Begin typing your search above and press return to search.

వామ్మో.. ఈ పుష్కర లెక్కలేంది ఇంద్రకరణ్

By:  Tupaki Desk   |   29 July 2015 4:55 AM GMT
వామ్మో.. ఈ పుష్కర లెక్కలేంది ఇంద్రకరణ్
X
గోదావరి పుష్కరాలు ముగిశాయి. పన్నెండు రోజుల పాటు సాగిన పుష్కరాలకు సంబంధించిన లెక్కలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన తొలి పుష్కరాల్ని ఘనంగా నిర్వహించేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా ఏర్పాట్లు చేయటం తెలిసిందే. ఏపీ కంటే మిన్నగా తెలంగాణలో పుష్కరాలు జరిగాయన్నట్లుగా లెక్కలు చెబుతున్న తీరు విస్తుపోయేలా చేస్తోంది.

గోదావరి పుష్కరాలు బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాయన్న మాటలకు నిదర్శనంగా.. భక్తులు పుణ్యసాన్నాలు చేసిన లెక్కల్ని చూపిస్తున్నారు. ఇందుకోసం కొన్ని గణాంకాల్ని తెలంగాణ దేవాదాయ శాఖా మంత్రి చెప్పుకొచ్చారు. ఈ లెక్కల చిక్కుల్లో కొన్ని ఆసక్తికరమైన అంశాలు కనిపించట.. ఇదంతా ఉత్త జిమ్మిక్కే అన్న భావన కలిగేలా చేస్తున్నాయి.

గోదావరి పుష్కరాల ఏర్పాట్లు.. వాటిని సమర్థంగా నిర్వహించటం.. ముఖ్యమంత్రి పర్యవేక్షణ.. మంత్రుల కమిట్ మెంట్ ఇలా వేటిని వంక పెట్టే అవకాశం లేకుండా నిర్వహించినప్పటికీ.. తాజాగా తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెబుతున్న లెక్కలు వింటే అంకెల సిత్రాలు భలే ఉన్నాయే అని అనిపించక మానదు.

లెక్కల్లోకి.. ఆ వెంటనే తర్కంలోకి వెళితే..

1. పుష్కరాల కోసం రూ.600కోట్లు ఖర్చు చేశామన్నారు. దీన్ని కాదనలేం. ఆ మాత్రం కాకున్నా.. ఏపీతో (సుమారు రూ.1500కోట్ల వరకూ) పోలిస్తే.. చాలా పొదుపుగా నిధులు ఖర్చు చేసినట్లే.

2. గోదావరి పుష్కరాల్లో తెలంగాణ లోని పుష్కర ఘాట్లలో గడిచిన 12 రోజుల్లో 6.4కోట్ల మంది పుష్కర స్నానాలు చేసినట్లు చెప్పుకొచ్చారు. తెలంగాణ మొత్తం జనాభానే 3.5కోట్లు అనుకుంటే.. 6.4కోట్ల మంది ఎక్కడి నుంచి వచ్చినట్లు? ఎలా వచ్చినట్లు? ఒకవేళ మంత్రిగారి అంకెలు కరెక్టే అని అనుకుంటే.. తెలంగాణలోని 3.5కోట్ల మంది స్నానాలు చేయగా.. మిగిలిన 3 కోట్ల మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చినట్లుగా భావించాలి.

3. తెలంగాణలోని 3.5కోట్ల మంది జనాభాలో ముస్లింలు.. క్రిస్టియన్లు ఇలా ఇతర మతస్తులు ఎంతమంది? ఇక.. రాష్ట్రంలోని హిందువులంతా కూడా గోదావరి పుష్కర స్నానాలు చేసినట్లేనా అన్న ప్రశ్న రేకెత్తక మానదు. ఇలా చూసినప్పుడు.. పుష్కర స్నానం చేసిన లెక్కలోని డొల్లతనం ఇట్టే అర్థమవుతుంది.

4. ఒకవేళ బయట రాష్ట్రాల నుంచి వచ్చారని భావిస్తే.. దాదాపు నాలుగు కోట్ల మంది (తెలంగాణలోని ప్రజానీకం 2.3కోట్ల మంది స్నానాలు చేశారన్న లెక్క వేసుకుంటే. ఈ లెక్క కూడా మొత్తం జనాభాలో దాదాపు 75 శాతం మంతి పుష్కర స్నానం చేసినట్లు లెక్క వేస్తే) రావాలి. ఒకవేళ అదే జరిగితే.. రైలు..బస్సులు ఎన్ని కావాలి? ఎంత జనసందోహం ఉంటుంది..?

5. మంత్రిగారి లెక్కలు చూస్తే.. పుష్కరాలు నిర్వహించిన ఐదు జిల్లాల్లో ఏ జిల్లాకు ఎంతమంది భక్తులు పుణ్య స్నానాలు చేశారన్న లెక్క తీస్తే.. బాసర పుణ్యక్షేత్రం ఉన్న నిజామాబాద్ జిల్లాలో 2.05కోట్ల మంది స్నానాలు చేస్తే.. కరీంనగర్ జిల్లాలో ఏకంగా రూ.2.9కోట్ల మంది స్నానాలు చేసినట్లు చెప్పుకొచ్చారు. అదెంత వరకూ సాధ్యమవుతుందో ఎవరికి వారు లెక్క వేసుకుంటే ఇట్టే అర్థమవుతంది.

6. పుష్కరాలకు 6.4కోట్ల మంది పుష్కర స్నానం చేస్తే.. పుష్కరాలు జరిగిన జిల్లాల్లో దేవాలయాల్లో దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య 5.14కోట్లుగా తేల్చారు. అంటే.. పుష్కర స్నానాలు చేసి భక్తుల్లో సుమారు 80 శాతం మంది భక్తులు దర్శనం చేసుకున్నట్లు.

7. ఇక.. దేవాలయాల లెక్క సిత్రం చూస్తే.. పుష్కర స్నానం చేసిన భక్తులు నిజామాబాద్ జిల్లాలో 2.05కోట్ల మంది ఉంటే.. దేవాలయాల్లో దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య ఏకంగా 2.14కోట్లుగా చెప్పుకొచ్చారు. అంటే.. పుష్కర స్నానం చేసిన వారి కంటే దేవాలయాలు దర్శించుకున్న వారే ఎక్కువన్న మాట. పుష్కరాల సమయంలో పుష్కర స్నానం కంటే.. దేవాలయాల సందర్శన ఎక్కువ మంది చేస్తారా?

8. ఆసక్తికరమైన మరో లెక్క ఏమిటంటే.. నిజామాబాద్ జిల్లాలోపుష్కర స్నానం 2.05కోట్లు చేస్తే దేవాలయాల సందర్శన 2.14కోట్లు.. కరీంగనగర్ లో 2.91కోట్ల మంది పుష్కర స్నానం చేస్తే.. 2.17కోట్లు దర్శనం చేసుకున్నట్లు చెప్పారు. సిత్రంగా.. ఖమ్మం జిల్లాలో మాత్రం పుష్కరస్నానం 68లక్షల మంది చేస్తే.. దేవాలయాల్ని 21 లక్షల మంది మాత్రమే సందర్శించుకున్నారు. మిగిలిన జిల్లాల్లో 80 శాతం కంటే ఎక్కువ మంది భక్తులు దేవాలయాల్ని సందర్శిస్తే.. ఖమ్మంలోమాత్రం 30 శాతం కంటే తక్కువ శాతం మంది దేవాలయాల్ని సందర్శించుకోవటం ఏమిటి?

9. అదే విధంగా వరంగల్ జిల్లాలోనూ పుష్కర స్నానం 22లక్షల చిల్లర స్నానాలు చేస్తే.. దేవాలయాల సందర్శన మాత్రం 10.7లక్షల మంది మాత్రమే దేవాలయాల్ని సందర్శించటం గమనార్హం.