Begin typing your search above and press return to search.

కీలక ప్రకటన సరే..నాన్నతో ప్రైవేటుగా మాట్లాడారా చిన్న సారు?

By:  Tupaki Desk   |   15 Sep 2019 7:47 AM GMT
కీలక ప్రకటన సరే..నాన్నతో ప్రైవేటుగా మాట్లాడారా చిన్న సారు?
X
నల్లమలలో యురేనియ తవ్వకాలు చేపడుతున్నట్లుగా వస్తున్న వార్తలు. దానికి వ్యతిరేకంగా సేవ్ నల్లమల మూమెంట్. ఆ ఉద్యమానికి నైతిక మద్దతు ఇవ్వటమే కాదు.. నల్లమలనుకాపాడాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి మనమడు స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టటం ఒక ఎత్తు అయితే.. యురేనియం తవ్వకాల మీద తన తండ్రితో తాను ప్రైవేటుగా మాట్లాడనున్నట్లుగా శనివారం ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్.

రోజు వ్యవధిలో ముఖ్యమంత్రి అయిన తన తండ్రితో కేటీఆర్ ప్రైవేటుగా మాట్లాడారో లేదో తెలీదుకానీ..తాజాగా శాసనమండలిలో జరుగుతున్న ప్రశ్నోత్తరాల వేళ మాత్రం యూరేనియం వెలికితీతపై కీలక ప్రకటన చేశారు. నల్లమలలో యురేనియం నిక్షేపాల కోసం రాష్ట్రం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని.. భవిష్యత్తులోనూ ఇవ్వబోదని స్పష్టం చేశారు.

యురేనియం నిక్షేపాల కోసం నల్గొండ జిల్లా లంబాపూర్ లో అన్వేషణ జరిగిందని.. నాగర్ కర్నూల్ - అమ్రాబాద్ లలో మాత్రం ఎలాంటి అన్వేషణ చేపట్టలేదన్నారు. ఆయా ప్రాంతాల్లో యురేనియం నిక్షేపాలు ఉన్నప్పటికీ అనుమతులు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. మైనింగ్ లో రెండు దశలు ఉన్నాయని.. అందులో మొదటిదశ అన్వేషణ అని.. ప్రాథమిక దశలో జియాలజిస్టులు అధ్యయనం చేస్తారన్నారు.

యురేనియం విషయంలో ప్రజల్లో ఆందోళన ఉన్న మాట నిజమేనని.. రాజకీయ పార్టీలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని.. యురేనియం శుద్ధి చేసే వరకూ ఎలాంటి రేడియేషన్ వెలువడదని.. అలాంటిది అన్వేషణ దశలోనే జలాలు కలుషితమవుతాయని ప్రచారం చేస్తున్నారన్నారు. యురేనియం మీద లేని భయాందోళనలు క్రియేట్ చేయొద్దన్నారు. కామెడీ కాకుంటే.. ఇవాళ ప్రాథమికంగా అన్వేషణ రేపటి రోజున తవ్వకాల వరకూ వెళుతుందన్న చిన్న విషయం ఎవరికి మాత్రం తెలీదు. యురేనియం మీద చిన్నసారు క్లారిటీ ఇచ్చే కన్నా.. పెద్ద సారు లైన్లోకి వచ్చి.. యురేనియం అన్వేషణ కూడా ఉండదన్న మాటను చెప్పేస్తే సరిపోతుంది కదా? ఆ పని ఆయన ఎందుకు చేయట్లేదు?