Begin typing your search above and press return to search.

మోడీ మౌనం మీద మంట సరే.. నాన్న గారి మౌనం మీద బదులేంటి కేటీఆర్?

By:  Tupaki Desk   |   17 Jun 2022 3:30 PM GMT
మోడీ మౌనం మీద మంట సరే.. నాన్న గారి మౌనం మీద బదులేంటి కేటీఆర్?
X
శ్రీలంక ప్రజలు ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ మీదా.. కుబేరు ప్రారిశ్రామికవేత్త అదానీ గ్రూప్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడటం తెలిసిందే. పవన విద్యుత్ ప్రాజెక్టును పారదర్శకత అన్నది లేకుండా.. ఎలాంటి టెండర్లను పరిగణలోకి తీసుకోకుండా కేవలం భారత ప్రధాని నరేంద్ర మోడీ మాటతో కట్టబెట్టేశారంటూ శ్రీలంకకు చెందిన కీలక స్థానంలో ఉన్న వారు చెప్పిన వీడియో బయటకు రావటంతో.. రచ్చ రచ్చగా మారింది. నరేంద్ర మోడీ వైపు వేలెత్తి చూపించే ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు.

మోడీ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ఆయన.. తనకు బాగా అలవాటైన వాదనను వినిపించారు. ప్రస్తుతం తన ఆయుధంగా మార్చుకున్న ట్విటర్ లో ఆయన ట్వీట్ చేస్తూ.. 'ఈడీ.. సీబీఐ.. ఐటీ వర్గాలతో ప్రతిపక్షాలను వేధిస్తున్నారు. మరోవైపు ప్రధాని మోడీపై శ్రీలంక సీనియర్ ఉన్నతాధికారి బహిరంగంగా ఆరోపణలు చేశారు. ఈ విషయంపై మోడీ లేదంటే అదానీ ఎందుకు స్పందించటం లేదు? ఎందుకు మౌనంగా ఉన్నారు?' అని ప్రశ్నించారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ప్రధాని నరేంద్ర మోడీ మౌనం మీద మండిపడుతున్న మంత్రి కేటీఆర్.. తన తండ్రి కమ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం.. తన మీద వచ్చే ఆరోపణల మీద కూడా స్పందించరని.. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పుడు కూడా పట్టనట్లుగా ఉంటారన్నది మర్చిపోకూడదు.

ఎక్కడిదాకానో ఎందుకు గడిచిన వారం వ్యవధిలో తెలంగాణ రాష్ట్రంలో గౌరవెల్లి భూనిర్వాసితుల ఇళ్లపై అర్థరాత్రి దాటిన తర్వాత పోలీసులు దాడులు చేసిన వైనంపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు.

మరోవైపు బాసర ట్రిపుల్ ఐటీకి చెందిన వేలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చి తమ సమస్యలపై ఎలుగెత్తి నినదిస్తున్నారు. నిరసనలు చేపడుతున్నారు.ఈ రెండు ఉదంతాల్లోనూ ప్రభుత్వ బాధ్యత ఎంతన్నది అందరికి తెలిసిందే. నిజానికి ఈ రెండింటి ఇష్యూలను తేల్చేయటం కేసీఆర్ స్థాయికి చాలా చిన్న విషయాలు. కానీ.. ఆ సమస్యల్ని అలానే నాన బెడుతూ మౌనంగా ఉన్నారే తప్పించి ముఖ్యమంత్రి మాట్లాడింది లేదు.

ఎక్కడిదాకానో ఎందుకు? లంకలోని పరిస్థితుల్ని చూపించి ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడుతున్న మంత్రి కేటీఆర్ సైతం.. పైన పేర్కొన్న రెండు అంశాల విషయంలో స్పందించలేదన్నది మర్చిపోకూడదు. ఎదుటి వారికి నీతులు చెప్పే ముందు.. మనం ఆచరించి చూపిస్తే బాగుంటుంది కదా కేటీఆర్? అన్న ప్రశ్నల్ని పలువురు సందిస్తున్నారు.