Begin typing your search above and press return to search.

ప్రత్యేక హోదా లేదంతే....కేంద్రం ఇంకోసారి క్లారిటీ

By:  Tupaki Desk   |   12 Dec 2022 11:57 AM GMT
ప్రత్యేక హోదా లేదంతే....కేంద్రం ఇంకోసారి క్లారిటీ
X
ప్రత్యేక హోదా కావాలి. ఇది ఏపీ జనం కోరిక. ఆ కోరికను పుట్టించింది కూడా రాజకీయ పార్టీలే. ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా మాట్లాడింది. బీజేపీ అయితే విపక్షం నుంచి బిగ్ సౌండ్ చేస్తూ అయిదేళ్ళు కాదు పదేళ్ళు ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వాల్సిందే అని పట్టుబట్టింది. మొత్తానికి ప్రధాని మన్మోహన్ సింగ్ నాడు రాజ్యసభ సాక్షిగా ప్రత్యేక హోదా మీద బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు.

ఆ తరువాత జరిగిన ఎన్నికల సభల్లో కూడా ఏపీలో ఊరూరా తిరుగుతూ బీజేపీ ప్రత్యేక హోదా మీద చాలానే మాట్లాడింది. అయితే తీరా అధికారంలోకి వచ్చాక నాలిక మడతేసింది. అది లగాయితూ ఆ మాట మీదనే కట్టుబడిపోయింది. దీనికి బీజేపీని మెచ్చాలో లేక మొదటి మాటను మడతేసినందుకు నిందించాలో ఏమీ అర్ధం కాని పరిస్థితి.

పార్లమెంట్ సమవేశాలు జరిగిన ప్రతీ సారీ ఎవరో ఒకరు హోదా గురించి అడుగుతారు. దానికి బదులుగా బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వమని చెబుతూ వస్తుంది. ఈ తంతు ఛాలా కాలంగా సాగుతూనే ఉంది. ఇపుడు మరోసారి అదే మాట బీజేపీ నోట వచ్చింది. ఆ పార్టీకి చెందిన మంత్రి ఇంద్రజిత్ సింగ్ పార్లమెంట్ లో తాజాగా మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా లేదంటే లేదు అని చెప్పేశారు.

అది ముగిసిన అధ్యాయమని చెప్పారు. గతంలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే ప్రత్యేక హోదా కొన్ని రాష్ట్రాలకు ఇచ్చారని, ఇపుడు జనరల్ కేటగిరీ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలకు ఏమీ తేడా చూపించకుండా అందరికీ ఒకేలా పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచామని గుర్తు చేశారు. అందువల్ల ప్రత్యేక హోదా అన్నది లేనే లేదని ఆయన మళ్ళీ తేల్చేశారు.

అంతే కాదు ఏపీకి సంబంధించి రెవిన్యూ లోటు పూడ్చేందుకు కూడా గ్రాంట్స్ ఇస్తున్నాం కాబట్టి ప్రత్యేక హోదా అన్నది మరచిపోవచ్చు అని మంత్రివర్యులు తాపీగా సెలవిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా అన్నది ఇచ్చేది లేదని, ఈ విషయంలో రెండవ మాట లేదు, ఇదే చివరి మాట అని ఆయన స్పష్టం చేశారు.

అయినా ఏపీలో ప్రత్యేక హోదా గురించి ఎవరూ గట్టిగా మాట్లాడుతున్న సందర్భం ఏదైనా ఉందా. అసలు ఆ ఊసు అయినా ఎవరికైనా గుర్తు ఉందా. ఏదో రాజకీయ లాభానికో మరో దానికో ఆ మాటను అపుడపుడు గుర్తు చేసుకుంటారు. ఏపీలో అన్ని పార్టీలూ బీజేపీకి నేస్తాలే. వారు కమలం పువ్వు పార్టీ ఎలా చెబితే అలా నడచుకుంటాయని కూడా తెలుసు. మరి కేంద్రానికి ఏమి బెరుకు ఏమి బెంగ. అందుకే హోదా లేదూ గీదా లేదూ అంటోంది. అదన్న మాట మ్యాటర్.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.