Begin typing your search above and press return to search.

మంత్రి జగదీశ్ రెడ్డికి షాక్.. ఎన్నికల సంఘం నుంచి నోటీసులు

By:  Tupaki Desk   |   29 Oct 2022 4:40 AM GMT
మంత్రి జగదీశ్ రెడ్డికి షాక్.. ఎన్నికల సంఘం నుంచి నోటీసులు
X
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉప ఎన్నికలు చాలానే జరిగాయి. కానీ.. మరే ఉప ఎన్నిక సందర్భంగా చోటు చేసుకోని హైటెన్షన్ రాజకీయ వాతావరణం తాజాగా జరుగుతున్న మునుగోడు ఉప పోరు వేళ నడుస్తోంది. బరిలో ఉన్న మూడు రాజకీయ పార్టీలు ఎవరికి వారు.. గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. గెలుపు మీద ధీమా లేని పార్టీలు సైతం తమ సత్తా చాటేందుకు ప్రదర్శిస్తున్న పోరాట పటిమ పుణ్యమా అని.. పొలిటికల్ హీట్ అంతకంతకూ పెరుగుతోంది.

పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న వేళ.. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం ఒక రేంజ్ లో సాగుతోంది. ఓటర్లను ఆకర్షించేందుకు ఎవరికి వారుగా చేస్తున్న ప్రయత్నాల్ని మరింత ముమ్మరం చేయటం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. తెలంగాణ అధికార పక్ష నేతలు..

ఓటర్లను ఆకట్టుకోవటం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు గీత దాటి మరీ వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వేళ.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కమ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డికి తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేయటం ద్వారా భారీ షాకిచ్చింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన గీత దాటారంటూ ఎన్నికల కేంద్రం పేర్కొంది. ఎన్నికల కోడ్ ను ఆయన ఉల్లంఘించారని పేర్కొంటూ.. ఆయనకు నోటీసులు జారీ చేసింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ నోటీసులకు శనివారం మధ్యాహ్నం మూడు గంటలలోపు వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. కోడ్ ఉల్లంఘన ఆరోపణలపై ఆయనకు సమాధానం ఇచ్చేందుకు కేవలం గంటలు మాత్రమే గడువు ఇవ్వటంతో.. మంత్రి జగదీశ్వర్ రెడ్డికి ఈ ఉదంతం షాకింగ్ గా మారిందన్న మాట వినిపిస్తోంది. మరి.. ఈసీ జారీ చేసిన నోటీసుకు ఆయన ఏ రీతిలో సమాధానం ఇస్తారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.