Begin typing your search above and press return to search.

గ్యాప్ తగ్గించటానికి కేటీఆరే సీన్లోకి వచ్చారా?

By:  Tupaki Desk   |   23 March 2021 2:46 AM GMT
గ్యాప్ తగ్గించటానికి కేటీఆరే సీన్లోకి వచ్చారా?
X
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంట ఉండి.. సంక్షోభంలోనూ పార్టీని వీడక.. అధినేత మీద అంతులేని విశ్వాసాన్ని ప్రదర్శించిన అతి కొద్ది మంది నేతల్లో ఈటెల రాజేందర్ ఒకరు. వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం వహించే ఆయనకు డొక్క శుద్ధి కూడా ఎక్కువే కావటంతో.. ఆయన మాట్లాడిన మాటలు సూటిగా మనసుల్ని ప్రభావితం చేస్తాయి. అవసరానికి తగ్గట్లు ఏ అంశాన్ని హైలెట్ చేయాలో తెలిసిన అతి కొద్ది మంది టీఆర్ఎస్ నేతల్లో ఆయన ఒకరు. అలాంటి ఆయనకు.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు గ్యాప్ ఉందన్న విషయం కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది.

ఈ దూరం ఇప్పటిది కాదని.. 2018 ఎన్నికలకు కాస్త ముందు నుంచి మొదలైందని చెబుతారు. రోజులు గడిచే కొద్దీ ఈ దూరం పెరగటమే తప్పించి..తగ్గింది లేదు. ఆ మధ్యన గులాబీ జెండాకు అసలైన ఓనర్లం తామేనంటూ ఆవేశాన్ని ప్రదర్శించి అందరిని ఆశ్చర్యచకితుల్ని చేసిన ఈటెల.. ఇటీవల కేటీఆర్ ను సీఎంను చేయటం కోసం రంగం సిద్ధం చేసే వేళలోనూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఇలా ఒకటి తర్వాత ఒకటి చొప్పున సాగుతున్న పరిణామాలు.. పార్టీ అధినేత కేసీఆర్.. మంత్రి ఈటెల మధ్య దూరాన్ని మరింత పెంచాయన్న మాట జోరుగా వినిపిస్తోంది. ఈ వాదనకు బలం చేకూరేలా.. ఇటీవల జరిగిన రెండు పట్టభ్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఈటెలకు ఎలాంటి బాధ్యతను అప్పగించకపోవటం గమనార్హం. ఈటెల లాంటి సీనియర్ నేతను కేసీఆర్ ఎందుకు ఉపయోగించుకోలేదన్న ప్రశ్న వినిపించింది. అంతేకాదు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తర్వాత ప్రగతిభవన్ సందడిగా మారితే.. ఆ హడావుడిలో ఈటెల జాడ ఎక్కడా కనిపించలేదు.

ఆదివారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం వల్ఫాపూర్ లో జరిగిన సభకు హాజరైన ఈటెల నోటి నుంచి వచ్చిన పలు వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కాదు.. కొత్త చర్చకు తెర తీసేలా మారింది. ‘‘కులం.. డబ్బు.. పార్టీ కాదు మనిషి గుర్తుండాలి. ధర్మం.. న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు. కానీ.. అంతిమ విజయం మాత్రం వాటిదే. నేను గాయపడినా ఎన్నడూ మనసు మార్చుకోలేదు’’ అంటూ ఈటెల నోటి నుంచి వచ్చిన పలు వ్యాఖ్యలు కొత్త చర్చకు తెర తీశాయి. ఇలాంటివేళ.. సోమవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

అసెంబ్లీ సమావేశాలు అయ్యాక.. మంత్రి ఈటెలను మరో మంత్రి కేటీఆర్ అప్యాయంగా పలుకరించటమే కాదు.. ఆయన్ను తన కారు వద్దకు తీసుకెళ్లి.. ఇద్దరు కలిసి కారులో ప్రగతిభవన్ కు వెళ్లటం ఆసక్తికరంగా మారింది. ఈటెల గుస్సాను తగ్గించటం.. అధినేతతో పెరిగిన దూరాన్ని తగ్గించే పనిలో భాగంగా మంత్రి కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.