Begin typing your search above and press return to search.
హైదరాబాద్ మెట్రో..ఇంకెంత లేటు కేటీఆర్?
By: Tupaki Desk | 10 Aug 2018 1:59 PM GMTహైదరాబాద్ మెట్రో రెండో దశ ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఈ ప్రశ్నకు...ఆఖరుకు మెట్రో అధికారులు కూడా సమాధానం చెప్పలేరేమో! ఔను. ఎందుకంటే...మెట్రో ప్రారంభంపై ప్రజల్లో అంచనాలు - ఊహలు ఓ వైపు పెరిగిపోతుంటే...మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగినట్లే తేదీలు చెప్పుకొస్తుంది. అయితే, వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన మెట్రో ఆగస్టు 15వ తేదీన ప్రారంభం అవుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ మళ్లీ వాయిదా పడింది. ఔను. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు - రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ విషయాన్ని వెల్లడించారు.
ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ చౌరస్తా వద్ద రూ.49 కోట్లతో చేపట్టి నిర్మాణం పూర్తయిన ఫ్లై ఓవర్ ను సహచర మంత్రులు - ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాలో రోడ్ల అభివృద్ధికి రూ.46 వేల కోట్లు అందిస్తున్నామన్నారు. హైదరాబాద్ - రంగారెడ్డి జిల్లా పరిసరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైదరాబాద్ లో అత్యంత వేగంగా ఎల్బీనగర్ విస్తరణతో పాటు అభివృద్ధి సాగుతోందని అన్నారు. 2030 వరకు హైదరాబాద్ మెగాసిటీగా అవతరిస్తుందని తెలిపారు. హైదరాబాద్ దేశంలో మూడో స్థానానికి వెళ్లొచ్చని పేర్కొంటూ హైదరాబాద్ కు చాలా ఫ్లై ఓవర్లు అవసరం ఉందన్నారు. అందుకే 23 వేల కోట్ల రూపాయలతో ప్రణాళికను సిద్దం చేశామన్నారు. ఎల్బీనగర్ లో రూ.450 కోట్ల ఖర్చుతో రోడ్లు అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. కామినేని ఫ్లైఓవర్లో ఎడమ వైపు ప్రారంభం చేశామని, మరో ఆర్నెళ్లలో కుడివైపు ఫ్లై ఓవర్ పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ సందర్భంగా మెట్రో గురించి మంత్రి కేటీఆర్ వివరించారు. ``ఆగస్ట్ 15న అమీర్ పేట్-ఎల్బీనగర్ మెట్రో రూట్ ప్రారంభం చేద్దాం అనుకున్నాం. అయితే, కేంద్ర మెట్రో సేఫ్టీ అథారిటీ పర్మిషన్ రాలేదు అందుకే ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలో అమీర్‌పేట్-ఎల్బీనగర్ మెట్రో లైన్ ను సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం చేస్తాం`` అని వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎల్‌బీ నగర్ టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మంత్రి కేటీఆర్ ను ఆకాశానికి ఎత్తారు. కేటీఆర్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నారని కితాబిచ్చారు. ఎల్బీనగర్ లో 16 వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇళ్ల పట్టాల సమస్యలు ఉన్నా వాళ్ల సమస్య పరిష్కారానికి మంత్రి చొరవ చూపారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న ఆలోచనలు, కొత్త దృక్పథంతో అభివృద్ధి చేస్తున్నారని అభినందించారు. ప్రభుత్వ అభివృద్ది పథకాలకు తమ మద్దతు ఉంటుందని ఆర్.కృష్ణయ్య అభయం ఇవ్వడం గమనార్హం.