Begin typing your search above and press return to search.

సినిమా సెట్టింగుల పిచ్చ ఏంది నారాయ‌ణ‌

By:  Tupaki Desk   |   19 Sep 2017 5:00 AM GMT
సినిమా సెట్టింగుల పిచ్చ ఏంది నారాయ‌ణ‌
X
య‌ధా రాజా.. త‌ధా ప్ర‌జా అన్న నానుడిని కాస్త మార్చుకోవాలి. అధినేత బాబు అడుగుజాడ‌ల్లో న‌డుస్తున్న మంత్రుల తీరు ఇప్పుడు ఏపీ ప్ర‌జ‌ల‌కు విసుగు క‌లిగిస్తోంది. ఏపీ రాజ‌ధానినిర్మాణం మీద ఇంత‌కాలం బాబు చెప్పిన డాబుస‌రి మాట‌ల‌న్నీ ఉత్త‌వేన‌న్న విష‌యం ఇప్పుడిప్పుడే అర్థ‌మ‌వుతోంది.

ఎన్నిక‌ల నాటికి ఒక‌ట్రెండు ముఖ్య‌మైన భ‌వ‌నాలు క‌ట్టాల‌న్న ఆలోచ‌న‌లో బాబు ఉన్న‌ట్లుగా మాట వినిపించినా అదేమీ నిజం కాద‌న్న విష‌యం తాజా ప‌రిణామాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న న‌మూనాలు.. చంద్ర‌బాబుకు మాత్రం న‌చ్చ‌క‌పోవ‌టం విస్మ‌యాన్ని క‌లిగిస్తోంది. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి చెందిన కంపెనీలు త‌యారు చేస్తున్న‌న‌మూనాల‌కు వంక‌లు పెడుతున్న ముఖ్య‌మంత్రి.. సినిమా సెట్టింగులు వేయించే ద‌ర్శ‌కుడ్ని స‌ల‌హాల కోసం పిల‌వ‌టం ఇప్పుడు ఆశ్చ‌ర్య‌క‌రంగా మారింది.

బాహుబ‌లితో అద్భుత‌మైన స‌క్సెస్‌ను సొంతం చేసుకున్న రాజ‌మౌళి మేధోత‌నాన్ని త‌క్కువ చేయ‌టం మా ఉద్దేశం ఎంత‌మాత్రం కాదు. ఒక ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా ఆయ‌న చెప్పిన మాట‌ల్నే చెబితే.. సినిమా వేరు.. రియ‌ల్ లైఫ్ వేర‌ని చెప్ప‌టంతో పాటు అమ‌రావ‌తి నిర్మాణానికి డిజైన్ల మీద స‌ల‌హాలు ఇచ్చే స్థాయి లేద‌న్న మాట‌ను ఆయ‌న చెప్పారు. అయిన‌ప్ప‌టికీ అమ‌రావ‌తి నిర్మాణ డిజైన్లకు రాజ‌మౌళి స‌ల‌హాలు తీసుకోవాల‌న్న బాబు మాట వెనుక అస‌లు ఉద్దేశం వేరని చెబుతున్నారు.

అమ‌రావ‌తి నిర్మాణాల కోసం రాజీ ప‌డ‌టం లేద‌ని.. చాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లుగా ప్ర‌జ‌ల్లోకి సందేశం వెళ్లాల‌న్నదే బాబు త‌ప‌న‌గా తెలుస్తోంది. ఎందుకంటే.. ఇప్ప‌టికిప్పుడు డిజైన్లు రెఢీ అయితే ప‌నులు ప్రారంభించ‌టానికి అవ‌స‌ర‌మైన నిధులు లేవు. దీంతో.. డిజైన్ల ద‌గ్గ‌ర మ‌రికొంత కాలం గ‌డిపేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. లండ‌న్‌కు చెందిన నార్మ‌న్ ఫోస్ట‌ర్ ఇచ్చిన డిజైన్ల‌ను తిర‌స్క‌రించిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. రాజ‌మౌళిని క‌లిసి స‌ల‌హాలు తీసుకోవాల‌ని సూచించ‌టం తెలిసిందే.

ఈ మాట ప్ర‌జ‌ల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర‌తీయ‌టంతో.. ఆ టెంపోను మొయింటైన్ చేయ‌టమే ల‌క్ష్యంగా ఏపీ స‌ర్కారు అడుగులు వేస్తోంది. తాజాగా.. మంత్రి నారాయ‌ణ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిని క‌లిశారు. వారిచ్చిన డిజైన్ల‌ను చూసిన రాజ‌మౌళి త‌న అభిప్రాయాల్ని చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. మ‌రింత అధ్య‌య‌నం చేసిన త‌ర్వాత త‌న ఆలోచ‌న‌ల్ని మ‌రిన్ని చెబుతాన‌ని మ‌ర్యాద‌పూర్వ‌కంగా మాట్లాడిన‌ట్లు స‌మాచారం.

ఇక్క‌డ విష‌యం ఏమిటంటే.. నారాయ‌ణ లాంటి ఒక బిజినెస్ మేన్‌కు డిజైన్ల‌న‌ను ఎవ‌రి చేత స‌ల‌హాలు తీసుకోవాలో తెలుసు. కానీ.. అధినేత ఆదేశాల నేప‌థ్యంలో రాజ‌మౌళిని క‌లిసిన‌ట్లుగా చెబుతున్నారు. సినిమా సెట్టింగులు.. శాశ్విత క‌ట్ట‌డాలు ఒకేలా ఉండ‌వ‌ని..ఊహా ప్ర‌పంచాన్ని గ్రాఫిక్స్ తో సృష్టించ‌టం ఖ‌రీదైన వ్య‌వ‌హార‌మైతే.. శాశ్విత క‌ట్ట‌డాలుగా మార్చ‌టం ఏపీ లాంటి లోటు బ‌డ్జెట్ ఉన్న రాష్ట్రానికి భారీ భారంగా మారుతుంద‌ని చెప్పక త‌ప్ప‌దు.