Begin typing your search above and press return to search.

ఏపీ విత్తన సంక్షోభానికి బాబే కారణం

By:  Tupaki Desk   |   2 July 2019 10:05 AM GMT
ఏపీ విత్తన సంక్షోభానికి బాబే కారణం
X
అధికారంలో ఉన్పప్పుడు వైసీపీ బాధపడితే.. ఇప్పుడు అధికారం కోల్పోయి ఆ బాధలు టీడీపీ నేతలు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం దూకుడు ముందు టీడీపీ నేతలు వెలవెల బోతున్నారు. తాజాగా ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు.. చంద్రబాబు, లోకేష్ ల తీరుపై మండిపడ్డారు. తమ ప్రశ్నలకు వీరిద్దరూ సమాధానం చెప్పాలని మంత్రి సవాల్ విసిరారు.

తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఏపీలోని విత్తనాల కొరతపై మాట్లాడారు. మాజీ సీఎం చంద్రబాబు విధానాల వల్లే ఏపీలో విత్తనాల సంక్షోభం ఏర్పడింది ధ్వజమెత్తారు. బాబు రైతులను నిండా ముంచారని ఎండగట్టారు. జనవరి నుంచే విత్తనాల సేకరణకు నిధులు కేటాయించాలని.. అడిగినా.. 28 సార్లు అధికారులు లేఖలు రాసినా చంద్రబాబు పట్టించుకోలేదని ఆరోపించారు. వ్యవసాయ అధికారులు నాడు రాసిన లేఖలను టీడీపీ అధినేత చంద్రబాబు ఆఫీసుకు పంపిస్తామని దీనిపై సమాధానం చెప్పాలని కన్నబాబు ధ్వజమెత్తారు.

ఏపీ సీడ్స్ సంస్థకు చంద్రబాబు ప్రభుత్వం రూ.380 కోట్లు బకాయిలు చెల్లించకపోవడంతో ఆ సంస్థ రైతులకు కావాల్సిన విత్తనాలను సేకరించలేదని కన్నబాబు మండిపడ్డారు.రైతులకు ధాన్యం సేకరణ డబ్బులు కూడా చంద్రబాబు దారి మళ్లించారని మండిపడ్డారు. రైతుల నేటి దుస్థితికి చంద్రబాబే కారణమన్నారు.

లోకేష్, చంద్రబాబులకు ధైర్యముంటే ఎందుకు విత్తనాల సేకరణలో జాప్యం చేశారో చెప్పాలని మంత్రి కన్నబాబు డిమాండ్ చేశారు. జగన్ ఇప్పుడు తాజాగా విత్తనాల సేకరణకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారని.. రాష్ట్రంలో 3 లక్షల వేరుశనగ విత్తనాల సరఫరాకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రైతులను ముంచి చంద్రబాబు తీరును ఆధారాలతో సహా ఎండగడుతామని చెప్పుకొచ్చారు.