Begin typing your search above and press return to search.

కేసీఆర్ ప‌రువు కాపాడేందుకు హ‌రీశ్ ఎంట్రీ

By:  Tupaki Desk   |   2 April 2018 1:50 PM GMT
కేసీఆర్ ప‌రువు కాపాడేందుకు హ‌రీశ్ ఎంట్రీ
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడు - రాష్ట్ర మంత్రి హ‌రీవ్ రావు సుదీర్ఘ‌కాలం త‌ర్వాత హైద‌రాబాద్‌ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్ర‌భుత్వంపై - త‌న మేన‌మామ కేసీఆర్‌ పై జ‌రుగుతున్న దాడికి, టీఆర్ ఎస్ ల‌క్ష్యంగా జ‌రుగుతున్న విమ‌ర్శ‌ల‌కు ఆయ‌న కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్బంగా విడుద‌ల‌యిన కాగ్ రిపోర్ట్‌ లో తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టే అంశాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే దీని ఆధారంగా స‌హ‌జంగానే విప‌క్షాలు విరుచుకుప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో హ‌రీశ్ ఎంట్రీ ఇచ్చారు.

తెలంగాణ భవన్‌ లో మంత్రి హరీశ్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాగ్‌ లోని పాజిటివ్ పాయింట్ల‌పై ఫోక‌స్ చేసి కేసీఆర్ ఇమేజ్ పెంచే ప్ర‌య‌త్నం చేశారు. తెలంగాణలో ఆదాయ అభివృద్ధిని కాగ్ ప్రశంసించిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ సంక్షేమానికి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని కాగ్ ప్రశంసించిందని హ‌రీశ్ తెలిపారు. `అనుభవంలో ప్రజా సంక్షేమాన్నే అందరూ చూస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోంది. కాంగ్రెస్ నాయకులు కాగ్ నివేదికపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నరు. కాంగ్రెస్ ఇదే తీరుతో పోతే వచ్చే సారి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. ఈ విషయంలో చర్చకు వస్తే కాంగ్రెస్‌ కే నష్టం` అని చెప్పారు. `కాంగ్రెస్ నేతల హామీల్లో నిజాయతీ లేదని ప్రజలే గుర్తిస్తున్నారు. అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఇచ్చిన హామీలు ముందు నెరవేర్చండి` అని డిమాండ్ చేశారు.

ఉచిత కరెంట్‌ పై కర్ణాటక మంత్రి రేవణ్ణ స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను అభినందించారని మంత్రి హ‌రీశ్‌ రావు తెలిపారు. `కేసులతో రాష్ట్ర ప్రగతికి కాంగ్రెస్ నేతలు అడ్డుపడుతున్నారు. బస్సు యాత్ర పేరుతో తిరుగుతున్న కాంగ్రెస్ నేతలను రైతులు నిలదీయాలి. ప్రజలు కాంగ్రెస్‌ ను పట్టించుకునే పరిస్థితి లేదు.. అని హరీశ్ రావు తెలిపారు. `కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాగ్ నివేదిక ఏమన్నా బైబిలా - భగవద్గీతనా లేక ఖురాన్ ఆ అని ఎద్దేవా చేశారు. ఇప్పుడేమో కాగ్ నివేదిక బ్రహ్మాస్తం అంటున్నారు. కాగ్‌ కు సామాజిక అవగాహన లేదని సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు అన్నారు. కాగ్‌కు ప్రభుత్వాన్ని తప్పుపట్టే అర్హత లేదని సీఎంగా ఉన్నప్పుడు రాజశేఖర్‌ రెడ్డి కూడా అన్నారు. కాగ్ నివేదిక తప్పుల తడక అని ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ పార్లమెంట్‌ లో అన్నారు. అవ‌న్నీ మ‌ర్చిపోయారా?` అని హరీశ్ రావు దుయ్యబట్టారు.

కాంగ్రెస్ నేతల వైఖరి రెండు నాలుకల ధోరణికి ప‌క్కా నిద‌ర్శ‌న‌మ‌ని హ‌రీశ్ రావు అన్నారు. `బీజేపీ పాలిత ప్రాంతాల్లో కాగ్ నివేదిక మరొక రకంగా, కాంగ్రెస్, ఇతర పార్టీల పాలిత ప్రాంతాల్లో కాగ్ నివేదిక మరోలా ఉంది. బీజేపీ పాలిత ప్రాంతాల్లో అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే కాగ్ అభ్యంతరం చెప్పలేదు. బీజేపీయేతర పాలిత ప్రాంతాల్లో అప్పులను తీసుకురావడాన్ని తప్పుబడుతోంది. గుజరాత్‌లో మోడీ 9 ఏళ్ల‌ పాలనపై కాగ్ నివేదిక ఇచ్చింది. మోడీ ప్రభుత్వంలో అవినీతిని ఎత్తి చూపింది. కాంగ్రెస్ కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తోంది. సీఎం కేసీఆర్ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ లేదు. అందుకే కాగ్ నివేదికను పట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారు` అని మంత్రి హ‌రీశ్ రావు మండిపడ్డారు.