Begin typing your search above and press return to search.

పౌరుషం గురించి ప‌వ‌న్ మాట్లాడ‌ట‌మా?

By:  Tupaki Desk   |   10 Oct 2018 4:16 AM GMT
పౌరుషం గురించి ప‌వ‌న్ మాట్లాడ‌ట‌మా?
X
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు ఏపీ మంత్రి జ‌వ‌హార్‌. ఎక్సైజ్ మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆయ‌న తాజాగా ప‌వ‌న్ ను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఇందుకు సంబంధించిన బ‌హిరంగ లేఖ ఒక‌టి విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తూ.. అనుభ‌వం లేదు.. అవ‌గాహ‌న లేదు.. ఏం చేయాలో తెలియ‌ద‌ని చెప్పే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏ అర్హ‌త‌తో ప్ర‌భుత్వంపై బుర‌ద జ‌ల్లుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

గ‌త ఎన్నిక‌ల్లో కేసీఆర్ తాట తీస్తాన‌ని హెచ్చ‌రించిన ప‌వ‌న్‌.. త‌ర్వాత మాత్రం రాజ‌కీయ ల‌బ్థి కోసం మిలాఖాత్ అయ్యార‌న్నారు. కేసీఆర్ ను బాబాయ్ గా.. క‌విత‌ను చెల్లెమ్మ‌గా.. కేసీఆర్ కుటుంబం దేవుడిచ్చిన వ‌రంగా భావిస్తున్న ప‌వ‌న్ త‌మ‌ను విమ‌ర్శించ‌టంలో అర్థం లేద‌ని మండిప‌డ్డారు.

ఒక ప‌క్క అధికారం మీద ఆశ లేద‌ని చెప్పే ప‌వ‌న్‌.. మ‌రోవైపు త‌న‌ను సీఎం చేయాల‌ని కోర‌టాన్ని ప్ర‌స్తావించారు. కాంగ్రెస్ నేత‌ల్ని పంచెలు ఊడ‌గొడ‌తాన‌ని పిలుపునిచ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్.. అదేపార్టీలోకి త‌న అన్న పార్టీ ప్ర‌జారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసేట‌ప్ప‌డు ప‌వ‌న్ ఫౌరుషం ఏమైంద‌ని ప్ర‌శ్నించారు. ఎప్పుడు ఎక్క‌డ ఎలా మాట్లాడ‌తారో తెలీని ప‌వ‌న్‌.. పౌరుషం గురించి మాట్లాడ‌టం విచిత్రంగా ఉంద‌ని ఎద్దేవా చేశారు.

గ‌త ఎన్నిక‌ల వేళ‌లో కేసీఆర్ పై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన ప‌వ‌న్‌.. ఆ త‌ర్వాత ఆయ‌న‌తో ఎందుకు భేటీ అయ్యారో వివ‌ర‌ణ ఇవ్వాల‌న్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్ర‌తి 15 నిమిషాల‌కో అత్యాచారం.. హ‌త్య జ‌రుగుతున్నాయ‌ని.. గ‌డిచిన నాలుగున్న‌రేళ్ల కాలంలో 52 వేల అత్యాచారాలు జ‌రిగాయ‌న్నారు. 11 మందిని కాల్చి చంపార‌ని.. అయినా ఇవేమీ ప‌వ‌న్ ఎందుకు అడ‌గ‌టం లేద‌ని ప్ర‌శ్నించారు. వివిధ అంశాల్ని ప్ర‌స్తావిస్తూ ప‌వ‌న్ పై మంత్రి జ‌వ‌హార్ చేసిన ఆరోప‌ణ‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి.