Begin typing your search above and press return to search.

మంత్రి మాటల్లోనే అమరావతి పనులు సున్నానే!

By:  Tupaki Desk   |   15 Feb 2018 7:32 AM GMT
మంత్రి మాటల్లోనే అమరావతి పనులు సున్నానే!
X
అమరావతి రాజధానిలో జరుగుతునన్న నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్షించడమూ.. రెండు వారాలకు ఓసారి డ్రోన్ కెమెరాలతో ఫోటోలు తీసి తనకు చూపించాలని ఆదేశించడమూ లాంటి వ్యవహారాలు పాఠకులకు తెలుసు. అయితే ఆతర్వాత.. మంత్రి నారాయణ.. అమరావతిలో జరుగుతున్న పనుల గురించి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇదిగో అయిపోతున్నది.. అదిగో అయిపోతున్నది.. అంటూ మంత్రిగారు చాలా మాటలు చెప్పారు గానీ.. ఆయన చెప్పిన వివరాలను కూలంకషంగా పరిశీలించిన వారికి మాత్రం.. అసలు అమరావతిలో చెప్పుకోదగ్గ పనులేవీ ఇంకా మొదలు కాలేదనే సందేహమే కలుగుతోంది.

మంత్రి చెప్పిన ప్రకారం అమరావతిలో 320 కి.మీ. ప్రధాన రోడ్లకు సంబంధించిన కసరత్తు మాత్రమే ప్రస్తుతం జరుగుతోంది. ఏ ఒక్కరోడ్డుకూడా నిర్దిష్టంగా పూర్తయిన పాపాన పోలేదు. అసలు పది ప్రధాన రహదార్లకు సంబంధించి ఇంకా టెండర్లు పిలవడం కూడా జరగనే లేదు. అయినా సరే మంత్రిగారు మాత్రం మరో పదినెలల్లో అంటే 2018 సంవత్సరాంతానికి రోడ్లన్నీ రెడీ అయిపోతాయ్ అని సెలవిస్తున్నారు. విజయవాడలో ఒక్క ఫ్లైఓవర్ నిర్మాణాన్ని మూడు సంవత్సరాలకు పైబడి సాగదీస్తూనే ఉన్న ఈ ప్రభుత్వం 320 కి.మీ. ల రోడ్లను పదినెలల్లో పక్కాగా పూర్తి చేసేస్తుందని నమ్మడం ఎలాగా? ఇదొక పెద్ద ప్రశ్న.

మరోవైపు నిర్మాణాల సంగతి. అమరావతి నగర నిర్మాణం విషయంలో చంద్రబాబుకు ఒక్కో సమయంలో ఒక్కో తీరుగా మాట్లాడుతున్నారు. మనం కష్టపడుతున్నాం.. మన నగరాన్ని మనమే కట్టుకోలేమా అని ఒకసారి అంటారు. కేంద్రం నిధులిచ్చి మద్దతివ్వకపోతే ఎలాగ అంటారు? కోర్ కేపిటల్ నిర్మాణం మొత్తం కేంద్రానిదే బాధ్యత అని మరోసారి అంటారు. ఇలా రకరకాలుగా సెలవిస్తుంటారు. అయితే రాజధానిలో భవనాలకు సంబంధించి.. ప్రస్తుతానికి జరుగుతున్నది ఒక్క ఉద్యోగుల భవన సముదాయం పనులు మాత్రమే. అదికూడా.. చాలా ప్రాథమిక దశలో ఉంది. ఇప్పటిదాకా ఒక్క శ్లాబు కూడా పడలేదు. మరో నెలలోగా శ్లాబు పడే అవకాశం కూడా లేదు. కానీ మంత్రిగారు మాత్రం.. మరో అయిదు నెలలో మొత్తం 12 అంతస్తుల శ్లాబులు వేసేస్తాం అని ఢంకా బజాయించి చెప్పేస్తున్నారు. మంత్రిగారు రవ్వంత ఆలోచించి ప్రతిజ్ఞలు చేస్తే బాగుంటుందని జనం అంటున్నారు. ఎందుకంటే.. ఈ డెడ్ లైన్ల విషయంలో ఈసారి ఫెయిలైతే.. నిధులు రావడం లేదంటూ కేంద్రం మీద నిందలు వేయడానికి కూడా ఛాన్సుండదు, మంత్రిగారు గుర్తుంచుకోవాలని ప్రజలు కోరుతున్నారు.