Begin typing your search above and press return to search.

కరోనా భయంతో గృహ నిర్భందం చేసుకున్న కేంద్రమంత్రి !

By:  Tupaki Desk   |   17 March 2020 11:00 AM GMT
కరోనా భయంతో గృహ నిర్భందం చేసుకున్న కేంద్రమంత్రి !
X
కరోనా వైరస్ ..ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న భయంకరమైన మహమ్మారి. ఈ వైరస్ చైనాలోని వూహన్ సిటీలో వెలుగులోకి వచ్చి , ఆ తరువాత ఒక్కో దేశం పాకుతూ ప్రస్తుతం ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందుతుంది. ఈ కరోనా కారణంగా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 7171 మంది మరణించారు. వీరిలో ఎక్కువ శాతం మంది చైనా , ఇటలీ వాసులే. భారత్ లో కూడా ఈ కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. ప్రస్తుతానికి భారత్ లో 126 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఈ సమయంలోనే కేంద్రమంత్రి మురళీధరన్ తనకు తానుగా క్వారంటైన్ అయ్యారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాకూడదని, ఢిల్లీలోని తన అధికారిక నివాసనం నుంచే రోజువారీ కార్యకలాపాలు కొనసాగించాలని ఆయన నిర్ణయించుకున్నారట. అయితే, మంత్రిగారికి కరోనా వైరస్ సోకినట్లు ఇప్పటివరకు నిర్దారణ కాలేదు. కానీ , అయినప్పటికీ మంత్రిగారు తనని క్వారంటైన్ చేసుకోవడానికి అసలు కారణం ఏమిటంటే ... కేరళకు చెందిన మురళీధరన్..మార్చి-14న తిరువనంతపురంలోని పేరుపొందిన శ్రీ చిత్ర తిరునాల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ లోని డైరక్టర్స్ ఆఫీస్ లో జరిగిన ఓ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ మీటింగ్ లో వివిధ డిపార్ట్మెంట్ ల హెడ్ లు పాల్గొన్నారు.

అయితే మార్చి-1న స్పెయిన్ నుంచి తిరిగొచ్చిన ఈ హాస్పిటల్ లోని ఓ డాక్టర్ కి కరోనా సోకినట్లు ఆదివారం నిర్థారణ అయింది. అయన మార్చి5వరకు హాస్పిటల్ లో పనిచేశాడు. అప్పటివరకు ఆయనలో కరోనా లక్షణాలు కనుబడలేదు. అయితే ఆదివారం ఆయనకు టెస్ట్ లలో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో హాస్పిటల్ ను షట్ డౌన్ చేసారు. ఈ నేపథ్యంలో ఆరు ముఖ్యమైన డిపార్మెంట్లకు హెడ్ లుగా ఉన్న ఈ హాస్పిటల్ లోని డాక్టర్లు వాళ్లకు వాళ్లుగా ఇళ్లల్లోనే క్వారంటైన్ అయ్యారు. కరోనా సోకిన డాక్టర్ ను నేరుగా కలిసిన 25మంది డాక్టర్లతో సహా 75మంది ఉద్యోగుల లిస్ట్ ను తయారు చేసి వారిని ఐసొలేట్ చేసినట్లు సమాచారం. దీనితో తనకి ఇంకా కరోనా సోకినట్టు నిర్దారన కాకపోయినప్పటికీ ,ఆ హాస్పిటల్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నందున ముందు జాగ్రత్త చర్యగా తనకు తాను గా క్వారంటైన్ అయ్యారు కేంద్రమంత్రి మురళీధరన్.