Begin typing your search above and press return to search.

నిశిత్ మృతి ఫోరెన్సిక్ నిపుణుల అభిప్రాయం ఇది

By:  Tupaki Desk   |   10 May 2017 10:59 AM GMT
నిశిత్ మృతి ఫోరెన్సిక్ నిపుణుల అభిప్రాయం ఇది
X
ఏపీ మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ నారాయణ(22)తో పాటు అతని స్నేహితుడు రాజా రవివర్మ(23) మృతిచెందిన ఘ‌ట‌న‌లో ఫోరెన్సిక్ రిపోర్ట్ వ‌చ్చింది. అపోలో ఆస్పత్రి ఫోరెన్సిక్ వైద్యుడు సురేంద‌ర్ రెడ్డి ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. నిశిత్ మృతిపై మెడికల్ రిపోర్ట్ లో భాగంగా ఆయ‌న వివ‌రాలు వెల్ల‌డిస్తూ... అతివేగంతో పిల్లర్ ను ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని తెలిపారు. ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లోనే చనిపోయి ఉంటారని వివ‌రించారు.

వాహ‌నం న‌డుపుతున్న స‌మ‌యంలో మంత్రి కుమారుడు నిశిత్, ఆయ‌న స్నేహితుడు రవివర్మ మద్యం సేవించలేద‌ని వెల్ల‌డించారు. అయితే ప్ర‌మాదంలో బలంగా దెబ్బలు తగలడంతో ఇద్దరు మృతి చెందారని సురేంద‌ర్ రెడ్డి వివ‌రించారు. డ్రైవింగ్ సీట్లో ఉన్న నిశిత్ ఛాతికి స్టీరింగ్ బలంగా తాకిందని దీంతో నిశిత్ ఊపిరితిత్తులకు తీవ్ర గాయం అయింద‌ని వెల్ల‌డించారు. కాలేయం కూడా ముక్కలు ముక్కలు అయ్యిందని ఫోరెన్స్ నిపుణులైన డాక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి తెలిపారు.

మ‌రోవైపు ప్రమాదస్థలి సమీపంలో ఉన్న వాచ్ మెన్ కథనం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో పెద్ద శబ్దం వినిపించిందని వాచ్‌మ‌న్ తెలిపాడు. శబ్దం ధాటికి మెళకువ వచ్చిందని దీంతో ప్రమాదస్థలికి వెళ్లి చూడగా కారు మెట్రో పిల్లర్ ను ఢీకొట్టిందన్నాడు. మెట్రో పిల్లర్ గోడ కూడా బద్దలైనట్లు చెప్పాడు. కారు ఇంజిన్ పూర్తిగా బయటకు వచ్చిందని పేర్కొన్నాడు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని వాచ్ మెన్ తెలిపాడు.

కాగా, అధికారిక పర్యటన నేపథ్యంలో లండన్‌లో ఉన్న మంత్రి నారాయణ కుమారుడి మృతి వార్త తెలుసుకున్న తక్షణమే లండన్ నుంచి హైదరాబాద్ కు బయల్దేరారు. ఈ రోజు రాత్రి వరకు నారాయణ నెల్లూరు చేరుకోనున్నారు. మ‌రోవైపు గురువారం నెల్లూరులో నిశిత్ అంత్యక్రియలు జరగనున్నాయి. పోస్టుమార్టం అనంతరం నిశిత్ పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులు నెల్లూరుకు తరలించారు.