Begin typing your search above and press return to search.

లోకేశ్ అస‌లు నిజం ఒప్పేసుకున్నారా?

By:  Tupaki Desk   |   25 Aug 2017 4:10 PM GMT
లోకేశ్ అస‌లు నిజం ఒప్పేసుకున్నారా?
X
ఏపీలో అధికార పార్టీ టీడీపీకి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగానే కాకుండా ఏపీ కేబినెట్‌ లో ఐటీ - పంచాయ‌తీరాజ్ శాఖ‌ల మంత్రిగా కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న నారా లోకేశ్... నిన్న సాగ‌ర న‌గ‌రం విశాఖ‌లో సుడిగాలి ప‌ర్య‌ట‌న చేశారు. ప‌లు ఐటీ కంపెనీల‌కు ఆయ‌న రిబ్బ‌న్ క‌ట్ చేశారు. స‌ద‌రు కంపెనీల వ‌ల్ల ఏపీలో ఎంత‌మేర ఉపాధి అవ‌కాశాలు వ‌స్తున్నాయ‌న్న విష‌యంతో పాటు స‌ద‌రు ప‌రిశ్ర‌మ‌లతో ఒక్క విశాఖ వాసుల‌కే ఎన్ని మేర ఉపాధి అవ‌కాశాలు వ‌స్తున్నాయ‌న్న విష‌యాన్ని కూడా ఆయ‌న ఏక‌రువు పెట్టారు. అంతా బాగానే ఉంది గానీ... ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన ఓ మాట ఇప్పుడు వైరల్‌ గానే మారిపోయింద‌నే చెప్పాలి.

అయినా లోకేశ్ ఏమ‌న్నార‌న్న విష‌యం చెప్ప‌కుండా ఈ సోది ఎందుక‌నేగా మీ ప్ర‌శ్న‌? అయితే లోకేశ్ నోటి నుంచి జాలువారిన మాట ఏంటంటే... *ఏపీకి పెద్ద ప‌రిశ్ర‌మ‌లు రావు*... నిజ‌మా లోకేశ్ ఇంత మాట అనేశారా? అని నోరెళ్ల‌బెట్టాల్సిన అవ‌స‌రం ఎంత‌మాత్రం లేదు. ఎందుకంటే... ఏపీకి ప‌రిశ్ర‌మ‌లు రావ‌న్న త‌న మాట‌కు కార‌ణాలు కూడా లోకేశ్ నోట నుంచే వినిపించాయి. ఆ కార‌ణం ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... పెద్ద పెద్ద ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేసేందుకు అవ‌స‌ర‌మైన భూములు విశాఖ‌లో అందుబాటులో లేవ‌ట‌. ఒక్క విశాఖలోనే కాకుండా ఏపీ వ్యాప్తంగానూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంద‌ని కూడా లోకేశ్ ముక్తాయించారు. అంటే... పెద్ద ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేసేందుకు అవస‌ర‌మైన భూమి ల‌భించ‌దు కాబ‌ట్టి... ఏపీకి ప‌రిశ్ర‌మ‌లు రావంతే. ఇదే క‌దా లోకేశ్ చెప్పిన మాట‌.

నిజ‌మే స‌రిప‌డినంత మేర స్థ‌లం లేక‌పోతే ఏ కార్పొరేట్ సంస్థ అయినా ఎందుకు వ‌స్తుంది చెప్పండి. ఇక మ‌న రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై కాస్తంత వెన‌క్కెళితే.. అస‌లే రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో న‌వ్యాంధ్ర తీవ్ర‌ ఆర్థిక లోటుతో ఇబ్బంది ప‌డుతోంది. రాష్ట్ర విభ‌జ‌న సమ‌యంలో 16 వేల కోట్లుగా ఉన్న ఆర్థిక లోటు... మూడేళ్లు గ‌డిచేస‌రికి 20 వేల కోట్ల పై చిలుకుకు వెళ్లిపోయింద‌ని సాక్షాత్తు టీడీపీ ప్ర‌భుత్వ‌మే చెబుతోంది. ఈ క్ర‌మంలో న‌వ్యాంధ్ర‌ను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తేనే త్వ‌ర‌గా కోలుకునే అవ‌కాశాలున్నాయ‌ని లోకేశ్ పార్టీకి అధినేత‌గానే కాకుండా లోకేశ్ మంత్రిగా ఉన్న ఏపీ కేబినెట్‌కు లీడ‌ర్ అయిన ఆయ‌న తండ్రి నారా చంద్ర‌బాబునాయుడు నిత్యం చెబుతున్న మాట మ‌న‌కు తెలిసిందే.

ఈ క్ర‌మంలోనే నిన్న నారా లోకేశ్ ప‌ర్య‌టించిన విశాఖ‌లోనే వ‌రుస‌గా రెండేళ్ల పాటు బిజినెస్ స‌మ్మిట్ల‌ను చంద్ర‌బాబు స‌ర్కారు నిర్వ‌హించింది. స‌ద‌రు స‌ద‌స్సుల స‌హాయంతో ఏపీకి ల‌క్ష‌లాది కోట్ల రూపాయ‌ల విలువ చేసే కంపెనీలు రాబోతున్నాయ‌ని కూడా బాబు స‌ర్కారు జ‌బ్బ‌లు చ‌రుచుకుంది. మ‌రి లోకేశ్ ఇలా అన్నారేమిట‌ని ఆలోచిస్తున్నారా? అస‌లు విష‌యం అదే కాబ‌ట్టి లోకేశ్ నోటి నుంచి ఆ మాట వినిపించింద‌నే చెప్పాలి. ఎందుకంటే ఉడుకు ర‌క్తంలో ఉన్న లోకేశ్ లో ప‌చ్చి నిజం అంత ఈజీగా దాగి ఉండ‌దుగా. అందుకే ఉన్న వాస్త‌వాన్ని ఆయ‌న ఒప్పేసుకున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది.

అస‌లు ఇప్పుడు విశాఖ‌ను భూ బ‌కాసూరుల అవ‌తారం ఎత్తిన తెలుగు త‌మ్ముళ్లు న‌మిలి మింగేశారు. అయితే దానిని క‌క్కించే బాధ్య‌త‌ను తీసుకున్న అదే పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌, సీనియ‌ర్ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు త‌న సొంత పార్టీ నేత‌ల‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఇక టీడీపీ మిత్ర‌ప‌క్షం బీజేపీకి చెందిన కీల‌క నేత‌, విశాఖ ఉత్త‌ర ఎమ్మెల్యేగా ఉన్న విష్ణుకుమార్ రాజు కూడా తెలుగు త‌మ్ముళ్ల భూదాహంపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తీ తెలిసిందే. అందుబాటులో ఉన్న ప్ర‌భుత్వ భూముల‌న్నీ తెలుగు త‌మ్ముళ్లే మింగేస్తే... ఇక ప‌రిశ్రమ‌ల‌కు అందించేందుకు భూములెక్క‌డ ఉన్నాయి చెప్పండి. ఇదే భావ‌న‌తోనే లోకేశ్ ఆ మాట అని ఉంటార‌న్న వాద‌న ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ గా మారిపోయింది.