Begin typing your search above and press return to search.

బోర్డుకు ఆంధ్రా ప‌క్ష‌పాతం అంట‌గ‌ట్టేసిన హ‌రీశ్‌

By:  Tupaki Desk   |   10 Oct 2017 7:54 AM GMT
బోర్డుకు ఆంధ్రా ప‌క్ష‌పాతం అంట‌గ‌ట్టేసిన హ‌రీశ్‌
X
కృష్ణాబోర్డుపై ఫైర్ అయ్యారు తెలంగాణ రాష్ట్ర మంత్రి హ‌రీశ్‌ రావు. ప‌క్ష‌పాతంతో వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్న ఆరోప‌ణ చేస్తూ.. బోర్డు తీరు స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌య్యే అవ‌కాశం ఉందన్నారు. త‌మ ప్ర‌యోజ‌నాలు దెబ్బ తినేలా వ్య‌వ‌హ‌రిస్తున్న నేప‌థ్యంలో గతంలో తాము ఓకే అన్న వాటిని అమ‌లు చేయ‌మ‌న్న మాట‌ను అనేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ‌టానికి నీళ్లు కూడా ఒక కార‌ణ‌మ‌ని.. అలాంటి నీటి ప్ర‌యోజ‌నాలు రాష్ట్రానికి ద‌క్క‌న‌ప్ప‌డు తాము రాజీ ప‌డ‌లేమ‌ని తేల్చేశారు.

కృష్ణా బోర్డు ఆంధ్రా ప‌క్ష‌పాతిగా అభివ‌ర్ణించిన హ‌రీశ్‌.. ప‌లు ఆరోప‌ణ‌లు.. విమ‌ర్శ‌ల‌తో ఏకంగా ఒక లేఖ రాసేశారు. ప‌రివాహ‌క ప్రాంతం.. ల‌భ్య‌త‌కు త‌గ్గ‌ట్లు త‌మ వాటా రావాల‌న్న‌ది ప్ర‌జ‌ల డిమాండ్ గా పేర్కొన్న హ‌రీశ్‌.. రెండు రాష్ట్రాల్లో లెక్క‌లు క‌ట్టించి త‌మ వాటా లెక్క తేల్చాల‌న్నారు. బాధ్య‌త ఉన్న కృష్ణా బోర్డు స‌క్ర‌మంగా కొన్ని స‌మ‌యాల్లో ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని.. ఏపీ తీసుకునే అసంబ‌ద్ధ నిర్ణ‌యాల‌కు వంత‌పాడుతోంద‌ని.. దీనివ‌ల్ల కొత్త స‌మ‌స్య‌ల‌కు దారి తీసే అవ‌కాశం ఉందంటూ త‌న వాద‌న‌ను లేఖ‌లో సుదీర్ఘంగా వివ‌రించారు.

ప్ర‌స్తుత నీటి సంవ‌త్స‌రంలో శ్రీశైలంలో గ‌రిష్ఠంగా నీటి నిల్వ ఉన్న‌ప్ప‌టికీ సాగ‌ర్‌ కు నీటివిడుద‌ల చేయ‌టంలో బోర్డు విఫ‌ల‌మైంద‌ని.. పోతిరెడ్డిపాడు నుంచి అద‌నంగా నీటిని విడుద‌ల చేయ‌కుండా ఆప‌లేక‌పోయింద‌న్నారు. శ్రీశైలం ఎడ‌మ‌గ‌ట్టు విద్యుదుత్ప‌త్తి ద్వారా విడుద‌ల చేసిన నీటిని త‌మ ఆదేశాల‌ను ఉల్లంఘించి విడుద‌ల చేసిన‌ట్లుగా బోర్డు పేర్కొందని.. తెలంగాణ విద్యుదుత్ప‌త్తి చేయ‌టం స‌రైంది కాద‌ని బోర్డు అభిప్రాయ‌మ‌న్నారు.

మ‌రోవైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ బోర్డు ఆదేశాల‌ను ఉల్లంఘించి పోతిరెడ్డిపాడు ద్వారా కేటాయించిన ఐదు టీఎంసీల కంటే ఎక్కువ నీటినే తీసుకుంద‌న్నారు. ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్ అవ‌స‌రాల‌కు రెండు టీఎంసీల నీటిని విడుద‌ల చేయ‌మ‌ని ఆగ‌స్టు 29న బోర్డును కోరితే సెప్టెంబ‌రు 11న నీటి విడుద‌ల‌కు ఆదేశాలు జారీ చేసింద‌ని.. అదే స‌మ‌యంలో ఆంధ్రప్ర‌దేశ్ మాత్రం అక్టోబ‌రు 6న ఇండెంట్ పెడితే సెల‌వైనా.. ఆ రోజే ఈ మొయిల్ ద్వారా తెలంగాణ‌కు పంపి అభిప్రాయం కోరాన‌ని.. ఇది చూస్తేనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ట్ల బోర్డుకున్న ప‌క్ష‌పాతం ఎంత‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోంద‌న్నారు.

రెండు నెల‌ల్లో టెలిమెట్రీ స్టేష‌న్లు ఏర్పాటు చేస్తామ‌ని గ‌త ఏడాది జూన్ లో హామీ ఇచ్చిన బోర్డు ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క‌టి కూడా కార్యాచ‌ర‌ణ తేలేద‌ని.. మొద‌టి విడ‌త‌లో తెలంగాణ‌లో 14 టెలిమెట్రీలు ఉండ‌గా.. ఆంధ్రాలో నాలుగు ఉన్నాయ‌ని.. బోర్డు ప‌ని తీరు స‌రిగా లేక‌పోవ‌టం వ‌ల్ల రెండు రాష్ట్రాల మ‌ధ్య అనేక అనుమానాలు త‌లెత్తుతున్న‌ట్లుగా మండిప‌డ్డారు.

హ‌రీశ్ ఆరోప‌ణ‌లు చూస్తే.. తెలంగాణ ప్ర‌యోజ‌నాల్ని కృష్ణా బోర్డు ప‌ట్టించుకోవ‌టం లేద‌న్న అక్రోశం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంద‌ని చెప్పాలి. తాము కోరిన వాటిని కోరినంత‌నే.. కోరిన‌ట్లుగా చేసి తీరాల‌న్న‌ట్లుగా హ‌రీశ్ విమ‌ర్శ‌లు ఉన్న‌ట్లుగా ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. రెండు రాష్ట్రాల మ‌ద్య అనుసంధాన‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించే బోర్డుకు ప‌క్ష‌పాతం అపాదించిన వేళ‌.. కృష్ణాబోర్డు ఎలా స్పందిస్తుంద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్పాలి.

హ‌రీశ్ లేఖ ఇలా ఉంటే.. కృష్ణాబోర్డు తాజాగా చేతులెత్తేయ‌టం గ‌మ‌నార్హం. నీటి విడుద‌ల కోరుతూ ఒక రాష్ట్రం చేసిన విన‌తిని మ‌రో రాష్ట్రానికి పంపినా ఎలాంటి స్పంద‌న లేద‌ని.. నీటి విడుద‌ల‌కు ఎలాంటి ఆదేశాలు ఇవ్వ‌లేమ‌ని తేల్చేసింది. శ్రీశైలం నుంచి విద్యుదుత్ప‌త్తి ద్వారా నీటి విడుద‌ల‌పై రెండు రాష్ట్రాల వారు ప‌ర‌స్ప‌రం మాట్లాడుకొని త‌మ‌కు కేవ‌లం స‌మాచారం ఇస్తే స‌రిపోతుంద‌ని చెప్పటం గ‌మ‌నార్హం.