Begin typing your search above and press return to search.

పిట్ట కధల బుగ్గన... సొంత ఇలాకాలో ఫ్లెక్సీల రచ్చ

By:  Tupaki Desk   |   16 Nov 2022 2:30 PM GMT
పిట్ట కధల బుగ్గన... సొంత ఇలాకాలో ఫ్లెక్సీల రచ్చ
X
ఆయన ఆర్ధిక మంత్రి. అప్పుల మంత్రిగా కూడా మరో పేరు తెచ్చుకున్నారు. ఆయనే బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి. ఆయన డోన్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి ఆయన గెలుపు అంత ఈజీ కాదు అని వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో దానికి నిదర్శనమా అన్నట్లుగా బుగ్గన సొంత ఇలాకా డోన్ లోనే  
ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిసాయి.

అసెంబ్లీలో పిట్ట కధలు చెప్పే బుగ్గన రుద్రక్ష గుట్ట బాధితులకు చెప్పేవి కూడా పిట్ట కధలేనా అంటూ ఫ్లెక్సీల మీద రాసి డోన్ లో రాజకీయ రచ్చ చేశారు. బుగ్గనవి అచ్చమైన పిట్టకధలు అంటూ ఆ ఫ్లెక్సీల ద్వారా నిరసన గళం వినిపించారు. ఇదంతా సీపీఐ ఆద్వర్యంలో చేశారు.

ఇదిపుడు డోన్ లో చర్చనీయాంశగా ఉంది. సరిగ్గా చంద్రబాబు కర్నూల్ జిల్లాలో మూడు రోజుల టూర్ పెట్టుకుని అక్కడకి వెళ్ళిన టైం లోనే ఈ ఫ్లెక్సీలతో కామ్రేడ్స్ రచ్చ చేయడం కూడా గమనించాల్సిన విషయం. ఇంతకీ బుగ్గన రుద్రాక్ష గుట్ట బాధితులకు చేసినదేంటి అన్నది చూస్తే కనుక అక్కడ పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో  కేటాయించలేదని సీపీఐ ఆరోపిస్తోంది.

అంతే కాదు అక్కడ దౌర్జన్యంగా  కూల్చివేతల కార్యక్రమానికి  కూడా రెవిన్యూ అధికారులు శ్రీకారం చుట్టారు అని సీపీఐ నేతలు ఆరోపిస్తున్నారు. ఇది పేదల మీద ఆర్ధిక మంత్రి చేస్తున్న దౌర్జన్యం అని కామ్రేడ్స్ అంటున్నారు. దీనిని అంతా ఖండించాలని కూడా కోరుతున్నారు.

ఒక బాధ్యత కలిగిన రాష్ట్ర మంత్రిగా పేదల ఇళ్ల పట్టాలకు మాట ఇచ్చి తప్పిన బుగ్గన అని ఎర్రన్నలు మండిపడుతున్నారు. ఆర్ధిక మంత్రి తీరు ఇలా ఉంది, దీనిని అంతా గమనించాలి అని సీపీఐ నేతలు పేర్కొంటున్నారు. డోన్ పట్టణంలో అంతటా ఈ తరహా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం ద్వారా బుగ్గన ఇలాకాలో కలకలం సృష్టించారు.

అంతే కాదు వివాదాలకు దూరంగా ఉండే ఈ మంత్రి సొంత నియోజకవర్గంలో జరుగుతోంది ఇదీ అని కూడా సీపీఐ నేతలు ఫ్లెక్సీల ద్వారా చేదు నిజాలు చెప్పేశారు అని అంటున్నారు. బుగ్గన పిట్ట కధలు బాగా చెబుతారని, మాట ఇచ్చి నిలుపుకఒరని కూడా ఆరోపించడం వెనక చాలానే రాజకీయం ఉంది. మరి మంత్రి గారు దీన్ని ఎలా తట్టుకుంటారో. ఎలా డిఫెన్స్ చేసుకుని తన వాదన వినిపిస్తారో చూడాలి.

అంతే కాదు ఆయన ఈసారి ఏకంగా ఎంపీ కావాలనుకుంటున్నారు. ముందు పేదల ఇళ్ల విషయంలో ఆయన ఇచ్చిన మాట నిలుపుకోవాలని సీపీఐ నేతలు చేస్తున్న డిమాండ్ మీద స్పందించాలని అంటున్నారు. బుగ్గన వారి రాజకీయానికి అగ్గి పెట్టేలా వామపక్షాలు చేస్తున్న ఈ పోరాటం మంట ఎక్కితే మాత్రం ఆర్ధిక మంత్రికి రాజకీయ అప్పులు తిప్పలూ తప్పవేమో అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.