Begin typing your search above and press return to search.

అంత జరుగుతున్నా మహమూద్ అలీ లైట్ తీసుకోవటమా?

By:  Tupaki Desk   |   25 Jun 2020 9:10 AM GMT
అంత జరుగుతున్నా మహమూద్ అలీ లైట్ తీసుకోవటమా?
X
తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ తీరుపై పలువురు విమర్శలకు దిగుతున్నారు. అలా అని ఆయనేదో తప్పు చేశారని కాదు. తన చుట్టు ఉండే భద్రతా సిబ్బందిలో ఒకరి తర్వాత ఒకరికి మహమ్మారి పాజిటివ్ తేలటం తెలిసిందే. ఇప్పటివరకూ మహమూద్ అలీకి భద్రతను కల్పించే సిబ్బందిలో ఇప్పటివరకూ ఎనిమిది మందికి పాజిటివ్ గా తేలింది. సాధారణంగా తమ చుట్టూ ఉండే సిబ్బందికి పాజిటివ్ వచ్చినంతనే.. నేతలు జాగ్రత్త పడటం చూస్తున్నాం.

అందుకు భిన్నంగా మహమూద్ అలీ మాత్రం.. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనటంపై విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలోరోజురోజుకీ కేసుల తీవ్రత పెరిగిపోతున్న వేళ.. ఎంతో అవసరం ఉంటేనే సామాన్యులు బయటకు రాని పరిస్థితి. కొందరు మినహాయిస్తే చాలామంది ఇదే తీరును ప్రదర్శిస్తున్నారు. ఇక.. సంపన్నులు.. నేతల విషయానికి వస్తే వారి ధోరణి భిన్నంగా ఉంది. రోజువారీ కార్యక్రమాల్ని సైతం బంద్ చేసుకొని.. ఎవరిని ఇంటికి రావొద్దంటూ కోరుతున్నారు.

ఒకవేళ వచ్చినా చాలా తక్కువ మందిని కలిసేందుకు ఇష్టపడుతున్నారు. కొందరు నేతలు అయితే.. ఇంటి నుంచి బయటకు రావటం లేదు. ఇంట్లో పని చేసే వారిని కూడా తగ్గించేసుకుంటున్నారు. పని చేసే ఇద్దరు ముగ్గురిని ఇంట్లోనే ఉంచేసుకుంటున్న పరిస్థితి. ఇలా జాగ్రత్తలు తీసుకుంటున్న దానికి భిన్నంగా హోంమంత్రి మహమూద్ అలీ మాత్రం విరివిగాకార్యక్రమాల్లో పాల్గొనటం సరికాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

సోషల్ మీడియాలోనూ అలీ తీరును ప్రస్తావిస్తూ పోస్టులు రావటం గమనార్హం. మహమూద్ అలీ భద్రతా సిబ్బందికి పాజిటివ్ రావటం.. ఆయన నివాసం మలక్ పేట నియోజకవర్గ పరిధిలో ఉండటం.. అక్కడ వైరస్ లక్షణాలు తీవ్రంగా ఉండటాన్ని ప్రస్తావిస్తున్నారు. అలీ భద్రతా సిబ్బందికి పాజిటివ్ రావటమంటే.. ప్రమాదం పొంచి ఉన్నట్లేనని చెప్పక తప్పదు. ఇప్పటికైనా తన పనుల హడావుడిని పక్కన పెట్టి.. ఆచితూచి అన్నట్లుగా కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు. లేకుంటే.. మహమూద్ అలీకి మాత్రమే కాదు.. ఆయన పాల్గొనే కార్యక్రమాలకు హాజరయ్యే వారికి మహమ్మారి ముప్పు తప్పదన్నది మర్చిపోకూడదు.