Begin typing your search above and press return to search.

తెలంగాణకు మరో 'బండి సంజయ్' దొరికేసినట్లే

By:  Tupaki Desk   |   21 Dec 2022 5:30 AM GMT
తెలంగాణకు మరో బండి సంజయ్ దొరికేసినట్లే
X
మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. ప్రజల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపే రాజకీయాల్లో అంతో ఇంతో విలువలు.. మర్యాద లాంటివి కాస్తంత ఉండాలి. అలా కాకుండా పోతే జరిగే నష్టం అంతా ఇంతా కాదు. బ్యాడ్ లక్ ఏమంటే.. ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో దారుణమైన రాజకీయ పరిస్థితులు ఉంటున్నాయి. మాటల్ని కత్తులుగా మార్చేస్తూ నిత్యం పోరాడే ధోరణి అంతకంతకూ ముదిరిపోతోంది. మర్యాద అన్నది మచ్చుకు లేకుండా పోయి.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడేస్తున్నారు.

ఇంతకాలం తెలంగాణ రాజకీయాల్లో ఇష్టారాజ్యంగా.. అర్థం పర్థం లేనట్లుగా మాట్లాడే రాజకీయ ప్రముఖుడిగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేరును చెప్పటం తెలిసిందే. అయితే.. అతగాడి మాటల ప్రభావంతో మంత్రి కేటీఆర్ సైతం బండి సంజయ్ మాదిరి తయారైనట్లుగా కనిపిస్తోంది. మంత్రి కేటీఆర్ డ్రగ్స్ టెస్టు చేసుకోవాలని గడిచిన కొద్ది నెలలుగా ఆయన డిమాండ్ చేస్తున్నారు.

ఇంతకాలం ఈ తీవ్ర ఆరోపణపై మంత్రి కేటీఆర్ రియాక్టు అయ్యింది లేదు. అందుకు భిన్నంగా తాజాగా మాత్రం మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. బండి సంజయ్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

మర్యాదస్తుడిగా.. మిగిలినవారితో పోలిస్తే చాలా బెటర్ గా అనిపించే మంత్రి కేటీఆర్ నోటి నుంచి వినలేని రీతిలో మాట్లాడటం షాకింగ్ గా మారింది. మంత్రి కేటీఆర్ తాజా మాటల్ని విన్నోళ్లకు.. ఇంతకాలం తెలంగాణ బీజేపీకి ఉన్నట్లే.. గులాబీ పార్టీకి ఒక బండి సంజయ్ లాంటి ఫైర్ బ్రాండ్ ఉండాలని భావించిన పరిస్థితి.

ఇప్పుడా లోటును తీర్చేశారు మంత్రి కేటీఆర్. బండి సంజయ్ మీద ఘాటైన కౌంటర్ ఇచ్చేసిన ఆయన.. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేశారు. నిత్యం సూక్తులు వల్లించే కేటీఆర్ తాజాగా మాత్రం తనకు అలవాటైన బ్యాలెన్స్ ను మిస్ అయ్యారన్న మాట వినిపిస్తోంది. అదే సమయంలో బండి సంజయ్ సక్సెస్ అయ్యారనే మాట వినిపిస్తోంది.

ఎట్టకేలకు బండి సంజయ్ అనుకున్న లక్ష్యాన్ని సాధించారని.. తాను అనుకున్నట్లే మంత్రి కేటీఆర్ లో బ్యాలెన్స్ మిస్ అయ్యేలా చేయటంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఏమైనా.. ఎవరెంత రెచ్చగొడితే మాత్రం మంత్రి కేటీఆర్ చిన్న పిల్లాడి మాదిరి నోటికి వచ్చినట్లు మాట్లాడేయటం ఎంతవరకు సబబు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.