Begin typing your search above and press return to search.

జగన్ ఇచ్చినవి ఉద్యోగాలు కావట.. కుక్క బిస్కెట్లట

By:  Tupaki Desk   |   24 Nov 2019 5:33 AM GMT
జగన్ ఇచ్చినవి ఉద్యోగాలు కావట.. కుక్క బిస్కెట్లట
X
ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలోని నిరుద్యోగులను కుక్కలతో పోల్చుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. జగన్ దయతలచి ఉద్యోగాలిచ్చినట్లుగా ఆయన మాట్లాడడంతో తీవ్ర వ్యతిరేక వెల్లువెత్తుతోంది. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట లో మెగా జాబ్ మేళా ప్రారంభోత్సవం సందర్భం గా మంత్రి ధర్మాన కృష్ణ దాసు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుక్కకి బిస్కెట్ వేస్తే విశ్వాసంగా ఉంటుందని.. అలాంటిది నిరుద్యోగుల కోసం జగన్ ఇంత చేస్తున్నా కనీసం చప్పట్లు కొట్టడానికి కూడా చేతులు రావడం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యల పై యువత భగ్గుమంటున్నారు.

"కుక్క కి బిస్కెట్ వేస్తే విశ్వాసం ఉంటుంది. మనిషికి చిన్న సాయం చేస్తే కృతజ్ఞతగా ఉంటారు. ఇటువంటి మంచి ముఖ్యమంత్రి ఇలాంటి మంచి అవకాశాలు కల్పిస్తున్నా కనీసం క్లాప్స్ కొట్టడానికి కూడా చేతులు రావడం లేదు. చాలా అన్యాయం ఇది. మనలో మార్పు రావాలి. ఆలోచనా విధానం మారాలి. నిజాయితీ పరుడికి ఏం కావాలి. మీ నుంచి హర్షధ్వానాలు.. ఈ చప్పట్లే కావాలి" అని ఆయన అన్నప్పటికీ విద్యార్థుల నుంచి స్పందన రాలేదు. అయితే, మంత్రి వ్యాఖ్యల పై మాత్రం టీడీపీ నేతలు, నిరుద్యోగులు మండి పడుతున్నారు.


ధర్మాన వ్యాఖ్యలను నిరసిస్తూ ట్విటర్ వేదికగా మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగులను కుక్కల తో పోల్చడం అధికారం తెచ్చిన తల పొగరుకి నిదర్శనమంటూ నిప్పులు చెరిగారు. వైసీపీ కార్యకర్తల కు గ్రామ వాలంటీర్ల పేరుతో ఉద్యోగాలు ఇచ్చి ఏడాదికి 4వేల కోట్ల ప్రజాధనం దోచేస్తున్నందుకు చప్పట్లు కొట్టాలా? గ్రామ సచివాలయ ఉద్యోగాల కు సంబంధించిన పరీక్షా పత్రాన్ని లీక్ చేసి పేపర్ 5లక్షలకు అమ్ముకొని 19లక్షల మంది నిరుద్యోగ యువత ను మోసం చేసినందుకు చప్పట్లు కొట్టాలా? అంటూ ట్విటర్ వేదికగా ప్రశ్నలు గుప్పించారు. ఐతే టీడీపీ విమర్శలు పై వైసీపీ ఎదురు దాడికి దిగుతోంది. మంత్రి వ్యాఖ్యలను వక్రీకరించి జగన్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రభుత్వం చేస్తున్నారని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రతి దాన్ని భూతద్దంలో పెట్టి చూడడం టీడీపీ నేతలకు అలవాటయిందని తిరిగి ఆరోపిస్తున్నారు.