Begin typing your search above and press return to search.

పీయూష్ సారీ చెప్పాలా? ఈ మాట మీరు చెప్పటమా హరీశ్?

By:  Tupaki Desk   |   23 Dec 2021 5:30 AM GMT
పీయూష్ సారీ చెప్పాలా? ఈ మాట మీరు చెప్పటమా హరీశ్?
X
రాజకీయాల్లో తిరుగులేని అస్త్రం ఎమోషన్. దాన్ని ఎప్పుడు బయటకు తీయాలో.. రాజకీయ ప్రత్యర్థుల పై ఎప్పుడు సంధించాలో గులాబీ నేతలకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదు. భావోద్వేగ అస్త్రానికి.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మాటను చేరిస్తే చాలు.. ఎవరినైనా ఇట్టే కనెక్టు అయ్యేలా చేస్తుంది.

ఈ అస్త్రాన్ని ఇప్పటివరకు విరివిగా వినియోగించిన టీఆర్ఎస్ నేతల మాటలకు ఇప్పుడు పంచ్ ల మీద పంచ్ లు పడుతున్నాయి. అపాయింట్ మెంట్ ఇవ్వకున్నా.. తనను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్న టీఆర్ఎస్ నేతల పై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఆగ్రహం వ్యక్తం చేయటం తెలిసిందే. ఈ ఉదంతాన్ని తనకు అనువుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు.

తెలంగాణ ప్రభుత్వ చేయూతతో వరిసాగు చేసిన రైతులు వడ్లు అమ్ముకునేందుకు చలిలో వణుకుతుంటే.. వారి తరఫున రాష్ట్ర మంత్రులు ఆరుగురు ఢిల్లీకి వెళితే.. వారిని పీయూష్ గోయల్ అవహేళన చేయటం సరికాదన్నారు. ఏం పని లేక ఢిల్లీకి వచ్చారా? అని గోయల్ వ్యాఖ్యానించటాన్ని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రైతుల్ని అవమానించటం.. అవహేళన చేయటమేనని అభివర్ణించారు.
రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని మంటకలిపేలా కేంద్రమంత్రి పీయూష్ తీరు ఉందని మంత్రి హరీశ్ మండిపడుతున్నారు.

ఈ తీరు అభ్యంతరకరమన్న ఆయన.. తమను అవమానిస్తే ఫర్లేదు కానీ.. రైతుల్ని అవమానిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్రానికి చెందిన 70 లక్షల మంది రైతుల సమస్యల్ని కేంద్రం దృష్టికి తీసుకొచ్చేందుకే తమ మంత్రులు ఢిల్లీకి వెళ్లారని.. అయితే కేంద్రమంత్రిగా వ్యవహరిస్తున్న గోయల్ తీరు సరిగా లేదని.. ఆయన తక్షణం భేషరతుగా క్షమాపణలు చెప్పాలని.. తాను చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలన్నారు.

ఇన్ని మాటలు మాట్లాడుతున్న మంత్రి హరీశ్.. తన మేనమామ కమ్ ముఖ్యమంత్రి కేసీఆర్.. సొంత పార్టీ నేతలకే టైం ఇవ్వని సంగతి తెలిసిందే. అంతేనా.. రాష్ట్రంలోని విపక్ష నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి వినతి పత్రం ఇవ్వటానికి వెళితే.. గంటల కొద్దీ సమయం తన దగ్గర వెయిట్ చేయించి.. తర్వాత తీరిక లేదని చెప్పివెనక్కి పంపినప్పుడు హరీశ్ లాంటి నేతలు ఎందుకు స్పందించలేదు? కేంద్రమంత్రి నోటి నుంచి ఒక్క మాటను పట్టుకొని ఇంతలా ఆవేశ పడుతున్న హరీశ్.. తన మేనమామ తీరును.. ఆయన నోటి నుంచి వచ్చే మాటల్ని మర్చిపోయారా? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు.