Begin typing your search above and press return to search.

రెండు రోజుల ముచ్చటే: మోడీ వేటును ఆపిన బర్త్ డే

By:  Tupaki Desk   |   7 July 2016 5:36 AM GMT
రెండు రోజుల ముచ్చటే: మోడీ వేటును ఆపిన బర్త్ డే
X
ప్రధాని మోడీకి ఎలాంటి మొహమాటాలు ఉండవన్న విషయం తెలిసిందే. అయితే.. ఆయన సైతం కొన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకొని మినహాయింపులు ఇస్తారన్న విషయం తాజా ఉదంతం చెబుతుందని చెప్పాలి. రెండు రోజుల క్రితం మంత్రివర్గ విస్తరణను చేపట్టిన మోడీ.. అదే రోజు మధ్యాహ్నం ఐదుగురు మంత్రులపై వేటు వేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి వేటు పడాల్సిన మంత్రుల సంఖ్య ఆరు అని కొన్ని ప్రత్యేక కారణాలతో ఐదుకు పరిమితం చేసిన ఆసక్తికర అంశం బయటకు వచ్చింది.

పనితీరు సరిగా లేని మంత్రులపై వేటు వేయాలని ప్రధాని నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్ని వేటు పడే మంత్రుల్లో ఒకరైన జీఎం సిద్ధేశ్వర్ (కర్ణాటక)కు తెలిసిందే. వేటు పడే రోజునే తన పుట్టినరోజు కావటం.. ఆ రోజున తన కార్యకర్తలు.. అభిమానులు పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకల్ని చేపట్టిన విషయాన్ని పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. తనకు ఒకరోజు అవకాశం ఇస్తే.. బర్త్ డే సెలబ్రేషన్స్ పూర్తి అయిన వెంటనే తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పుకున్నారట.

దీంతో.. రాష్ట్రపతి భవన్ కు పంపాల్సిన ఆరుగురి పేర్లు కాస్తా ఐదుకు పరిమితం చేసి పంపినట్లు తెలుస్తోంది. ముందుగా చెప్పిన మాట ప్రకారం సిద్ధేశ్వర్ ఢిల్లీకి వెళ్లి పార్టీ అధినాయకత్వాన్ని కలిసి.. అనంతరం తన రాజీనామా లేఖను ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. ఏమైనా బర్త్ డే మాటకు మోడీ ఓకే చెప్పి వేటు వేయకుండా ఉండటంపై పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.