Begin typing your search above and press return to search.

పోలవరంపై మరీ ఇంత అబద్ధమా ?

By:  Tupaki Desk   |   10 Aug 2021 4:47 AM GMT
పోలవరంపై మరీ ఇంత అబద్ధమా ?
X
‘పోలవరం నిర్మాణానికి అయ్యే ఖర్చును నూరుశాతం కేంద్రమే భరిస్తోంది’.. ఇది తాజాగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ పార్లమెంటులో చేసిన ప్రకటన. 2014, ఏప్రిల్ 1 నుండి ప్రాజెక్టుకయ్యే ఖర్చు మొత్తాన్నే కేంద్రమే భరిస్తోందని మంత్రి చెప్పారు. నిజానికి పోలవరం ప్రాజెక్టంటే నాలుగు గోడలు, గేట్లు పెడితే సరిపోతుందని కేంద్రం అనుకుంటోందో ఏమో అర్ధం కావటంలేదు.

నిజానికి పోలవరం అనే కాదు ఏ ప్రాజెక్టు అయినా భూ సేకరణ, భూములు కోల్పోవారికి ఇవ్వాల్సిన నష్టపరిహారం, వారి పునరావాసం లాంటి అనేక ఖర్చులను కలిపి ప్రాజెక్టు వ్యయాన్ని లెక్కకడతారు. ఇక్కడ పోలవరం ప్రాజెక్టంటే భూసేకరణ, నిర్వాసితులకు చెల్లించాల్సిన నష్టపరిహారం, పునరావాసం ఖర్చులు మొత్తం కలిపి రు. 55, 725 కోట్లుగా రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది కేంద్రానికి. అయితే కేంద్ర జలశక్తి సవరించిన అంచనాలకు అంగీకరించటంలేదు. 2013లో సవరించిన అంచనాలు రు. 20,392 కోట్లు మాత్రమే చెల్లిస్తానని పదే పదే చెబుతోంది.

భూసేకరణ, పునరావాసం, నష్టపరిహారానికే సుమారు రు. 30 వేల కోట్లకు పైగా అవుతుందని అంచనా. అంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే 100 శాతం ఖర్చును కేంద్రమే భరిస్తోందని గజేంద్ర షెకావత్ చెప్పటం పూర్తిగా అబద్ధమే. సవరించిన అంచనాలను చంద్రబాబునాయుడు, ఇపుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా కేంద్ర జలశక్తి శాఖకు పంపింది. అయితే ఆ ప్రతిపాదనలు జలశక్తి సాంకేతిక సలహాదారు విభాగంలోనే పెండింగ్ ఉండిపోయింది.

అంటే ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే మంత్రి పార్లమెంటులోను, వైసీపీ ఎంపిలు కలిసినపుడు ఒకమాట చెబుతున్నారు. తన మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులకు మాత్రం మరోలాగ ఆదేశాలిస్తున్నారు. అందుకనే రాష్ట్రప్రభుత్వం నుండి వెళ్ళిన సవరించిన అంచనా ప్రతిపాదనలు జలశక్తి శాఖలోని టెక్నికల్ అడ్వయిజరీ కమిటి దగ్గరే పెండింగ్ లో ఉండిపోయింది. కమిటి దగ్గర నుండి ఫైల్ మంత్రికి చేరితే సమస్య అయిపోతుందని కమిటి దగ్గరే ఫైలును ఉంచేశారని సమాచారం.

మొత్తానికి నరేంద్రమోడి సర్కార్ ఏపి ప్రయోజనాల విషయంలో చాలా అబద్ధాలే చెబుతోందని జనాలకు అర్ధమైపోయింది. కేంద్రం పొడుస్తున్న తూట్లను ఏపి బీజేపీ నేతలు పూడ్చలేక నానా అవస్తలు పడుతున్నారు. కేంద్రాన్ని బహిరంగంగా విమర్శించలేక, అలాగని కేంద్రం వైఖరిని సమర్ధించలేక పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు. చూద్దాం ముందు ముందు కేంద్రం ఇంకెన్ని అబద్ధాలాడుతుందో.