Begin typing your search above and press return to search.

డ‌బ్బు పంపిణీ షురూ!.... తొలి ముద్దాయి నారాయ‌ణే!

By:  Tupaki Desk   |   24 March 2019 3:57 PM GMT
డ‌బ్బు పంపిణీ షురూ!.... తొలి ముద్దాయి నారాయ‌ణే!
X
ఈ ఎన్నిక‌ల్లో ఏపీ ప్ర‌త్యేక‌మ‌నే చెప్పాలి. ఎందుకంటే... సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నిక‌లు జ‌రుగుతున్న దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒక‌టి. అంతేనా... ఈ ఐదు రాష్ట్రాల్లోనూ హోరాహోర పోరు సాగుతున్న రాష్ట్రంగానూ ఏపీనే అని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రోమారు అధికార ప‌గ్గాలు చేప‌ట్టాల‌ని టీడీపీ, ఈ సారి ఎలాగైనా అధికారి చేప‌ట్టి తీరాల్సిందేన‌న్న పట్టుతో వైసీపీల మ‌ధ్య హోరాహోరీగా పోరు సాగుతోంది. ఈ క్ర‌మంలో రేప‌టితో నామినేష‌న్ల ప్ర‌క్రియ ముగియ‌నుండ‌గా... అభ్య‌ర్థుల‌తో పాటు ఆయా పార్టీలు కూడా ముమ్మ‌ర ప్ర‌చారం చేయ‌నున్నాయి. ఇలాంటి కీల‌క త‌రుణంలో టీడీపీ ఎన్నిక‌ల వ్యూహాల్లో కీల‌క వ్య‌క్తిగా ప‌రిగ‌ణిస్తున్న నారాయ‌ణ విద్యా సంస్థ‌ల అధినేత‌, ఏపీ మంత్రి పొంగూరు నారాయ‌ణ అడ్డంగా బుక్కైన‌ట్టుగా వినిపిస్తున్న వార్త‌లు ఇప్పుడు పెను క‌ల‌క‌లం రేపుతున్నాయి.

అస‌లే జరిగింద‌న్న విష‌యానికి వ‌స్తే... నెల్లూరు అర్బ‌న్ సీటు నుంచి టీడీపీ అభ్యర్థిగా నారాయ‌ణ బ‌రిలోకి దిగిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్న నారాయ‌ణ‌... త‌న గెలుపు కో్సం త‌న విద్యా సంస్థ‌ల సిబ్బందిని, వాహ‌నాల‌ను కూడా వాడేస్తున్నార‌ని ఇటీవ‌లే పెద్ద రాద్ధాంతం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో నెల్లూరు నగరంలోని చిన్న బజార్‌లో ‘నారాయణ’ విద్యాసంస్థల సిబ్బంది, టీడీపీ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతుండగా వైసీపీ నేతలు, స్థానికులు వాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. వీరి వద్ద భారీ నగదు ఉన్నట్లు తెలిసింది.

ఇక, నారాయణ విద్యాసంస్థ ఏజీఎం రమణారెడ్డి, మరో జూనియర్ లెక్చరర్ ఓటర్లకు నగదు పంపిణి చేస్తుండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న వారి నుంచి సుమారు రు. 15 లక్షలు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. రమణా రెడ్డి నేతృత్వంలోనే నగదు పంపిణి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విష‌యం తెలుసుకున్న వెంట‌నే నెల్లూరు అర్బ‌న్ ఎమ్మెల్యే, వైసీపీ నేత‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌... నారాయ‌ణ‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. వైసీపీ ఓటు బ్యాంక్ ఉన్న ప్రాంతాల్లో డబ్బుతో ఓట్లను కొనేందుకు నారాయణ ప్రయత్నిస్తున్నారని ఆయ‌న ఆరోపించారు. నారాయణ విద్యా సంస్థల ఉద్యోగులతో ఈ విధంగా డబ్బును పంపిణీ చేయిస్తున్నారన్నారని ఆయన అన్నారు. దీనిపై వెంటనే ఎలక్షన్‌ కమిషన్‌ చర్యలు తీసుకోవాలని అనిల్ డిమాండ్‌ చేశారు.