Begin typing your search above and press return to search.

ఉద్యోగులకు మంత్రి హరీశ్ రావు గుడ్ న్యూస్

By:  Tupaki Desk   |   23 Jun 2020 8:50 AM GMT
ఉద్యోగులకు మంత్రి హరీశ్ రావు గుడ్ న్యూస్
X
లాక్‌డౌన్ ప్రభావంతో ఆదాయం కోల్పోయిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్లలో కోత పెట్టిన సంగతి తెలిసిందే. ఏప్రిల్, మే నెలల్లో కోత విధించారు. దీనిపై ఉద్యోగులు, పింఛన్ దారులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈనెల జీతమైనా కోత లేకుండా చెల్లించాలని ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా ఈ విషయమై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ను కలిసి విన్నవించుకున్నారు. జూన్ నెల నుంచైనా పూర్తి వేతం ఇవ్వాలని కోరుతూ.. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్ & కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక సభ్యులు తదితరులు మంగళవారం ఆర్థిక మంత్రి హరీష్ రావును కలిశారు. జీతాల్లో కోతలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. జూన్ నెల వేతనంలో ఎలాంటి కోతలు లేకుండా పూర్తి శాలరీ చెల్లించాలని కోరారు.

వారి వినతిని విన్న అనంతరం మంత్రి హరీశ్ రావు వారికి గుడ్ న్యూస్ తెలిపారు. ఉద్యోగులందరికీ జూన్ నెల నుంచి పూర్తి వేతనాలు ఇస్తామని.. విశ్రాంత ఉద్యోగులకు కూడా పూర్తి పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు. బకాయిలకు సంబంధించి జీపీఎఫ్‌లో జమ చేయాలనుకుంటున్నామని చెప్పారు. అయితే సీపీఎస్, పెన్షనర్లకు బకాయిలను వాయిదాల్లో ఇచ్చేలా ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే వేతన బకాయిలను కూడా జీపీఎఫ్‌లో కాకుండా నగదు రూపంలోనే ఇవ్వాలని మంత్రిని ఐక్యవేదిక కోరింది. మంత్రి హరీశ్ రావు హామీతో ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణలో లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో సీఎం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాల్లో 75 శాతం కోత, మేయర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల జీతాల్లో కోతపెట్టింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఉద్యోగాలు చేస్తున్న వారి జీతాల్లో 60 శాతం కోత విధించింది. మిగతా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 50 శాతం కోత పెట్టింది. నాలుగో తరగతి ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల్లో 10 శాతం కోత విధించింది. రిటైర్డ్ ఉద్యోగులకు అందించే పెన్షన్లలో 50 శాతం కోత పెట్టిన సర్కారు.. నాలుగో తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 10 శాతం కోత విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వారికి పూర్తి చెల్లింపులు చేయనున్నారు.