Begin typing your search above and press return to search.

బీజేపీ , కాంగ్రెస్ ఖాళీ .. అందరి చూపు టిఆర్ఎస్ వైపే : మంత్రి హరీశ్ రావు

By:  Tupaki Desk   |   30 Sep 2021 11:30 PM GMT
బీజేపీ , కాంగ్రెస్ ఖాళీ .. అందరి చూపు టిఆర్ఎస్ వైపే : మంత్రి హరీశ్ రావు
X
హుజూరాబాద్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ఒక్కసారిగా కరీంనగర్‌ జిల్లా రాజకీయాలు హీటెక్కాయి. అక్టోబరు 1వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల కానుండడంతో ప్రచార వ్యూహాల పై ప్రధాన పార్టీలైన టీఆర్‌ ఎస్‌- బీజేపీ కసరత్తు ప్రారంభించాయి. ప్రతీ ఓటరును నేరుగా కలిసేలా పక్కాగా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇంటింటి ప్రచారానికి ఈసీ షరతులతో అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకే.. ప్రధాన పార్టీలు ఇంటింటి ప్రచారానికి మొగ్గుచూపుతున్నాయి. కోవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించాల్సిన వేళ భారీ బహిరంగ సభలు, ఇండోర్‌ సభల కంటే ఇంటింటి ప్రచారం ప్రభావవంతంగా పనిచేస్తుందన్న నిర్ణయానికి పార్టీలు వచ్చాయి. మొత్తం 28 రోజులపాటు ప్రచారం చేసుకునే వీలుంది.

ఇక హుజారాబాద్ లో విజయమే లక్ష్యంగా ఇప్పటికే పార్టీలో ట్రబుల్‌ షూటర్‌ గా పేరొందిన మంత్రి హరీశ్‌ రావు ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకున్నారు. దాదాపు 16 వారాలుగా హరీశ్‌రావు హుజూరాబాద్‌ లోనే మకాం వేశారు. ఆయనకు తోడుగా మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, నారదాసు లక్ష్మణరావు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, సతీశ్‌బాబు, బాల్క సుమన్, కోరుకంటి చందర్‌ తో పాటు స్థానిక మున్సిపల్‌ చైర్మన్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌ లు, వార్డు సభ్యులు, మండల-గ్రామ-వార్డు కార్యకర్తలతో మెగా బృందమే పనిచేస్తోంది.

టీఆర్‌ఎస్‌ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్‌ ఒకప్పుడు పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తుల్లో ఒకరు. కానీ.. ఈ వేసవిలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో మంత్రి, ఎమ్మెల్యే, పార్టీ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ వెంటనే బీజేపీలో చేరారు. ఆయన పార్టీలో చేరినప్పటికీ పార్టీ విధానాల కంటే వ్యక్తిగత చరిష్మాతోనే ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అయన వెనుక బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. టీఆర్‌ ఎస్‌ ఎలాగైనా ఈ స్థానాన్ని గెలవాలవాలని భారీబలగంతో సర్వశక్తులు ఒడ్డుతోంది.

ఇక నేడు హుజూరాబాద్ నియోజకవర్గంలోని సంగాపురంలో ఆర్థిక మంత్రి హరీశ్‌ రావును కలిసిన పలు మండలాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ కు మద్దతునిస్తూ తెరాసలో చేరారు. జమ్మికుంట, కమలపూర్ మండలాలలోని లక్షాపురం, భీంపెల్లి, నర్సక్కపల్లి గ్రామాలకు చెందిన బీజేపీ నేతలు, కార్యకర్తలు తెరాసలో చేరారు. లక్ష్మాపురం బీజేపీ గ్రామ అధ్యక్షులు సంపత్ రావు, మాజీ ఉపసర్పంచి శ్రీనివాస్, వారితో పాటు 20 మంది బీజేపీ కార్యకర్తలు తెరాస నేత శంకర్ రావు నేతృత్వంలో తెరాసలో చేరారు. మంత్రి హరీశ్ రావు వారికి గులాబీ కండు వా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం హుజూరాబాద్ మండలం రంగాపరం గ్రామానికి చెందిన వంద మంది పద్శశాలీలు రంగాపూర్ గ్రామ తెరాస ఇన్ఛార్జి దుర్గా రెడ్డి నేతృత్వంలో బీజేపీ పార్టీ నుండి తెరాసలో చేరారు.

వారితో పాటు 150 మంది ముదిరాజ్‌లు బీజేపీ, కాంగ్రెస్ ల నుంచి తెరాసలో చేరారు. ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షుడు జి. సుధాకర్ నేతృత్వంలో కమలాపూర్ మండలం పూసల సంఘం వారు తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కే తమ ఓటని మంత్రి హరీశ్ రావును కలిశారు. తెరాసలో చేరతామని ప్రకటించారు. దీనితో హుజూరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రోజు రోజుకూ ఖాళీ అవుతున్నాయని చెప్తున్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ నువ్వా-నేనా అన్నట్లుగా తలపడుతూ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌ ఇంతవరకూ ప్రచార రేసులో కాలు మోపనే లేదు. అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్‌ పార్టీకి ఇంకా బాలారిష్టాలు తప్పడం లేదు.