Begin typing your search above and press return to search.

కేటీఆర్ - ఆనంద్ మహీంద్రా.. ట్విటర్ లో వారి మాటల్ని వినాల్సిందే

By:  Tupaki Desk   |   23 Jun 2022 5:32 AM GMT
కేటీఆర్ - ఆనంద్ మహీంద్రా.. ట్విటర్ లో వారి మాటల్ని వినాల్సిందే
X
ఇద్దరూ ఇద్దరే. వేర్వేరు రంగాలకు చెందిన ఈ ఇద్దరు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారన్నది వారి పేర్లను ప్రస్తావించినంతనే అందరి మదిలో మెదులుతుంది. అలాంటి ఇద్దరు దిగ్గజాలు ట్విటర్ లో పోస్టులు పెట్టుకుంటే.. అది వార్తాంశం కాకుండా పోతుందా?

అందులోని.. రోటీన్ కు భిన్నంగా.. ఫార్మాల్ మాటల్ని పక్కన పెట్టేసి.. మనసుకు అనిపించిన విషయాన్ని అనిపించినట్లుగా చెప్పేసిన తీరు సరికొత్తగా ఉండటమే కాదు.. ఆ ట్వీట్లను చదివినంతనే ముఖంలో నవ్వులు విరబూయటం ఖాయం. ఇంతకూ ఏం జరిగిందంటే.

తెలంగాణలోని జహీరాబాద్ లో మహీంద్రా ట్రాక్టర్ల తయారీ పరిశ్రమ ఉంది. బుధవారం అందులో 3,00,001 ట్రాక్టర్ ను ఉత్పత్తి చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ట్రాక్టర్ తయారీ యూనిట్ ను మంత్రి కేటీఆర్ సందర్శించారు.

ఇదే విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడే మంత్రి కేటీఆర్ లోని సీఈవో నిద్ర లేచారు. 'మహీంద్రా జీ మీరు కనుక మా రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడితే మీ ట్రాక్టర్లకు మార్కెటింగ్ చేసేందుకు నేను రెడీ. అందుకు మీ ట్రాక్టర్ల ముందు నిలబడి ఫోటోలకు ఫోజులిస్తా' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

దానికి ఆనంద్ మహీంద్రా వెంటనే స్పందించారు. మీరు తిరుగులేని బ్రాండ్ అంబాసిడర్.. అందులో నాకెలాంటి సందేహాలు లేవు. మీరు కానీ కెమెరా ముందుకు వస్తే.. రాకెట్ వేగంతో దూసుకెళుతున్న టాలీవుడ్ చూస్తూ ఊరుకోదని.. మిమ్మల్ని తమ వైపునకు లాగేసుకుంటుందని పేర్కొంటూ ట్వీట్ చేశారు.

దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్.. మీరు ఆడుకోవటానికి నేనే దొరికానా? అన్న అర్థం వచ్చేలాంటి చిన్న డైలాగ్ తో సరదా ఎమోజీతో రియాక్టు అయ్యారు. మొత్తానికి ఆనంద్ మహీంద్రా చేత పెట్టుబడులు పెట్టించాలన్న తన సంకల్పానికి ట్వీట్ తో మంత్రి కేటీఆర్ షురూ చేశారని చెప్పక తప్పదు. మరి.. కేటీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తిన ఆనంద్ మహీంద్రా.. మంత్రి కోరినట్లుగా తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెడతారా? దీనికి కాలమే సరైన సమాధానం ఇవ్వగలదు.