Begin typing your search above and press return to search.

టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో జగన్?

By:  Tupaki Desk   |   1 Nov 2017 5:31 PM GMT
టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో జగన్?
X
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ఏపీ సీఎం చంద్రబాబులో గుబులు పుట్టిస్తోంది. జగన్ ఆర్నెళ్ల పాటు పాదయాత్ర చేయనుండడమే కాకుండా అందుకోసం ఇప్పుడు అసెంబ్లీని బహిష్కరించడం - అందుకు ప్రభుత్వ పాలన సరిగా లేకపోవడాన్ని కారణంగా చూపడంతో దానిపై ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆయన ఇంటిలిజెన్సు వర్గాలకు ఈ పని అప్పగించారు. దాంతో పాటు పార్టీనేతలు - మంత్రుల నుంచి కూడా దీనిపై అబిప్రాయాలు తెలుసుకుంటున్నారాయన. తాజాగా అమ‌రావ‌తిలో జరిగిన టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ భేటీలోనూ చంద్రబాబు ఎక్కువ సమయం దీనిపైనే మాట్లాడారట.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుపై చంద్ర‌బాబు మంత్రుల‌తో చాలాసేపు మాట్లాడారట. టీడీపీని ఎదుర్కోలేకే వైసీపీ అసెంబ్లీని బ‌హిష్క‌రించింద‌ని - మ‌రోవైపు ప్ర‌భుత్వ పాల‌న బాగోలేక‌పోవ‌డంతోనే బ‌హిష్క‌రిస్తున్నామ‌ని చెప్పుకుంటోంద‌ని చంద్ర‌బాబు అన్నారు. అసెంబ్లీని బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు తెలిపిన‌ జ‌గ‌న్ తీరుపై ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన స్పంద‌న గురించి చంద్ర‌బాబు ఆరా తీశారు. అంతేకాకుండా... ఈ విషయంలో నెటిజన్ల స్పందనను కూడా ఆయన తెలుసుకున్నారు.

సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన వ్యాఖ్య‌ల‌ను చ‌దివి వినిపించాల‌ని మంత్రి కాల్వ శ్రీనివాసులుని చంద్ర‌బాబు కోరారు. అసెంబ్లీని బ‌హిష్క‌రిస్తే ప్ర‌జ‌లు వైసీపీ నేత‌ల‌ను బ‌హిష్క‌రిస్తార‌ని సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నార‌ని కాల్వ శ్రీనివాసులు చంద్ర‌బాబుతో చెప్పినట్లు సమాచారం. వైసీపీకి ఓట్లు అడిగే హ‌క్కు లేద‌ని నెటిజ‌న్లు వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని తెలిపారు. దీంతో చంద్రబాబు ప్రతిస్పందిస్తూ... చ‌ట్టస‌భ‌లంటే గౌర‌వం లేని వ్య‌క్తిని తొలిసారి జ‌గ‌న్ రూపంలో చూస్తున్నామ‌ని... వారు స‌భ‌కు రావ‌డం లేద‌ని ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని తమ పార్టీ సభ్యుల‌కు సూచించారు.

కాగా జగన్ నిర్ణయంపై సోషల్ మీడియాలో రెండు రకాల అభిప్రాయాలూ రాగా కేవలం టీడీపీ అనుకూల అభిప్రాయాలను మాత్రమే చంద్రబాబు వరకు తీసుకెళ్లారని... జగన్ కు మద్దతుగా నెటిజన్లు స్పందించిన విషయాన్ని ఆయన వరకు తీసుకెళ్లలేదని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మొత్తానికి టీడీపీ సమన్వయకమిటీ భేటీలో జగనే ప్రధాన టాపిక్ అయ్యారట.