Begin typing your search above and press return to search.
ప్రింటింగ్ ప్రెస్ లో కూలోడివి..ఇన్ని కోట్లెక్కడివి?
By: Tupaki Desk | 21 Dec 2017 11:03 AM GMTతెలంగాణ రాజకీయాలు మరోమారు హీటెక్కాయి. జడ్చర్ల జనగర్జన పేరుతో రెండో బహిరంగ సభను నిర్వహించిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అధికార టీఆర్ ఎస్ పార్టీపై - ఆ పార్టీ నేతలపై దుమ్మత్తి పోశారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ సైతం ఘాటుగానే రియాక్టయింది. అసెంబ్లీ ఆవరణలోని టీఆర్ ఎస్ ఎల్పీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి - ఎమ్మెల్యేలు శ్రీనివాస గౌడ్ - ఆల వెంకటేశ్వర రెడ్డి - మర్రి జనార్దన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.
మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్లు జడ్చర్ల కాంగ్రెస్ సభ జరిగిందని ఎద్దేవా చేశారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత కాంగ్రెస్ చెప్పుకొంటున్న 30 వేల మంది కాకుండా 3 వేల మంది కూడా హాజరు కాలేదని అన్నారు. అంతమంది అగ్రనేతలు వస్తే సభసాగిన తీరు మరీ ఘోరమని ఎద్దేవా చేశారు. 3 వేలమందితో అగ్ర నేతలంతా సభ జరిపి జబ్బలు చరుచుకుంటున్నారని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ నేతలు సిగ్గు లేకుండా తెలంగాణ గురించి మాట్లాడారని మండిపడ్డారు. ప్రజలంతా కాంగ్రెస్ శనిని వదలించుకోవాలని చూస్తున్నారని, ఆ దరిద్రాన్ని దరిదాపుల కనిపించకుండా చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలను చూసి కూడా అభివృద్ధి కావడం లేదని మాట్లాడటం దురదృష్టకరమని మంత్రి అన్నారు.
కళ్లుండి చూడలేని కబోదుల్లా కాంగ్రెస్ మారిందని మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్ళు అవినీతి గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని ఎద్దేవా చేశారు. వాళ్ళ పాప పంకిలాన్ని కడగలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల మీద పనికిమాలిన దద్దమ్మల్లా మాట్లాడుతున్నారని...వాళ్ళు దోచిన ప్రాజెక్టులను నానా తంటాలు పడి తిరిగి ప్రారంభించామని తెలిపారు. ఇంతగా అబద్ధాలు చెబితే వాళ్ళను ఏమనాలి వెధవలు అనాలా? వద్దా? అని వ్యాఖ్యానించారు. ఇంతకాలం ప్రాజెక్టులను ఎందుకు కట్టలేదని ఆయన ప్రశ్నించారు. కరెంటును రోజుకు ఐదారు గంటలు కూడా ఇవ్వలేని దద్దమ్మలు కాంగ్రెస్ నేతలని ఆరోపించారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ సర్వ నాశనం చేసిందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీకి ఇటీవలే ఒక జోకర్ తోడయ్యాడని ఎద్దేవా చేశారు. `రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు దిగొద్దు. లత్కోరు రాజకీయాలు చేయొద్దు. చార్లెస్ శోభారాజ్ కంటే ఘనుడవు నీవు. నీలా బ్లాక్ మెయిల్ చేయను - ద్రోహిని కాదు` అంటూ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. `అవును నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను. కష్టపడి సంపాదించి రాజకీయాల్లో ఖర్చు చేస్తున్నాను. ప్రింటింగ్ ప్రెస్ లో కూలీ గాడివి ఇప్పుడు ఇంత ఎలా సంపాదించావు?అంటూ నిప్పుల వర్షం కురింపించారు. అట్టర్ ఫ్లాప్ సభలు పెట్టి అనవసర ప్రేలాపణలు చేయవద్దని మంత్రి లక్ష్మారెడ్డి కోరారు. `మా సీఎం గురించి - మా మంత్రుల గురించి మాట్లాడితే ఖబడ్దార్. మీలా పత్తాలు ఆడే బాపతు మంత్రులం కాదు మేం. బంగారు తెలంగాణ కోసం అహర్నిశలు పాటు పడుతున్నాం.తెలంగాణ ఉద్యమంలో నుంచి పారిపోయిన ద్రోహులు - దొంగలు కాంగ్రెస్ వాళ్లు. మేం రాష్ట్రం కోసం ఉద్యమించాం. అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం.` అని స్పష్టం చేశారు. మబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్ మాట్లాడుతూ కుటుంబ పాలన గురించి కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడటం చిత్రంగా ఉందన్నారు.