Begin typing your search above and press return to search.

బాబు తరఫున గంటా లీకులు : కటీఫ్‌ కు రెడీ!

By:  Tupaki Desk   |   8 Feb 2018 4:04 PM GMT
బాబు తరఫున గంటా లీకులు : కటీఫ్‌ కు రెడీ!
X
చంద్రబాబునాయుడుకు ఒక అలవాటు ఉంది. తాను ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే ముందు.. తన నిర్ణయం పట్ల ప్రజల్లో ప్రతిస్పందన ఎలా ఉంటుందో తానుగా ఒక అంచనాకు రాలేకపోయిన సందర్భాల్లో.. తన నిర్ణయం బ్యాక్ ఫైర్ కావడానికి ఏదైనా అవకాశం ఉన్నదని భయపడుతున్న నేపథ్యంలో ఆయన ఒక తెలివైన టెక్నిక్ ను ఫాలో అవుతారు. తన నిర్ణయానికి సంబంధించి.. ఎవరో ఒకరి ద్వారా మీడియాలోకి లీకులు ఇస్తారు. వెంటనే ఆ లీకుపై ప్రజల్లో స్పందన ఎలా ఉన్నదో గమనించే పనిని పలువురికి పురమాయిస్తారు. ఆ స్పందన తనకు అనుకూలంగా ఉంటేనే సదరు నిర్ణయం తీసుకుంటారు. ప్రతికూలంగా ప్రజలు భావిస్తున్నారని అనిపిస్తే గనుక.. ఆ లీకులు ఇచ్చిన నేతను - ఏదో మమ అన్నట్లుగా మందలించి.. అవన్నీ వారి వ్యక్తిగత అభిప్రాయాలని పార్టీకి - ప్రభుత్వానికి సంబంధం లేదని సులువుగా ముక్తాయించేస్తారు. అదీ ఆయన స్టయిల్. చంద్రబాబు ఇప్పుడు ప్రతిష్టంభన విషయంలో కూడా అదే సూత్రాన్ని అవలంబిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

భాజపాతో తెగతెంపులు చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నదంటూ చంద్రబాబు సర్కారులోని కీలకమంత్రుల్లో ఒకరు గంటా శ్రీనివాసరావు గురువారం వ్యాఖ్యానించారు. గురువారం పార్టీ పిలుపు ఇచ్చిన రాష్ట్రవ్యాప్త నిరసన ఉద్యమాల్లో పాల్గొన్న మంత్రి.. తమ ఆందోళనలకు సకాలంలో కేంద్రంనుంచి పరిష్కారం కనిపించకపోతే గనుక.. ఎన్డీయే నుంచి వైదొలగడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అని ప్రకటించారు. తాము సంయమనం పాటిస్తున్న కొద్దీ మిత్రధర్మాన్ని భాజపా కాల రాస్తున్నదంటూ ఆయన విమర్శించడం విశేషం.

తెగతెంపులు అనే మాట గంటా నోటి నుంచి మాత్రమే వచ్చింది. గురువారం నాటి రాష్ట్రవ్యాప్త ఆందోళనల్లో పాల్గొన్న ఇతర మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు ఆ పదం చెప్పకపోయినా.. అంతకంటె తీవ్రంగానే భాజపాతో సంబంధాల గురించి, భాజపా వైఖరి గురించి విమర్శలు చేయడం విశేషం. ఏపీపై కేంద్రం సవతితల్లి ప్రేమ చూపిస్తున్నదని, విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రం దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తోందని, పూర్తిగా విఫలమైందని ఇలా రకరకాలుగా మంత్రులు వ్యాఖ్యానించారు. ఇవన్నీ బాబు అనుమతితో సంకేతాలతో మాట్లాడుతున్న మాటలే అని.. వీటికి ప్రజాస్పందన ఎలా ఉంటుందో తెలిసాక తదనుగుణంగా చంద్రబాబు ఫైనల్ గా తెరమీదికి వచ్చి పార్టీ నిర్ణయాన్ని ప్రకటిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.