Begin typing your search above and press return to search.

ఇక నారాయ‌ణ వ‌ర్సెస్ సోమిరెడ్డి!

By:  Tupaki Desk   |   6 Nov 2017 7:04 AM GMT
ఇక నారాయ‌ణ వ‌ర్సెస్ సోమిరెడ్డి!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో అధికారంలో ఉన్న టీడీపీలో విచిత్ర ప‌రిస్థితి నెల‌కొంది. కావ‌ల‌సినంత మెజార్టీ ఉన్నా ప్ర‌తిప‌క్షాన్ని బ‌ల‌హీనం చేయాల‌నే ల‌క్ష్యంతో పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించ‌డం అధికార పార్టీలో ముస‌లానికి కార‌ణ‌మ‌వుతోంది. దీంతో ఎప్ప‌టి నుంచో పార్టీని న‌మ్ముకున్న త‌మ‌ను కాద‌ని ఇటీవ‌ల పార్టీలోకి వ‌చ్చిన‌వారిని అంద‌లం ఎక్కిస్తున్నార‌ని నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అధికార టీడీపీలో నామినేటెడ్‌ పదవుల పందేరంపై వివాదం తీవ్రరూపం దాల్చింది. ఇప్పటికే ఆ పార్టీలో నివురుగప్పిన నిప్పులా అంతర్గతంగా సాగుతున్న వివాదాలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. సీనియర్ - జూనియర్‌ నేతల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు పార్టీ పెద్దలు అగ్ర తాంబూలం ఇస్తూ, అందలం ఎక్కిస్తుండటంతోపాటు దశాబ్దాల తరబడి పార్టీని నమ్ముకుని పని చేసిన కార్యకర్తలకు మొండిచేయి చూపడంపై నిరసన వ్యక్తమవుతోంది.

ఈ క్ర‌మంలో నెల్లూరు జిల్లా టీడీపీ వ్య‌వ‌హారం మంత్రులు పొంగూరు నారాయణ వర్సెస్‌ సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి మధ్య గ్రూపు రాజకీయాలుగా మారాయని చెప్తున్నారు. కాంగ్రెస్ - ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పార్టీతోపాటు నామినేటెడ్‌ పదవుల్లో కీలక ప్రాధాన్యత దక్కేలా మంత్రి నారాయణ చక్రం తిప్పుతుండటంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు. టీడీపీ అధినేత - ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు వద్ద నారాయ‌ణ‌కు ఉన్న పలుకుబడితో ఆయ‌న ఏ నిర్ణ‌యం తీసుకున్నా జిల్లా నేత‌లు కిమ్మ‌న‌కుండా ఉండేవారు. అయితే సీనియర్ నేత - రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి కేబినెట్‌ లో చోటు ద‌క్కించుకోవ‌డంతో రాజ‌కీయ ముఖ‌చిత్రం మారిపోయింది. నారాయ‌ణ నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేరిస్తున్న నేత‌లంతా సోమిరెడ్డి చెంత‌కు చేరిపోయారు. తద్వారా నెల్లూరు జిల్లా టీడీపీలో నారాయణ - సోమిరెడ్డి మధ్య విభేదాలు పొడచూపాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

ముఖ్యంగా ఇత‌ర పార్టీల నుంచి వ‌ల‌స‌ల‌ను మంత్రి నారాయణ ప్రోత్సహిస్తున్నార‌ని.. చిన్నస్థాయి నామినేటెడ్‌ పదవుల నుంచి పార్టీ పదవుల వరకు అన్నీ వారికే క‌ట్ట‌బెడుతున్నార‌నేది టీడీపీ అసంత‌ృప్తుల ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ఈ విష‌యంలో కొంద‌రు సీనియర్లు పార్టీ వేదికలపైనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రులు బల్లి దుర్గాప్రసాద్ - తాళ్లపాక రమేష్‌ రెడ్డి నేతల తీరుపై పూర్తి అసంతృప్తితో పార్టీకి దూరంగా ఉన్న‌ట్లు స‌మాచారం. నామినేటెడ్‌ పదవి ఏదైనా కేటాయించాలని - కనీసం పార్టీ పదవైనా ఇవ్వాలని పలుమార్లు కోరినా అధిష్టానం పట్టించుకోకపోవడంతో ఇద్దరూ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. మరో సీనియర్‌ నేత మండవ రామయ్య - కొంతకాలం క్రితం వరకు ఆత్మకూరు ఇన్‌చార్జ్‌గా ఉన్న కన్నబాబు - నగరం నుంచి పార్టీలో కీలక బీసీ నేతగా - నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌ ఫ్లోర్‌ లీడర్‌ గా ఉన్న డాక్టర్‌ జడ్ శివప్రసాద్ - పార్టీ ఎస్సీ నేత ఎన్‌.శైలేంద్రబాబు నామినేటెడ్‌ పదవులు ఆశించి.. మంత్రుల ద్వారా నామినేటెడ్‌ పదవుల కోసం ప్రయత్నించారు. వారికి న్యాయం చేస్తామని మంత్రులు చెప్పడం మినహా పట్టించుకున్న దాఖలాలు లేవు.

దీంతో జిల్లాలోని టీడీపీ సీనియర్‌ నేతలంతా మంత్రి నారాయణ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. పెద్దఎత్తున పార్టీ ఫిరాయింపుదారులను ప్రోత్సహిస్తూ సీనియర్‌ నాయకులకు అన్యాయం చేస్తున్నారని దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ - జూనియర్ల వివాదం ముదిరి పాకానపడింది. మరో ఏడాదిన్నరలో అసెంబ్లీ - లోక్ సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ అసమ్మతిని సమసిపోయేలా చ‌ర్య‌లు తీసుకోకుంటే పార్టీకి న‌ష్టం వాటిల్లుతుంద‌ని ప‌రిశీల‌కులు హెచ్చ‌రిస్తున్నారు.