Begin typing your search above and press return to search.

పుసుక్కున అధికారుల్ని అంత మాట అనేశారేంటి కేటీఆర్?

By:  Tupaki Desk   |   18 Aug 2021 11:00 AM IST
పుసుక్కున అధికారుల్ని అంత మాట అనేశారేంటి కేటీఆర్?
X
ఉమ్మడి రాష్ట్రంలో చూడని రాజకీయం.. ప్రభుత్వ పాలన తెలంగాణ రాష్ట్రంలో.. అందునా కేసీఆర్ సర్కారులో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులతో పాలన చేయించటం.. మంత్రుల్ని డమ్మీలుగా మార్చటం.. ఎమ్మెల్యేలకు.. ఎమ్మెల్సీలకు తగినంత గౌరవ మర్యాదలన్నవి లేకుండా చేశారన్న ఘాటు ఆరోపణ కేసీఆర్ సర్కారు మీద తరచూ వినిపిస్తూ ఉంటుంది. కేసీఆర్ హయాంలో అధికారుల తీరు పూర్తిగా మారిందని.. చాలామంది మంచి పదవుల కోసం.. ప్రభుత్వ ప్రాపకం కోసం పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శ ఉంది. ఇలాంటివేళ.. మంత్రి కేటీఆర్ నుంచి వచ్చిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

ప్రభుత్వ అధికారులపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు సంచలనంగా మారటమే కాదు.. ఇలా వ్యాఖ్యానించటమా? అన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఒకవైపు అధికారుల్ని తమకు తగినట్లుగా వాడేస్తూనే.. ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఏమిటన్న ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మంత్రి కేటీఆర్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలేమిటి? ఆయన ఎక్కడ ఈ మాటలు మాట్లాడారు? అన్న విషయంలోకి వెళితే..

సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం వర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా యాజమాన్యం తరపునే కాదు.. లెక్చరర్లు.. విద్యార్థులు ఆయన్ను పలు ప్రశ్నలు అడిగారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే క్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు ఆయన నోటి నుంచి వచ్చాయి. ప్రభుత్వ పథకాల అమల్లో ఎదుర్కొనే అవరోధాలు ఏమైనా ఉన్నాయా? అని ఒక విద్యార్థిని మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించగా ఆయన స్పందించారు.

‘అధికారుల్లో అయితే తాము చాలా చదువుకున్నామని.. పొలిటీషియన్లు తక్కువనే భావన ఉంటుంది. ఏదైనా కొత్త పథకాన్ని అమలు చేయాలని చెప్పగానే.. అది సాధ్యం కాదు అనే మాట ఐఏఎస్ అధికారుల నుంచి వస్తుంది. సహజంగానే ఈ రకమైన మైండ్ సెట్ అందరిలోనూ ఉంటుంది. మార్పు కోరటం అంత సలువైంది కాదు. అది మానవ లక్షణం. బ్యూరోక్రాట్లు రాజకీయ నేతల్ని గెస్టు ఆర్టిస్టులుగా భావిస్తారు. ఐదేళ్ల కాలానికి వచ్చిపోతారనే భావనే దీనికి కారణం. వారేమో పర్మనెంట్ ఆర్టిస్టులుగా భావిస్తుంటారు’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉన్నత అధికారులపై మంత్రి కేటీఆర్ వేసిన పంచ్ కు అక్కడున్న వారంతా నవ్వేయటం గమనార్హం.

తాను ఐఏఎస్ అధికారి కావాలని తన తండ్రి కేసీఆర్ కోరికగా ఉండేదన్నారు. ఢిల్లీలో చదువుకునేందుకు వెళ్లిన సమయంలో మేనమామ ఒకరు ఇచ్చిన సలహాతో ఆ ప్రయత్నాన్ని వదిలేశానని చెప్పారు. ఐటీ ఉద్యోగం చేశానని.. ఉద్యోగంలో భాగంగా చాలా దేశాలు తిరిగినట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తండ్రి కేసీఆర్ కు చెప్పకుండానే 2008లో కార్యకర్తగా టీఆర్ఎస్ లో చేరి.. రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. గతంలో రైతుబంధును మొదలు పెట్టినప్పుడు విమర్శలు వచ్చాయని.. కానీ ఈ రోజున దేశంలోని 11 రాష్ట్రాల్లో రైతుబంధును అమలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా ప్రవేశ పెట్టిన దళిత బంధుపైనా విమర్శలు వస్తున్నాయని.. అవన్నీ పోతాయన్నారు.