Begin typing your search above and press return to search.

ఏపీలో సంచ‌ల‌నం.. ఇసుక అక్ర‌మాల‌కు మంత్రి అండ‌.. ఫోన్ సంభాష‌ణ వైర‌ల్‌

By:  Tupaki Desk   |   6 Sep 2021 4:30 PM GMT
ఏపీలో సంచ‌ల‌నం.. ఇసుక అక్ర‌మాల‌కు మంత్రి అండ‌.. ఫోన్ సంభాష‌ణ వైర‌ల్‌
X
ఇసుక అక్ర‌మాల‌కు చెక్ పెట్టాల‌ని ఒక‌వైపు.. ఏపీ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌లిగించే ఏ ప‌నినీ స‌హించే ది లేద‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స్ప‌ష్టం చేస్తున్నారు. అదేస‌మ‌యంలో అధికారుల‌ను కూడా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని కూడా ఆదేశించారు. కానీ, ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు మాత్రం దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. దీంతో ఇసుక విష‌యం.. ప్ర‌భుత్వానికి ఇబ్బందిగా మారింది. ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న‌కు తోడు.. ప్ర‌జ‌ల్లోనూ ఇసుక వ్య‌వ‌హారంపై అసంతృప్తి ఏర్ప‌డుతోంది. ఈ స‌మ‌యంలో ప్ర‌భుత్వ విధానాల‌కు అనుగుణంగా వ్య‌వ‌హ‌రించాల్సిన ఒక మంత్రి.. దూకుడు ప్ర‌ద‌ర్శించి ఇసుక అక్ర‌మార్కుల‌కు అండ‌గా నిలిచార‌నే విష‌యం ఇప్పుడు మ‌రింత వివాదానికి దారితీసింది.

మంత్రి గుమ్మ‌నూర్ జ‌య‌రామ్‌... ఇసుక అక్ర‌మ ర‌వాణాకు స‌హ‌కరించార‌నే వార్త‌.. ఇప్పుడు ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. ఇసుక అక్రమ రవాణాపై ఓ పోలీస్ అధికారితో మంత్రి జయరామ్ జరిపిన సంభాషణ వైరల్ అవుతోంది. ఆలూరు నియోజకవర్గంలో పట్టుకుంటున్న ఇసుక ట్రాక్టర్లను వదిలేయాలని ఓ ఎస్‌ఐ‌తో మంత్రి జయరామ్ నేరుగా ఫోన్‌లో మాట్లాడారు. ఇల్లీగల్ గా వద్దన్నా లీగల్ గా ఇసుక రవాణా చేసుకోవాలని చెప్పినట్లు ఎస్‌ఐ అన్నారు. దీంతో మంత్రి జయరామ్ ఎస్‌ఐపై సీరియస్ అయ్యారు. ''పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లను వదిలేయ్..లేకపోతే ధర్నాకు దిగుతా''నని మంత్రి జయరామ్ హెచ్చరించారు.

ఇప్పుడు ఈ ఫోన్ సంభాష‌ణ సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతుండ‌డం గ‌మ‌నార్హం. ఓ వైపు ప్ర‌భుత్వం ఇసుక అక్ర‌మాల‌ను స‌హించేది లేద‌ని చెబుతుంటే.. సాక్షాత్తూ మంత్రే రంగంలోకి దిగి, అక్ర‌మార్కుల‌ను ప్రోత్స‌హించేలా వ్య‌వ‌హ‌రించడం పై.. విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు ఈ విష‌యాన్ని ప్ర‌తిప‌క్షాలు రాజ‌కీయం చేసేందుకు రెడీ అయ్యాయి. వాస్త‌వానికి ఎవ‌రైనా చోటా నేత‌.. ఇలా చేస్తే.. అదుపుచేయాల్సిన మంత్రిగారే.. ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌ని.. వైసీపీలోనూ చ‌ర్చ సాగుతో్ంది. ముఖ్యమంత్రి ఎంతో సీరియ‌స్‌గా ఉన్నార‌ని.. ఇలాంటి స‌మ‌యంలో అక్ర‌మాల‌ను ప్రోత్స‌హించేలా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌ని.. అంటున్నారు. మ‌రి ప్ర‌భుత్వం ఈ విష‌యంపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.