Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ ఆస్తుల లెక్క‌లు చెప్పిన లోకేశ్‌

By:  Tupaki Desk   |   8 Dec 2017 6:01 AM GMT
ఫ్యామిలీ ఆస్తుల లెక్క‌లు చెప్పిన లోకేశ్‌
X
విలువ‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్నాం. మా అంత‌టి పోటుగాళ్లు ఎవ‌రూ ఉండ‌రు. మేం కాబ‌ట్టి ఆస్తులు ప్ర‌క‌టిస్తున్నాం కానీ మ‌రెవ‌రూ ప్ర‌క‌టించ‌టం లేదన్న‌ట్లుగా గొప్ప‌లు చెప్పుకోవటం నారా వారి ఫ్యామిలీకి అల‌వాటే. ప్ర‌తి ఏటా త‌మ ఆస్తుల ప్ర‌క‌ట‌న‌ను చేస్తూ ఆస‌క్తిక‌ర‌క‌థ‌నాల‌కు అవ‌కాశం ఇచ్చే చంద్రబాబు కుటుంబం మ‌రోసారి అలాంటి మేజిక్‌ను ప్ర‌ద‌ర్శించింది.

విప‌క్షంలో ఉన్న‌ప్పుడు.. అవినీతి మీద యుద్ధం చేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు త‌మ ఆస్తులు.. అప్పుల వివ‌రాల్ని వెల్ల‌డించ‌టం షురూ చేశారు. ఆస్తుల లెక్క‌ల‌కు సంబంధించి చాలానే ఆరాలు అడిగినా వేటికి స‌మాధానం చెప్ప‌కుండా త‌మ దారిన తాము ఆస్తుల్ని.. అప్పుల్ని ప్ర‌క‌టించ‌టం ఒక అల‌వాటుగా మార్చుకున్నారు. గ‌డిచిన ఏడేళ్లుగా ఈ ప్ర‌క్రియ చేప‌ట్టిన చంద్ర‌బాబు ఫ్యామిలీ ఈసారి మాత్రం త‌మ ఆస్తుల‌.. అప్పుల వివ‌రాల్ని వెల్ల‌డించ‌లేద‌న్న విమ‌ర్శలు వెల్లువెత్తాయి.

ఎప్పుడూ ప్ర‌క‌టించే దానికంటే కాస్త ఆల‌స్యంగా ఆస్తుల ప్ర‌క‌ట‌న‌ను చేశారు బాబు కుమారుడు.. మంత్రి లోకేశ్‌. ఈ రోజు ఆయ‌న మాట్లాడుతూ త‌మ కుటుంబ స‌భ్యుల ఆస్తుల వివ‌రాల్ని వెల్ల‌డించారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. గ‌తంలో ఆస్తులతో పాటు అప్పుల్ని ప్ర‌క‌టించిన లోకేశ్ ఈసారి మాత్రం త‌మ కుటుంబ స‌భ్యుల ఆస్తుల్ని మాత్ర‌మే ప్ర‌క‌టించారు.

దేశంలో మ‌రే రాజ‌కీయ కుటుంబం త‌మ మాదిరి వ‌రుస‌గా ఆస్తులు ప్ర‌క‌టించ‌లేద‌న్నారు. త‌మ కుటుంబంపై కొంద‌రు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని.. అలా ఆరోప‌ణ‌లు చేసే వారు సైతం త‌మ ఆస్తులు ప్ర‌క‌టిస్తే బాగుంటుంద‌న్నారు. ప‌ద్ద‌తి ప్ర‌కారం వ్యాపారం చేయ‌టం త‌ప్పు కాద‌న్న లోకేశ్‌.. ఏపీ విప‌క్ష నేత జ‌గ‌న్ ఇప్ప‌టివ‌ర‌కూ ఎప్పుడూ ఆస్తులు ప్ర‌క‌టించ‌లేద‌న్నారు.

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ అధికారంలో ఉన్న‌ప్పుడు హెరిటేజ్ మీద 17 కేసులు వేశార‌ని.. అయితే ఏ ఒక్క‌టి నిరూపించ‌లేద‌న్నారు. ఇక‌.. ఆస్తుల లెక్క‌ల్లోకి వెళితే.. చంద్ర‌బాబుతో పోలిస్తే.. ఆయ‌న మ‌న‌మ‌డు దేవాన్ష్ నిక‌ర ఆస్తులు ఎక్కువ‌గా ఉండ‌టం గ‌మ‌నార్హం.

చంద్ర‌బాబు కుటుంబంలో అంద‌రి కంటే త‌క్కువ నిక‌ర ఆస్తులు ఆయ‌న‌వే. లోకేశ్ ప్ర‌క‌టించిన దాని ప్ర‌కారం చంద్ర‌బాబు నిక‌ర ఆస్తులు రూ.2.53 కోట్లు మాత్ర‌మేన‌న్నారు. ఆయ‌న స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి నిక‌ర ఆస్తులు రూ.25.41 కోట్లు కాగా.. లోకేశ్ నిక‌ర ఆస్తులు రూ.15.21 కోట్లుగా పేర్కొన్నారు. మ‌రో కీల‌క‌మైన విష‌యం ఏమిటంటే ప్ర‌స్తుతం హెరిటేజ్ వ్య‌వ‌హారాల్లో కీల‌క‌భూమిక పోషిస్తున్న లోకేశ్ స‌తీమ‌ణి బ్రాహ్మ‌ణి నిక‌ర ఆస్తులు రూ.15.01 కోట్లుగా వెల్ల‌డించారు. అయితే.. త‌మ ఆస్తుల బుక్ వేల్యూ ప్ర‌కార‌మే కానీ.. మార్కెట్ విలువ ఆధారంగా లెక్కించ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం. మార్కెట్ వాల్యూ ప్ర‌కారం ఆస్తుల విలువ‌లు మారుతూ ఉంటాయంటూ చెప్పే ప్ర‌య‌త్నం చేశారు లోకేశ్‌.