Begin typing your search above and press return to search.

హీరో నాని వ్యాఖ్యలకు మంత్రి నాని కౌంటర్..!

By:  Tupaki Desk   |   28 Dec 2021 6:19 AM GMT
హీరో నాని వ్యాఖ్యలకు మంత్రి నాని కౌంటర్..!
X
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల వ్యవహారం మీద చర్చలు జరుగుతున్న నేపథ్యంలో.. సినిమా థియేటర్లు కూడా మూతపడటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు అధికారులు థియేటర్లపై దాడులు చేసి సీజ్ చేస్తుంటే.. మరోవైపు ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరలతో థియేటర్లు నడపడలేమంటూ మరికొందరు స్వచ్ఛందంగా మూసివేస్తున్నారు. అలానే థియేటర్ల కౌంటర్ లను కిరాణా దుకాణాల కలెక్షన్స్ తో పోల్చుతూ హీరో నాని చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. అయితే దీనిపై ఏపీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు.

కొడాలి నాని మాట్లాడుతూ.. 'నిజంగా బడ్డీ కొట్టుకు వచ్చిన కలెక్షన్స్ సినిమా వాళ్లకు రాకపోతే వాళ్లు కూడా బడ్డీ కొట్టులే పెడతారు కదా?' అని ప్రశ్నించారు. ''ఎవరైనా ఆదాయం కోసమే వ్యాపారం చేస్తారు. ఒకవేళ నిజంగా సినిమా హీరోకో డిస్ట్రిబ్యూటర్ - థియేటర్ యజమానులకు బడ్డీ కొట్టుకు వచ్చే రెండు మూడు వేల ఆదాయం రాకపోతే.. అందరూ సినిమాలు వదిలేసి అవే పెడతారు కదా?. జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతంగా కొంతమందికి ద్యేషం ఉంటుంది.. అది సినిమా పరిశ్రమ అయినా రాజకీయాల్లోనైనా ఉంటుంది. అందుకే అలాంటి వారు ఆయన మంచి చేసినా ఆరోపణలు చేస్తూనే ఉంటారు'' అని నాని అన్నారు.

సినిమా టికెట్ల ధరలు ప్రభుత్వం తగ్గించలేదని.. నియంత్రణ మాత్రమే చేశామని కొడాలి నాని స్పష్టం చేశారు. గతంలో కొన్ని సినిమాలకు రేట్లు పెంచమని కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకునేవారని.. కానీ తమ ప్రభుత్వం ఇలాంటి పరిస్థితి ఉండకూడదని జీవో ఇచ్చిందని.. అంతేకానీ తాము టికెట్ రేట్లు తగ్గించలేదని మంత్రి అన్నారు. కోర్టు అనుమతితో అడ్డంగా దోచుకునే అవకాశం లేకుండా చేయడానికే ప్రభుత్వం ఓ కమిటీ వేసి ఈ నిర్ణయం తీసుకుందని నాని తెలిపారు.

సినిమా టికెట్ ధరలు తగ్గిస్తే ఎగ్జిబిటర్లకు నష్టం అని చెబుతున్నారని నాని మండిపడ్డారు. ఈ నిర్ణయం వల్ల ఎగ్జిబిటర్స్ కు ఎలాంటి నష్టం ఉండదని అభిప్రాయ పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్లలో 10 శాతం నాన్ ఏసీ థియేటర్లు ఉన్నాయని.. మొత్తం మీద 10 శాతం మాత్రమే రూ.10 టికెట్స్ ఉన్నాయని నాని వెల్లడించారు. థియేటర్ యజమానులను అడ్డం పెట్టుకుని సినిమా టికెట్ల విషయంలో కొంతమంది పైనుండి గేమ్ ఆడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే సినిమా టికెట్ల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం ఓకమిటీని ఏర్పాటు చేసింది. హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఛైర్మన్ సహా పది మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటు అయింది. చైర్మన్ తో సహా ఏడుగురు అధికారులు.. ఒక ఎగ్జిబిటర్ - ఒక డిస్ట్రిబ్యూటర్ - తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఒక ప్రతినిధి ఈ కమిటీలో ఉంటారు. సినిమా టికెట్ల వ్యవహారం మరియు డిస్ట్రిబ్యూటర్స్ - ఎగ్జిబిటర్స్ సమస్యలపై ఈ కమిటీ చర్చించనుంది.