Begin typing your search above and press return to search.

కొండను తవ్విన బుగ్గన.. తీరా బయటపడిందేమంటే?

By:  Tupaki Desk   |   16 Sep 2022 2:10 PM GMT
కొండను తవ్విన బుగ్గన.. తీరా బయటపడిందేమంటే?
X
ఏపీ రాజధానిగా అమరావతిని డిసైడ్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇన్ సైడ్ ట్రేడింగ్ కు పాల్పడినట్లుగా వైసీపీ నేతలు మొదట్నించి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. రైతుల వద్ద నుంచి సేకరించిన 33 వేల ఎకరాలకు సంబంధించిన లెక్కల మీద అవగాహన ఉన్న టీడీపీ నేతలు.. ముందస్తుగా రాజధాని పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు చేయటం తెలిసిందే. దీనికి కౌంటర్ గా.. నిజంగానే తాము కొనుగోలు చేసి ఉంటే.. ఆధారాలు చూపించాలంటూ సవాళ్లు విసరటం.. దానికి సరైన సమాధానం చెప్పలేకపోవటం తెలిసిందే.

ఇన్ సైడ్ ట్రేడింగ్ ఆరోపణలపై తాజాగా ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ లెక్కలు బయటకు తీశారు. చూడండి.. ఎన్నేసి భూములు తీసుకున్నారో తెలుసా? అంటూ ఆయన చెప్పిన లెక్క వైనం విన్నంతనే విషయం ఇట్టే అర్థమయ్యే పరిస్థితి. ఇన సైడ్ ట్రేడింగ్ వివరాలు తమ వద్ద ఉన్నాయని.. టీడీపీ నేతల చరిత్ర విప్పుతామంటూ చెప్పిన వైసీపీ నేతల మాటలకు తగ్గట్లే బుగ్గన గారి పోస్టర్ బిల్డప్ అదిరింది. తీరా చూస్తే.. పోస్టర్ లో చూపించిన దానికి బొమ్మలో బయటకు వచ్చిన వివరాల్లో విషయం లేకపోవటంతో తేలిపోయిన పరిస్థితి.

అంత పెద్ద తెలుగుదేశం పార్టీలో నేతలకు కొదవ లేదు. అలాంటిది .. అంత మంది నేతల్లో పయ్యావుల కేశవ్ కుటుంబ సభ్యులు కొన్న భూముల వివరాల్ని వెల్లడించారు. అది కూడా ఏ వంద ఎకరాలో .. 200 ఎకరాలో అనుకుంటే తప్పులో కాలేసినట్లే. వారి కుటుంబ సభ్యులు మొత్తం కలిపినా పది ఎకరాలు కూడా కొనని పరిస్థితి. బుగ్గన లెక్క ప్రకారం పయ్యావుల కేశవ్ కుటుంబ సభ్యులు కొన్న భూమి ఆరున్నర ఎకరాలు మాత్రమే. నిజంగానే భారీ ఎత్తున లబ్థి పొందాలనుకుంటే.. సీనియర్ నేతగా ఉన్న పయ్యావుల ఒక యాభై ఎకరాలు కొంటే అది ఇన్ సైడ్ ట్రేడింగ్ లెక్కలోకి వస్తుంది.

ఇక.. రాజధాని ప్రకటన వెలువడిన 2014 డిసెంబరు 30 కంటే ముందే హెరిటేజ్ ఫుడ్స్ పేరుతో తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసినట్లుగా బుగ్గన తెలిపారు. అవెన్ని ఎకరాలో తెలిస్తే నోటి వెంట మాట రాదు. 2014 జులై 7న ఎకరం 15 సెంట్లు.. మరో డాక్యుమెంట్ ప్రకారం ఎకరం 11 సెంట్లు.. తాడికొండలో 45 సెంట్లు.. మరో సర్వే నెంబరులో ఎకరం 11 సెంట్లు.. ఇంకో డాక్యుమెంట్ లో ఎకరం 35 సెంట్లు.. మరో డాక్యుమెంట్ లో ఎకరా 35 సెంట్లు.. మరో డాక్యుమెంట్ లో 2.2 ఎకరాల భూమిని హెరిటేజ్ ఫుడ్స్ పేరుతో కొనుగోలు చేసినట్లుగా వెల్లడించారు.

బుగ్గన చెప్పిన దాని ప్రకారం కాస్త అటు ఇటుగా చంద్రబాబుకుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ 11 ఎకరాలకు మించి కొన్నది లేదు. నిజంగానే ఇన్ సైడ్ ట్రేడింగ్ చేయాలనుకుంటే ఏ వంద ఎకరాలో కొనుగోలు చేస్తారు కదా? అలా చేయకుండా పది ఎకరాలు కూడానా? అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇన్ సైడ్ ట్రేడింగ్ అంటూ భారీ పోస్టర్ తో సినిమా చూపిస్తానని చెప్పిన బుగ్గన.. చివరకు సినిమా చూసేసరికి.. మొత్తంగా 17 ఎకరాల లెక్క మాత్రమే చెప్పుకొచ్చారు. రాజధాని ఫలానా అని తెలిసి వేలాది కోట్లు వెనకేసుకోవాలనే భారీ ప్లాన్ ఉన్నప్పుడు.. ఈ మాత్రం లెక్కలే ప్రభుత్వానికి రావటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.