Begin typing your search above and press return to search.

బాబు చెప్పారని.. బుగ్గన భలేగా చెప్పారుగా?

By:  Tupaki Desk   |   2 July 2022 4:55 AM GMT
బాబు చెప్పారని.. బుగ్గన భలేగా చెప్పారుగా?
X
నిజమే.. మిగిలిన రాజకీయ పార్టీ అధినేతలతో పోలిస్తే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మీడియాతో ఎక్కువసేపే మాట్లాడతారు. అంతేకాదు.. తరచూ ఆయన ఏదో ఒక ప్రకటన చేస్తుంటారు. ఈ కారణంతోనే కావొచ్చు.. చంద్రబాబు అలా అన్నారని.. ఇలా అన్నారంటూ.. ఆయన పేరుతో ఏదో ఒక వ్యాఖ్య చేసి విరుచుకుపడటం ఆయన రాజకీయ ప్రత్యర్థులకు అలవాటుగా మారిందని చెప్పాలి. చంద్రబాబు నిజంగా అన్నారా? లేదా? ఏ సందర్భంలో అన్నారు? ఏ మాట అన్నారు? అన్న విషయాల్ని పక్కన పెట్టేసి.. తమకు నచ్చిన అంశం వరకు కట్ చేసి చెప్పటం ఈ మధ్యన ఎక్కువైంది. ఈ విషయంలో బాబును బద్నాం చేయటంలో ఏపీ అధికారపక్షానికి మించిన వారు ఉండరనే మాట వినిపిస్తూ ఉంటుంది.

దగ్గర దగ్గర పదిహేనేళ్లుగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు.. తాను చేసిన పనుల గురించి చెప్పుకోవటం అలవాటు. ఈ క్రమంలో ఆయన మాటలు కొంతమేర అతిశయంగా అనిపిస్తాయి కానీ.. వాస్తవ కోణంలో చూస్తే.. ఆయన చెప్పే మాటల్లో నిజం లేకుండా పోదు.

ఎవరెన్ని చెప్పినా.. ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఐటీలో ఇంత బలంగా ఉన్నారన్నా.. హైదరాబాద్ ఐటీకి హబ్ గా మారిందన్నా అదంతా చంద్రబాబు విజన్ మాత్రమే తప్పించి మరొకటి కాదని చెప్పాలి. ఐటీని ఆదాయవనరుగా ఎవరూ గుర్తించని సమయంలో.. దాన్ని గుర్తించి.. పెద్ద పీట వేసిన నేతగా చంద్రబాబును మర్చిపోలేం.

చంద్రబాబు నోటి నుంచి వచ్చినట్లుగా ప్రస్తావిస్తూ.. వైసీపీ నేతలు చేసే కామెడీ అంతా ఇంతా కాదు. తాజాగా ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ అలాంటి వ్యాఖ్యలే చేశారు. కర్నూలు జిల్లా వైసీపీ ప్లీనరీలో మాట్లాడిన ఆయన.. రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల పాటు చేశారంటూ దుయ్యబట్టారు. జగన్ పాలనను ఆకాశానికి ఎత్తేసిన ఆయన.. చంద్రబాబు ఏం మాట్లాడతారో ఆయనే తెలీదని.. తాను ముఖ్యమంత్రిగా ఉంటే కరోనా వచ్చేది కాదని చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు.

నిజంగానే బుగ్గన మాటలు నిజమే అయితే.. ఈపాటికి సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ లోనే దీనికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అయ్యేవన్న విషయాన్ని మర్చిపోకూడదు. అంతేకాదు.. ఈ వ్యాఖ్యలపై బోలెడన్ని మీమ్ లు ఇప్పటికే పాపులర్ అయి ఉండేవి.

ఏమైనా.. చంద్రబాబు అన్నారన్న పేరుతో వైసీపీ నేతలు చేసే వ్యాఖ్యలు ఇలానే ఉంటాయంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు ఇమేజ్ ను దెబ్బ తీసే వ్యూహంలో భాగమే ఇలాంటి వ్యాఖ్యలని వారు ఫైర్ అవుతున్నారు.