Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ ప్యాక్ : గులాబీకి గుచ్చుకున్నాయి...అయినా ...?

By:  Tupaki Desk   |   27 May 2022 6:47 AM GMT
ఫ్యామిలీ ప్యాక్ : గులాబీకి గుచ్చుకున్నాయి...అయినా ...?
X
మోడీకు కుటుంబం లేదు, ఆయనకు అసలు సెంటిమెంట్లు తెలియవు. ఇదే మాట గతంలో టీడీపీ నేతలు అన్నారు, ఇపుడు టీయారెస్ నేతలు అంటున్నారు. తాజాగా టీయారెస్ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఈ కామెంట్స్ మోడీ మీద చేశారు. మోడీకి కుటుంబం అన్నది లేదు కాబట్టే మా పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు అని అంటున్నారు.

ఆ సంగతి నిజమే అని కాసేపు అనుకున్నా ఈ దేశంలో ఎందరో బ్రహ్మచారులు ఉన్నారు. ఎందరో కీలకమైన పదవులు అందుకున్నారు. వారెవరికీ కుటుంబ బంధాలు తెలియవా. లేక వారికి సెంటిమెంట్లు లేవనా టీయారెస్ ఉద్దేశ్యం అంటే జవాబు ఏం చెబుతారో. మరో వైపు చూస్తే మోడీ అన్న మాటలలో తప్పేముంది అన్న చర్చ కూడా వస్తోందిగా.

తెలంగాణా విషయమే తీసుకుంటే కేసీయార్ ముఖ్యమంత్రి, ఆయన మేనల్లుడు హరీష్ రావు మంత్రి, కొడుకు కేటీయార్ సర్వాధికారి, కుమార్తె కవిత ఎమ్మెల్సీ. ఇక బంధుగణాల‌లో కూడా పదవులు అందుకున్న వారు చాలా ఉన్నారు. మరి పార్టీ పదవులల్లో కూడా వీరే కీలకంగా ఉన్నారు కదా. మరి దీనిని కుటుంబ పాలన కాదు అని టీయారెస్ అంటే జనాలు నమ్ముతారా.

నిజానికి తెలంగాణా ఉద్యమాన్ని కేసీయార్ చేశారు. ఆయన వెనక జనాలు ఉన్నారు. ఆయన ఉద్యమ వేళ అన్న మాటలు ఏంటి. తెలంగాణా వస్తే చాలు తాను అధికారం కోరుకోవడంలేదు అని. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాను అని చెప్పారా లేదా. మరి రాష్ట్రం రావడమేంటి ఆయన అధికారాన్ని అందుకున్నారు. అది ఆయన మాట తప్పినట్లుగానే అంతా చూస్తారు కానీ టీయారెస్ దాని మీద ఈ రోజుకూ ఒప్పుకోదు కదా.

ఇక ఆయనతో పాటు అధికారాన్ని పంచుకోవడానికి ఫ్యామిలీలో చాలా మంది వచ్చారు. ఇక్కడ మోడీ వేసిన సూటి ప్రశ్న ఏంటి అంటే తెలంగాణా రాష్ట్రం ఇచ్చింది కేవలం ఒక కుటుంబం అధికారం అందుకోవడానికి కానే కాదు, తెలంగాణా కోసం ఎందరో త్యాగాలు చేశారు. అందరికీ వాటి ప్రగతి ఫలాలు అందాలని.

మరి దానికి జవాబు చెప్పకుండా మోడీకి ఫ్యామిలీ లేదు అని చిల్లర విమర్శలు చేస్తే ఎలా గులాబీ సార్లూ అంటున్నారు అంతా. ఇక మోడీ కుటుంబ పార్టీలు వారసత్వ రాజకీయాలు అని హైదరాబాద్ టూర్ లో చేసిన కామెంట్స్ ఏపీకి కూడా సూటిగా తగులుతాయి. ఏపీలో కూడా టీడీపీ కుటుంబ పార్టీగానే ఉంది. ఆ పార్టీ అధినాయకుడు చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు. ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ ఉన్నారు.

ఇక ప్రభుత్వంలో నాడు తండ్రీ కొడుకులు ఇద్దరూ ముఖ్యమంత్రి, మంత్రులుగా ఉన్నారు. రేపటి రోజున టీడీపీ పవర్ లోకి వస్తే జరిగేది అదే. మరి కుటుంబ పార్టీలు అని తెలంగాణాలో టీయారెస్ ని విమర్శించి ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా అంటే నో అనే అంటున్నారు. ఆ విధంగా టీడీపీకి కూడా మోడీ సార్ షాక్ ఇచ్చేశారు అని అంటున్నారు. మొత్తానికి మోడీ చేసిన కుటుంబ పార్టీలు, వారసత్వ రాజకీయాల మీద హాట్ కామెంట్స్ కాదు కానీ ఏపీ రాజకీయాల్లో మాత్రం పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.