న్నారు. ఈ ప‌థ‌కం కింద 75 శాతం హాజ‌రు ఉన్న ప్ర‌తి విద్యార్థి త‌ల్లి ఈ ప‌థ‌కానికి అర్హులేన‌ని అన్నారు. ఇదిలావుంటే, స్కూళ్లు, కాలేజీల్లో అధ్యాపకులు కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి బొత్స తెలిపారు.

ఈ నెల 27న అమ్మ ఒడి కార్యక్రమం నిర్వహిస్తామని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదగా తల్లుల అకౌంట్లలోకి నగదు జమ చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

గతంలో 32 శాతం మాత్రమే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదివేవారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక విద్యార్థుల సంఖ్య 65 శాతానికి పెరిగింద‌ని.. వివ‌రించారు. ఇప్పుడు చాలా జిల్లాల్లో ప్ర‌భుత్వ స్కూళ్ల‌లో సీట్లు లేక‌పోవ‌డం విశేషమ‌ని చెప్పారు.